Skip to main content
Install App
If you're using:

ADHD అంటే ఏమిటి? – మీ పిల్లల నిర్ధారణ గురించి సులభంగా తెలుసుకుందాం

Default Avatar

Dr.Sana Smriti

Also available in: हिंदी English

Key Takeaways:

ADHD గురించి తెలుసుకుందాం

  • ADHD అనేది నాడీ అభివృద్ధికి సంబంధించిన ఒక పరిస్థితి. ఇది సరిచేయాల్సిన లోపం కాదు.
  • ఇది ఏకాగ్రత, కదలికలు, ఆలోచించకుండా వెంటనే స్పందించడం, పనులను క్రమబద్ధంగా చేసుకోవడం వంటి అంశాలపై ప్రభావం చూపుతుంది.
  • ADHD ప్రతి పిల్లలో ఒక్కోలా కనిపించవచ్చు.

ప్రారంభ సంకేతాలు, నిర్ధారణ

  • ఒకచోట కుదురుగా ఉండలేకపోవడం, ఒక పని చేస్తూ మరో పనికి మారిపోవడం, ఆలోచించకుండా వెంటనే స్పందించడం, వస్తువులను ఎక్కడ పెట్టారో మర్చిపోవడం వంటివి కనిపించవచ్చు.
  • ADHD రావడానికి ఒకే ఒక్క కారణం ఉండదు. జన్యుపరమైన అంశాలు, మెదడు అభివృద్ధి, పరిసరాలు వంటి అంశాలు ప్రభావం చూపవచ్చు.
  • ADHD నిర్ధారణకు ప్రత్యేకమైన వైద్య పరీక్ష ఒక్కటే ఉండదు. పిల్లల ప్రవర్తనలో కనిపించే సంకేతాలు, వాటి నమూనాలను పరిశీలించి నిర్ధారిస్తారు.

ADHDతో సంబంధం ఉన్న అంశాలు

  • కుటుంబంలో ఎవరికైనా ADHD ఉండటం.
  • ఆటిజం లేదా డిస్ప్రాక్సియా వంటి ఇతర పరిస్థితులు కూడా ఉండటం.
  • పుట్టుకకు సంబంధించిన అంశాలు (నెలలు నిండకముందే పుట్టడం, పుట్టినప్పుడు తక్కువ బరువు ఉండటం).
  • గర్భధారణ సమయంలో మద్యం లేదా ఇతర మాదక పదార్థాలకు గురికావడం.

పరిశోధనల ఆధారిత సహాయ మార్గాలు

  • ఇంట్లో: తల్లిదండ్రుల సహకారం, అనుకూలమైన వాతావరణం.
  • పాఠశాలలో: చదువులో వెసులుబాట్లు, ప్రవర్తనకు తగిన సహాయం.
  • పిల్లలకు: అవసరాన్ని బట్టి థెరపీ, కౌన్సెలింగ్, మందులు.

వయస్సును బట్టి సహాయం

  • 4–6 ఏళ్లు: ప్రవర్తనకు సంబంధించిన పద్ధతులు, సాధారణంగా మందులు అరుదుగా సూచిస్తారు.
  • 7–11 ఏళ్లు: ప్రవర్తన, చదువులో సహాయం, అవసరమైతే మందులు.
  • 12–18 ఏళ్లు: చదువులో సహాయం, కౌన్సెలింగ్, అవసరమైతే మందులు.

ADHD ఉన్న పిల్లలకు ఎలా సహాయం చేయాలి?

  • రోజువారీ పనులకు ఒక క్రమం పాటించండి.
  • పనులను చిన్న చిన్న దశలుగా వివరించండి.
  • ఒకేసారి ఒక పనిపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించండి.
  • పిల్లలతో మనసు విప్పి మాట్లాడి, ఓపికగా స్పందించండి.

తల్లిదండ్రులు తమను తాము ఎలా చూసుకోవాలి?

  • మీ ఆరోగ్యం, సంతోషానికి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. తగినంత విశ్రాంతి తీసుకోండి, చురుకుగా ఉండండి, పనులు–విశ్రాంతి మధ్య సమతుల్యత పాటించండి.
  • మీ ఇతర పిల్లలకు, కుటుంబ సంబంధాలకు కూడా సమయం కేటాయించండి.
  • సహాయక బృందాల్లో చేరండి. ADHD గురించి ఇతరులకు అవగాహన కల్పించండి.

చివరిగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు

  • ADHD అనేది నయం చేయాల్సిన లోపం కాదు; ఇది ఆలోచించే విధానంలో ఒక భిన్నత్వం.
  • ADHDను పూర్తిగా సరిచేస్తామని చెప్పే తప్పుడు ప్రచారాలు, అపోహలను నమ్మకండి.
  • సరైన సమాచారాన్ని తెలుసుకుంటూ, మీ పిల్లల సామర్థ్యాలను గుర్తించి, వారికి అవసరమైన సహాయం అందేలా ముందుండండి.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [894.96 KB]

ADHD అంటే ఏమిటి?  మీరు ఇటీవల ADHD అనే పదాన్ని విన్నారా? లేదా మీ పిల్లలకు ADHD ఉంటే దాని అర్థం ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు దీని గురించి మొదటిసారి తెలుసుకుంటున్నా, ఇప్పటికే కొంత అవగాహన ఉన్నా, ఈ ఫ్యాక్ట్‌షీట్ మీకు ఉపయోగపడుతుంది. ఇందులో ADHD సాధారణ సంకేతాలు, సాధ్యమైన కారణాలు, సహాయక థెరపీలు, మీ పిల్లల ఆరోగ్యం, శ్రేయస్సును మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ముఖ్యమైన సమాచారం ఉంది.

ADHD అంటే ఏమిటి?

అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ (ADHD) అనేది పిల్లల ఏకాగ్రత, ఆలోచించకుండా వెంటనే స్పందించే తీరును నియంత్రించుకోవడం, చురుకుదనాన్ని అదుపులో ఉంచుకోవడం వంటి అంశాలపై ప్రభావం చూపే నాడీ అభివృద్ధి సంబంధిత పరిస్థితి. ADHD ఉన్న పిల్లలు సమాచారాన్ని అర్థం చేసుకునే విధానం, పనులు చేసే తీరు, చుట్టూ ఉన్న పరిసరాలతో కలిసిపోయే విధానం భిన్నంగా ఉండవచ్చు. ఈ భిన్నత్వం వారి అభ్యాసం, భావోద్వేగాలను నియంత్రించుకోవడం, ఇతరులతో సంబంధాలు ఏర్పరచుకోవడంపై ప్రభావం చూపవచ్చు. ADHD అనేది ప్రవర్తనకు సంబంధించిన సమస్య కాదు. ఇది మెదడు పనిచేసే విధానంలో ఉండే భిన్నత్వం. దీనివల్ల ఏకాగ్రత, ఆలోచించకుండా స్పందించడాన్ని నియంత్రించుకోవడం, పనులను క్రమబద్ధంగా చేసుకోవడం వంటి నైపుణ్యాలపై ప్రభావం పడవచ్చు.

ADHD నిర్ధారణ

ADHDను నిర్ధారించడానికి ఒకే ఒక్క పరీక్ష ఉండదు. అందుకే, పిల్లల ఎదుగుదల, ప్రవర్తన, రోజువారీ పనితీరును అర్థం చేసుకోవడానికి వివిధ మార్గాల్లో సమాచారాన్ని సేకరిస్తారు. సాధారణంగా డెవలప్‌మెంటల్ పిడియాట్రిషియన్, చైల్డ్ సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ ఈ సమగ్ర అంచనాను నిర్వహిస్తారు.

ADHD నిర్ధారణలోని దశలు

1. వైద్య,ఎదుగుదలకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడం
  • పిల్లలు పుట్టినప్పటి వివరాలు, ఎదుగుదలలో సాధించిన దశలు, కుటుంబ వైద్య చరిత్ర, ఇతర ఆరోగ్య వివరాలను తెలుసుకుంటారు.
  • పిల్లలు నేర్చుకునే విధానం, ఇతరులతో కలిసే తీరు, వివిధ పరిస్థితుల్లో భావోద్వేగాలకు స్పందించే విధానాన్ని అర్థం చేసుకుంటారు.
2. ప్రవర్తనను గమనించడం
  • ఇంట్లో, పాఠశాలలో, ఇతరులతో ఉన్నప్పుడు పిల్లల ప్రవర్తన గురించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంరక్షకుల నుంచి వివరాలు సేకరిస్తారు.
  • క్రమబద్ధమైన, స్వేచ్ఛగా వ్యవహరించే పరిస్థితుల్లో పిల్లలు ఎలా స్పందిస్తున్నారో గమనిస్తారు.

3. ప్రామాణిక అంచనా పట్టికలు, ప్రశ్నావళులు

  • కానర్స్ రేటింగ్ స్కేల్, వాండర్‌బిల్ట్ అసెస్‌మెంట్ స్కేల్ వంటి ప్రశ్నావళుల ద్వారా ఏకాగ్రత, అధిక చురుకుదనం, ఆలోచించకుండా వెంటనే స్పందించడం వంటి లక్షణాలను అంచనా వేస్తారు.
  • వివిధ సందర్భాల్లో పిల్లల ప్రవర్తనలో కనిపించే తీరును క్రమబద్ధంగా అర్థం చేసుకోవడానికి ఇవి సహాయపడతాయి.

4. నిపుణులతో ముఖాముఖి సంభాషణ, పరిశీలన

  • పిల్లలతో నేరుగా మాట్లాడి, వారి ప్రవర్తన, ఇతరులతో కలిసే విధానం, ADHDకి సంబంధించిన సంకేతాలను నిపుణులు గమనిస్తారు.
  • పిల్లల వయస్సుకు తగిన పనుల ద్వారా ఏకాగ్రత, తమ స్పందనలను నియంత్రించుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా ఆలోచనను మార్చుకోవడం వంటి నైపుణ్యాలను అంచనా వేస్తారు.

5. ఇతర పరిస్థితులను గుర్తించి, పరిశీలించడం

  • ఆందోళన, అభ్యాసంలో ఇబ్బందులు, సెన్సరీ ప్రాసెసింగ్‌లో భిన్నత్వాలు లేదా ఆటిజం వంటి పరిస్థితుల్లో ADHD సంకేతాలను పోలిన సంకేతాలు కనిపించవచ్చు. అందుకే, నిపుణులు అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తారు.

ఇలా ఇతర పరిస్థితులను కూడా పరిశీలించి సరైన నిర్ధారణకు రావడం వల్ల, పిల్లలకు తగిన సహాయం, అవసరమైన చికిత్స అందించవచ్చు.

సంబంధిత ఆర్టికల్: ADHD గురించి తెలుసుకోవడం, దాని సంకేతాలను గుర్తించడం

సమగ్ర నిర్ధారణ ఎందుకు ముఖ్యం?

ADHD సంకేతాలు ఒక్కో పిల్లలో ఒక్కోలా కనిపిస్తాయి. కొన్ని సంకేతాలు ఆధారంగా మాత్రమే ADHDను నిర్ధారించలేం. సమగ్ర అంచనా ద్వారా పిల్లల ప్రత్యేక సామర్థ్యాలు, ఇబ్బందులు, వారికి అవసరమైన సహాయాన్ని గుర్తించవచ్చు. సరైన సమయంలో కచ్చితమైన నిర్ధారణ జరగడం వల్ల, పిల్లలు బాగా ఎదగడానికి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, థెరపిస్టులు తగిన పద్ధతులను అనుసరించగలరు.

  • పిల్లల ప్రత్యేక అవసరాలను అర్థం చేసుకోవడం: ప్రతి పిల్లలో ADHD సంకేతాలు భిన్నంగా ఉంటాయి. సమగ్ర అంచనా ద్వారా వారి సామర్థ్యాలు, అవసరమైన సహాయాన్ని గుర్తించవచ్చు.
  • తప్పుడు నిర్ధారణను నివారించడం: ADHD సంకేతాలు ఆందోళన, అభ్యాస ఇబ్బందులు, సెన్సరీ ప్రాధాన్యతలు వంటి ఇతర పరిస్థితులతో పోలి ఉండవచ్చు. సమగ్ర అంచనా వల్ల తప్పుడు నిర్ధారణ, అనవసరమైన చికిత్సలను నివారించవచ్చు.
  • సరైన నిర్ణయాలు తీసుకోవడం: ఖచ్చితమైన నిర్ధారణతో పిల్లలకు ఉపయోగపడే పద్ధతులు, థెరపీలు, అవసరమైన వెసులుబాట్లను కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు ఎంచుకోవచ్చు.
  • చదువు, సామాజిక సంబంధాలు మెరుగుపరచడం: ముందుగానే గుర్తించి సహాయం అందించడం వల్ల పిల్లలు తమ ప్రవర్తనను, భావోద్వేగాలను నియంత్రించుకోవడం, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం, ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడం వంటివి నేర్చుకుంటారు.
  • ఉపాధ్యాయులు, థెరపిస్టులకు సహాయపడటం: స్పష్టమైన నిర్ధారణ ఆధారంగా పిల్లలకు తగిన అభ్యాస ప్రణాళికలు, ప్రవర్తనకు సంబంధించిన సహాయక పద్ధతులను రూపొందించవచ్చు. దీంతో పిల్లల్లో ఒత్తిడి, నిరాశ తగ్గవచ్చు.
  • కుటుంబాలకు మార్గనిర్దేశం చేయడం: పిల్లల అవసరాలను అర్థం చేసుకున్న తల్లిదండ్రులు పాఠశాలలు, థెరపిస్టులతో కలిసి పనిచేస్తూ, అవసరమైన సహాయం, అనుకూలమైన వాతావరణం కల్పించగలరు.
  • ఆత్మవిశ్వాసం, జీవన నైపుణ్యాలు పెంపొందించడం: ముందుగానే సహాయం అందితే పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చదువుపై సానుకూల దృక్పథం ఏర్పడి, వారి మొత్తం శ్రేయస్సు మెరుగుపడుతుంది.

నిర్ధారణ తర్వాత అందించే సహాయం

ADHD నిర్ధారణ జరిగిన తర్వాత, పిల్లలకు ఉపయోగపడే వివిధ సహాయక పద్ధతులను కుటుంబాలు పరిశీలించవచ్చు.

  • బిహేవియర్ థెరపీ: సమస్యలను ఎదుర్కోవడం, తమ స్పందనలను నియంత్రించుకోవడం, సామాజిక సాన్నిహిత్యాన్ని నేర్పుతుంది.
  • తల్లిదండ్రులకు శిక్షణ, సహాయం: ఇంట్లో పిల్లలకు ప్రేమతో కూడిన, క్రమబద్ధమైన వాతావరణాన్ని కల్పించడానికి అవసరమైన పద్ధతులను నేర్పుతుంది.
  • తరగతి గదిలో అవసరమైన మార్పులు: ఏకాగ్రత, పనులను పూర్తి చేయడం, భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో పిల్లలకు తోడ్పడే పద్ధతులను అనుసరిస్తారు.
  • మందులు (అవసరమైతే): సమగ్ర చికిత్సలో భాగంగా, కొన్ని సందర్భాల్లో వైద్యులు మందులను సూచించవచ్చు.

కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, థెరపిస్టులు సమన్వయంతో కలిసి పనిచేస్తే, పిల్లల ఎదుగుదలకు, అభివృద్ధికి తోడ్పడే వాతావరణాన్ని కల్పించవచ్చు. తరచూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, పిల్లల ప్రత్యేక సామర్థ్యాలు, అవసరాలను అర్థం చేసుకోవడం వల్ల ఇంట్లో, పాఠశాలలో, థెరపీ సమయంలో ఒకే విధమైన సహాయక పద్ధతులను అనుసరించవచ్చు. దీనివల్ల పిల్లల్లో భద్రతాభావం పెరుగుతుంది, గందరగోళం తగ్గుతుంది, మంచి అలవాట్లు, నేర్చుకునే పద్ధతులు బలపడతాయి. ఫలితంగా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగి, అవసరమైన జీవన నైపుణ్యాలు అలవడతాయి. సవాళ్లను మరింత సమర్థంగా ఎదుర్కొంటూ, ఆరోగ్యంగా, సంతోషంగా ఎదగడానికి ఇది తోడ్పడుతుంది. ADHD గురించి మరింత తెలుసుకోవడానికి, నిపుణుల సూచనలు పొందడానికి డా. హరిణి అత్తూరు గారు తెలుగులో అందించిన వీడియోలను కూడా చూడవచ్చు.

గుర్తుంచుకోండి: సరైన నిర్వహణ పద్ధతులు, కుటుంబ సభ్యుల సహకారం ఉంటే ADHD ఉన్న పిల్లలు సంతోషంగా, అర్థవంతమైన జీవితాన్ని గడపగలరు. డా. హరిణి అత్తూరు గారి ADHD వీడియోలు తెలుగులో చూడండి.

కృతజ్ఞతలు: ఈ సమాచారాన్ని రూపొందించడంలో నిపుణుల మార్గదర్శకత్వం అందించిన కన్సల్టెంట్ డెవలప్‌మెంటల్ పిడియాట్రిషియన్ డా. సనా స్మృతి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సమాచారాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించిన మా వాలంటీర్ శ్రీమతి శైలజ తాడిమేటి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.

గమనిక: అందరు పిల్లలు ప్రత్యేకమైనవారే. ADHD సంకేతాలు ఒక్కో పిల్లలో ఒక్కోలా కనిపించవచ్చు. ఈ సమాచారంలో పేర్కొన్న అన్ని సంకేతాలూ ప్రతి పిల్లలో కనిపించకపోవచ్చు. అయితే, మీ పిల్లల ప్రవర్తనలో ఇక్కడ పేర్కొన్న పలు సంకేతాలు కనిపిస్తే, నిపుణులను సంప్రదించి అంచనా చేయించుకోవడం ద్వారా స్పష్టతతో పాటు సరైన మార్గదర్శకత్వం పొందవచ్చు.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996 కు సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

Write Blog

Share your experiences with others like you!

English