Skip to main content
Install App
If you're using:

మేధో వైకల్యం అంటే ఏమిటి? – సంక్షిప్త సమాచారం

Default Avatar

Nayi Disha Team

Also available in: हिंदी English

Key Takeaways:

  • మేధో వైకల్యం (ID) అనేది నేర్చుకోవడం, సామాజిక నైపుణ్యాలు, రోజువారీ పనులను ప్రభావితం చేస్తుంది.
  • ఇది సాధారణంగా 5–18 సంవత్సరాల మధ్య గుర్తించబడవచ్చు.
  • సహాయం, థెరపీలతో పిల్లల్లో స్వతంత్రంగా పనులు చేసుకునే సామర్థ్యం పెరుగుతుంది.
  • పిల్లల అభివృద్ధిలో కుటుంబ సభ్యుల భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది
  • పిల్లలకు అవసరమైన సహాయం అందించడానికి సరైన సమాచారం, నిపుణుల మార్గదర్శకత్వం అందుబాటులో ఉన్నాయి.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [1.95 MB]

మీ పిల్లలకు లేదా మీకు తెలిసిన ఎవరికైనా మేధో వైకల్యం ఉన్నట్లు నిర్ధారణ అయిందా? అలా అయితే, మీలో మిశ్రమ భావనలు కలగవచ్చు. మీరు ఈ పదాన్ని మొదటిసారి వింటూ ఉండవచ్చు లేదా దీని గురించి కొంతవరకు తెలిసి ఉండవచ్చు. ప్రస్తుతం మీకు అవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని మేధో వైకల్యం – సంక్షిప్త సమాచారం ఫ్యాక్ట్ షీట్  లో అందించాము.

మేధో వైకల్యం (ID) అంటే ఏమిటి?

మేధో వైకల్యం (గతంలో మెంటల్ రిటార్డెషన్ – MR అని పిలిచేవారు; ఈ పదాన్ని ఇప్పుడు ఉపయోగించడం లేదు.) అనేది చిన్నతనంలో ప్రారంభమయ్యే ఒక నాడీ అభివృద్ధి పరిస్థితి. ఇది సాధారణంగా 5–18 సంవత్సరాల మధ్య గుర్తించబడుతుంది. ఇది నేర్చుకోవడం, ఇతరులతో సామాజికంగా కలవడం, రోజువారీ పనులు చేసుకోవడం వంటి విషయాల్లో ఆలోచనా సామర్థ్యం మరియు రోజువారీ జీవన నైపుణ్యాలపై ప్రభావం చూపవచ్చు. అయితే, సరైన సహాయం, అందుబాటులో ఉన్న వనరులు, కుటుంబ సభ్యుల చురుకైన భాగస్వామ్యంతో మేధో వైకల్యం ఉన్న పిల్లలు కొత్త విషయాలు నేర్చుకుంటూ, అభివృద్ధి చెందుతూ, సంతృప్తికరమైన జీవితాన్ని గడపగలరు.

మీ పిల్లల వైకల్యాన్ని అర్థం చేసుకోవడం

మేధో వైకల్యం యొక్క ప్రారంభ సంకేతాలు, లక్షణాలు

  • మేధో వైకల్యం యొక్క ప్రారంభ సంకేతాలు పిల్లల వయస్సు, అభివృద్ధి దశను బట్టి ఒక్కోలా ఉండవచ్చు. తల్లిదండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయులు గమనించగల కొన్ని సంకేతాలు:
  • నడవడం, మాట్లాడటం, టాయిలెట్ ఉపయోగించడం నేర్చుకోవడం వంటి అభివృద్ధి దశలను చేరుకోవడంలో ఆలస్యం కావడం
  • సమస్యలను పరిష్కరించడంలో లేదా చెప్పిన విషయాలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడటం
  • భాష మరియు కమ్యూనికేషన్ లో సవాళ్లు
  • తినడం, బట్టలు వేసుకోవడం, రోజువారీ పనులను పాటించడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం
  • ఇతర పిల్లలతో కలవడంలో లేదా కొత్త పరిస్థితుల్లో తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో ఇబ్బంది పడటం.

ప్రతీ పిల్లలు తమదైన వేగంతో అభివృద్ధి చెందుతారని గుర్తుంచుకోవడం ముఖ్యం. అయితే, కొంతకాలంగా పిల్లల్లో ఒకటి కంటే ఎక్కువ విషయాల్లో ఇబ్బందులు కనిపిస్తుంటే, వారి అభివృద్ధిని పూర్తిగా అంచనా వేయడానికి డెవలప్‌మెంటల్ పీడియాట్రిషియన్ లేదా చైల్డ్ సైకాలజిస్ట్‌ను సంప్రదించడాన్ని పరిగణించండి.

మేధో వైకల్యం ఎందుకు వస్తుంది?

మేధో వైకల్యానికి ఒకే  కారణం ఉండదు. చాలా సందర్భాల్లో, దీనికి నిర్దిష్ట కారణాన్ని గుర్తించడం కూడా సాధ్యం కాకపోవచ్చు. అయితే, కొన్ని కారణాలు ఇవి:

  • డౌన్ సిండ్రోమ్, ఫ్రాజైల్ X సిండ్రోమ్ వంటి జన్యుపరమైన పరిస్థితులు
  • గర్భధారణ సమయంలో లేదా ప్రసవ సమయంలో ఎదురయ్యే సమస్యలు (ఉదాహరణకు, పుట్టినప్పుడు మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోవడం)
  • చిన్న వయస్సులో వచ్చే కొన్ని ఇన్ఫెక్షన్లు లేదా తీవ్రమైన అనారోగ్యాలు
  • తలకు గాయాలు లేదా సీసం వంటి పర్యావరణంలోని హానికర పదార్థాలకు గురికావడం

గుర్తుంచుకోండి: మేధో వైకల్యానికి తల్లిదండ్రులు సరిగ్గా పెంచకపోవడం, పిల్లలకు తగినంత ప్రోత్సాహం లేదా అవకాశాలు ఇవ్వకపోవడం కారణం కాదు. అలాగే, పిల్లలు లేదా తల్లిదండ్రులు ఏదైనా “తప్పు” చేయడం వల్ల ఇది రాదు. ఇది మెదడు అభివృద్ధికి సంబంధించిన ఒక పరిస్థితి. అందుకే నిందించడం కంటే, అర్థం చేసుకుని అవసరమైన సహాయం అందించడం ముఖ్యం.

మేధో వైకల్యం ఎలా నిర్ధారిస్తారు?

మేధో వైకల్యాన్ని నిర్ధారించడానికి సాధారణంగా వివిధ రకాల అంచనాలు, పరీక్షలు కలిసి ఉపయోగిస్తారు:

  • అభివృద్ధి అంచనా: పిల్లలు శారీరక, భావోద్వేగ, సామాజిక అభివృద్ధికి సంబంధించిన మైలురాళ్లను ఎలా చేరుకుంటున్నారో పరిశీలిస్తారు.
  • IQ పరీక్ష: పిల్లల మేధో సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఈ పరీక్షను ఉపయోగిస్తారు. (అయితే, ఏ ఒక్క పరీక్ష కూడా పిల్లల సామర్థ్యాన్ని లేదా వారి భవిష్యత్తు అవకాశాలను పూర్తిగా నిర్ణయించదు.)
  • రోజువారీ జీవన నైపుణ్యాల (అడాప్టివ్ బిహేవియర్) అంచనా: కమ్యూనికేషన్, స్వీయ సంరక్షణ, రోజువారీ పనులు చేసుకోవడం వంటి నైపుణ్యాలను అంచనా వేస్తారు.

ఈ అంచనాలను పిడియాట్రిషియన్లు, క్లినికల్ సైకాలజిస్టులు లేదా అభివృద్ధి సంబంధిత పరిస్థితులపై శిక్షణ పొందిన ప్రత్యేక విద్యా నిపుణులు నిర్వహిస్తారు.

ముందుగానే గుర్తించడం ఎందుకు ముఖ్యం? 

మేధో వైకల్యాన్ని ముందుగానే గుర్తించడం వల్ల సరైన సమయంలో అవసరమైన థెరపీలు, సహాయం అందించే అవకాశంఉంటుంది. అలాగే, తల్లిదండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయులు పిల్లల అవసరాలను మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల:

  • పిల్లలు తమకు అనుకూలమైన వేగంతో రోజువారీ జీవన నైపుణ్యాలను  నేర్చుకోవడానికి సహాయం చేయవచ్చు.
  • పిల్లల సామర్థ్యానికి తగిన, సహాయకరమైన లక్ష్యాలను నిర్ణయించడం ద్వారా ఒత్తిడి, నిరాశను తగ్గించవచ్చు.
  • ఆత్మవిశ్వాసం తగ్గడం లేదా ఇతరులకు దూరంగా ఉండే పరిస్థితులను  నివారించడంలో సహాయపడవచ్చు.
  • పాఠశాలలు, సమాజం పిల్లలు చురుకుగా పాల్గొనేలా అవసరమైన సౌకర్యాలు, సహాయాన్ని అందించగలవు.
  • కుటుంబాలు బలమైన సహాయక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని, పిల్లలకు అవసరమైన సహాయం అందేలా చురుకుగా ముందుకు రావడానికి సహాయపడుతుంది.

ముందుగానే సహాయం అందించడం అంటే పిల్లల మీద ఒక ముద్ర వేయడం కాదు — మీ పిల్లలను మరింత బాగా అర్థం చేసుకుని, అవగాహనతో, ప్రేమగా, శ్రద్ధగా వారికి తోడుగా ఉండటం.

మేధో వైకల్యం ప్రభావం చూపే అంశాలు

మేధో వైకల్యం పిల్లల జీవితంలోని కొన్ని ముఖ్యమైన అంశాలపై ప్రభావం చూపవచ్చు. ఉదాహరణకు:

  • ఆలోచనా నైపుణ్యాలు: కొత్త విషయాలను నేర్చుకోవడం, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, గుర్తుంచుకోవడం
  • భాష, కమ్యూనికేషన్: ఇతరులు చెప్పేది అర్థం చేసుకోవడం, తమ అవసరాలు, భావాలను వ్యక్తపరచడం
  • సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలు: స్నేహాలు ఏర్పరచుకోవడం, భావోద్వేగాలను నియంత్రించుకోవడం, సామాజిక నియమాలను అర్థం చేసుకోవడం
  • రోజువారీ జీవన నైపుణ్యాలు: బట్టలు వేసుకోవడం, తినడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, రోజువారీ పనులను క్రమం ప్రకారం చేయడం.

ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ, మేధో వైకల్యం ఉన్న చాలా మంది పిల్లల్లో దయ, పట్టుదల,సృజనాత్మకత,  హాస్యభావం వంటి ఎన్నో ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయి. తమకు భద్రతగా, సౌకర్యంగా అనిపించే వారితో వారు ఎంతో చక్కగా అనుబంధాన్ని ఏర్పరచుకోగలరు.

నిర్ధారణ జరిగినంత మాత్రాన మీ పిల్లల్లో ఏ మార్పూ రాదు. అది మీ పిల్లల ప్రపంచాన్ని, వారి అవసరాలను మరింత బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఆ అవగాహనతో మీరు పిల్లలకు మరింత నమ్మకంగా, స్పష్టంగా, ప్రేమతో స్పందించగలరు.

ప్రతి పిల్లలు తమదైన విధంగా నేర్చుకుంటారు

మేధో వైకల్యం అనేది పిల్లల సామర్థ్యాలకు ఒక స్థిరమైన పరిమితి కాదు. ప్రతి పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకునే, నేర్చుకునే, ఇతరులతో కలిసే విధానం భిన్నంగా ఉంటుంది. పిల్లలకు అవసరమైన సమయం, అవకాశం, సరైన సహాయం అందితే వారు తమ సామర్థ్యాలను బాగా అభివృద్ధి చేసుకోగలరు.కొన్ని నైపుణ్యాలను నేర్చుకోవడానికి పిల్లలకు కొంచెం ఎక్కువ సమయం పట్టవచ్చు లేదా వారికి అర్థమయ్యేలా వేరే విధానంలో నేర్పించాల్సి రావచ్చు. అంతమాత్రాన వారు ఆ నైపుణ్యాన్ని నేర్చుకోలేరని కాదు.

పిల్లలు సాధించిన చిన్న చిన్న విజయాలను కూడా గుర్తించి, ఆనందించండి. మీ పిల్లలు వేసే ప్రతి అడుగు, అది ఎంత చిన్నదిగా అనిపించినా  వారి అభివృద్ధిలో ఒక ముందడుగే. పిల్లల సామర్ధ్యాలు, ఆసక్తులు, వారికి ఆనందాన్ని ఇచ్చే విషయాలపై దృష్టి పెట్టండి. అది సంగీతం కావచ్చు, కదలికలు కావచ్చు, కళలు కావచ్చు లేదా రోజువారీ క్రమం కావచ్చు. ఇవన్నీ పిల్లలతో అనుబంధం ఏర్పరచుకోవడానికి, కొత్త విషయాలు నేర్పడానికి మంచి మార్గాలుగా ఉపయోగపడతాయి.

మేధో వైకల్యం ఉన్న పిల్లలను పెంచడంలో కొన్ని ప్రత్యేకమైన సవాళ్లు ఎదురుకావచ్చు. అదే సమయంలో, ఊహించని విధంగా ఆప్యాయత, కొత్త విషయాలను అర్థం చేసుకునే అవకాశాలు, పట్టుదలతో ముందుకు సాగే అనుభవాలు కూడా ఎదురవుతాయి. ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా లేరు. సరైన మార్గదర్శకత్వం, సహాయక సమాజం మీకు తోడుగా ఉంటే, మీరు మరియు మీ పిల్లలు అర్థవంతమైన, అవసరమైన సహాయంతో కూడిన జీవితాన్ని కలిసి నిర్మించుకోవచ్చు.

కృతజ్ఞతలు: ఈ మేధో వైకల్యం (ID) ఫ్యాక్ట్‌షీట్ రూపొందించడంలో నిపుణుల సలహా, మార్గదర్శకత్వం అందించిన , న్యూరో-డెవలప్‌మెంటల్ పిడియాట్రీషియన్‌ డా. సనా స్మృతి కు మా కృతజ్ఞతలు.

ID ఫ్యాక్ట్‌షీట్‌ను పూర్తిగా పరిశీలించమని కుటుంబాలను ప్రోత్సహిస్తున్నాము. ఇందులో ప్రారంభ సంకేతాలు, పిల్లల సామర్ధ్యాలను ఆధారంగా చేసుకున్న సహాయక పద్ధతులు, అందుబాటులో ఉన్న థెరపీలు, పిల్లల శ్రేయస్సును పెంపొందించేందుకు అవసరమైన మార్గదర్శకత్వం వంటి ఉపయోగకరమైన సమాచారం ఉంది.

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD. లేదా ఇతర మేధో వైకల్యాలు గురించి సందేహాలు ఉన్నా లేదా మీ పిల్లల అభివృద్ధిలో ఆలస్యం ఉందని సందేహం ఉన్నా నయీ దిశా టీమ్ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీ ప్రశ్నలు లేదా సందేహాల కోసం దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌ 844-844-8996 కు కాల్ చేయండి లేదా వాట్సాప్‌లో సంప్రదించండి.మా కౌన్సిలర్లు ఆంగ్లం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషల్లో మాట్లాడగలరు.

గమనిక: ఈ వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడినవి. దయచేసి సురక్షితంగా నిర్వహించుకోవడానికి అర్హత పొందిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

Write Blog

Share your experiences with others like you!

English