Skip to main content
Install App
If you're using:

ప్రత్యేక అవసరాలున్న పిల్లల్లో నెలసరి నిర్వహణకు ఆక్యుపేషనల్ థెరపీ సూచనలు

Hyderabad_occupational-therapist_Snehal_Vaidya

Ms.Snehal Vaidya

Also available in: हिंदी English

Key Takeaways:

  •  ప్రత్యేక అవసరాలున్న చాలా మంది అమ్మాయిలకు  రోజువారీ ఉపయోగించే సానిటరీ ప్యాడ్స్ వంటివి ఇంద్రియ (సెన్సరీ) అసౌకర్యాన్ని కలిగించవచ్చు .
  • సానిటరీ ఉత్పత్తులను ఎంపిక చేసేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లల సెన్సరీ అవసరాలను పరిగణలోకి తీసుకోవాలి.
  •  ప్రత్యేక అవసరాలున్న పిల్లల్లో నెలసరి కోసం ఆక్యుపేషనల్ థెరపీ అనేది వారి సౌకర్యం మరియు స్వతంత్రంగా నిర్వహించేందుకు  రోజువారీ పనులలో వ్యక్తిగత మార్పులు చేయడాన్ని సూచిస్తుంది.   
  •  పిల్లల నెలసరి నిర్వహణ కోసం 6 సూచనలు:
    • సౌకర్యం
    • సులభంగా అందుబాటులో ఉండేలా చూడడం 
    • సరైన విధానం
    • ఆట సమయం 
    • విజువల్ సూచనలు (ప్యాడ్ గడువు తేదీ)
    •  విజువల్ సూచనలు (ప్యాడ్ మార్చడం)
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [1.86 MB]

ప్రత్యేక అవసరాలు ఉన్న చాలా మంది బాలికలు రోజువారీగా ఉపయోగించే వస్తువుల వల్ల ఇంద్రియ (సెన్సరీ) సంబంధిత అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు. ఉదాహరణకు, శానిటరీ ప్యాడ్ యొక్క స్పర్శ లేదా ఆకృతి మనకు చిన్న విషయంగా అనిపించవచ్చు.  కానీ వారికి అది చాలా అసౌకర్యంగా అనిపించవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఈ అవసరాలను గుర్తించి, తమ పిల్లలకు సరైన సానిటరీ ప్యాడ్ ఎంపికలో జాగ్రత్త వహించాలి. ఈ విషయ వివరణ ఆక్యుపేషనల్ థెరపిస్ట్ స్నేహల్ వైద్య అందించిన సూచనలపై ఇక్కడ అందుబాటులో ఉన్న ప్రెజెంటేషన్ ఆధారంగా రూపొందించబడింది.

మీ పిల్లల సురక్షితంగా  మరియు సౌకర్యంగా ఉంచేందుకు 6 సూచనలు

ఆక్యుపేషనల్ థెరపీ అనేది, ప్రత్యేక అవసరాలున్న పిల్లల్లో నెలసరి నిర్వహణ కోసం పిల్లల వ్యక్తిగత సామర్థ్యాలు మరియు అవసరాలకు  అనుగుణంగా వారి రోజువారీ జీవితంలో కొన్ని మార్పులను చేయడంలో  సహాయపడుతుంది . దీనివల్ల పిల్లలు తమ రోజువారీ కార్యకలాపాలను సులభంగా, తక్కువ అసౌకర్యంతో మరియు ఒత్తిడి లేకుండా నిర్వహించేందుకు సహాయపడతాయి.

A) సౌకర్యం

నెలసరి ప్రక్రియ చాలా మందికి అసౌకర్యంగా అనిపించవచ్చు. అదనపు అవసరాలు ఉన్న అమ్మాయిలకు కమ్యూనికేషన్‌లో ఇబ్బందులు మరియు సెన్సరీ సున్నితత్వం కారణంగా ఇది మరింత చికాకుగా, అసౌకర్యంగా ఉండవచ్చు.

  • అందువల్ల, సానిటరీ ఉత్పత్తులను ఎంపిక చేసే సమయంలో మీ పిల్లల సెన్సరీ అవసరాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి.
  • మీకు సౌకర్యంగా అనిపించే ఉత్పత్తి, మీ పిల్లలకు కూడా సరిపోతుందని అనుకోవద్దు. అలాగే, వారి అభిరుచులు కాలక్రమేణా మారవచ్చు.
  • మీ పిల్లలకు సరైన శానిటరీ ప్యాడ్‌ను ఎంచుకునే ముందు కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఉదాహరణకు, ప్యాడ్ తాకినప్పుడు ఎలా అనిపిస్తుంది, దానిలో సువాసన ఉందా, అలాగే ప్యాడ్‌లోని పొరలు పిల్లలకు ఏమైనా అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయా వంటి అంశాలను గమనించాలి.

B) సులభంగా అందుబాటులో ఉండేలా చూడడం 

ఆటిజం స్పెక్ట్రమ్‌లో ఉన్న పిల్లలు సాధారణంగా ఒక నిర్ణీత దినచర్యను చక్కగా అనుసరిస్తారు. ఇది వారికి స్వీయ సంరక్షణ నైపుణ్యాలు నేర్పడంలో, అలాగే నెలసరి పరిశుభ్రతకు సంబంధించిన దశలను పాటించడంలో ఎంతో సహాయపడుతుంది.

  • మీ పిల్లలు తమ అవసరాలను స్వయంగా చూసుకునేందుకు, సానిటరీ ప్యాడ్లు, లోదుస్తులు, సబ్బులు వంటి అవసరమైన వస్తువులు సులభంగా అందుబాటులో ఉండేలా చూడాలి.
  •  ఇలా చేయడం వల్ల వారు పనులను సులభంగా అర్థం చేసుకుని, మరింత స్వతంత్రంగా, సంరక్షకులపై తక్కువ ఆధారపడుతూ ఈ పనులను పూర్తి చేయగలుగుతారు. 

C) విధానం: 

  • సానిటరీ ప్యాడ్‌ను లోదుస్తులకు సరిగా అమర్చి, సురక్షితంగా ఉపయోగించేందుకు వివిధ పద్ధతులున్నాయి.
  • పిల్లలకు సులభంగా నేర్పగలిగేలా, వారి అవసరాలకు అనుగుణంగా ఉండేలా, అలాగే వారికి సౌకర్యాన్ని కలిగించే విధానాన్ని ఎంపిక చేయాలి.
  • శానిటరీ ప్యాడ్‌ను ఎలా ఉపయోగించాలో నేర్పించడానికి దృశ్య సహాయాలను ఉపయోగించడం ద్వారా, పిల్లలు ఆ ప్రక్రియను సులభంగా అర్థం చేసుకునేలా చేయవచ్చు.

D) ఆట సమయం

  • ఆటల ద్వారా పిల్లలకు నేర్పించడం మరో ప్రభావవంతమైన పద్ధతి.
  • పిల్లల బొమ్మలను ఉపయోగించి ప్యాడ్‌ను ఎలా అమర్చాలి, ఎలా మార్చాలి అనే విధానాలను నేర్పించవచ్చు.
  •  తరచుగా అభ్యాసం చేయించడం ద్వారా పిల్లలు క్రమంగా నేర్చుకుని, ఈ పనులను స్వయంగా చేయడంలో మరింత సౌకర్యంగా మరియు ఆత్మవిశ్వాసంతో మారుతారు.

E)  దృశ్య సూచనల ద్వారా ప్యాడ్ మార్చే సమయం

నెలసరి సమయంలో ముఖ్యమైన అంశాల్లో ఒకటి ప్యాడ్ ఎప్పుడు మార్చాలో గుర్తించడం. దీనిని దృశ్య సూచనల ద్వారా పిల్లలకు సులభంగా నేర్పించవచ్చు.

  •  పెద్ద ఎరుపు మచ్చ కనిపిస్తే, ప్యాడ్‌ను త్వరలో మార్చాల్సిన అవసరం ఉందని అర్థం.
  • మధ్యస్థ పరిమాణంలో ఎరుపు మచ్చ ఉంటే, కొంత సమయం తర్వాత ప్యాడ్ మార్చవచ్చని అర్థం.
  •  చిన్న ఎరుపు మచ్చ ఉండి అది పెద్దదిగా కాకపోతే, నెలసరి దాదాపు ముగిసిందని మరియు ప్యాడ్లు అవసరం లేకపోవచ్చని అర్థం.
  • లోదుస్తులపై ఎరుపు మరకలు కనిపిస్తే, ప్యాడ్ సరిగా అమర్చలేదని అర్థం. అప్పుడు పిల్లలకు ఉతికిన లోదుస్తులు మార్పించి, ఉపయోగించిన వాటిని శుభ్రం చేయడంలో సహాయం చేయాలి.

ప్యాడ్‌లను నిర్ణీత వ్యవధుల్లో మార్చడం అనే ముఖ్యమైన అలవాటును పిల్లలకు వివరించేందుకు దృశ్య సూచనలు ఎంతో ఉపయోగపడతాయి.

  •  నెలసరి ప్రారంభమైన వెంటనే, పిల్లలు ముందుగా నేర్పిన విధంగా ప్యాడ్ మార్చుకునేలా ఒక నిర్దిష్ట దినచర్యను ఏర్పాటు చేయాలి.
  • ఉదాహరణకు, ఉదయం 8 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 2 గంటలకు మరోసారి, రాత్రి 8 గంటలకు మళ్లీ మార్చుకునేలా అలవాటు చేయవచ్చు.
  •  ఈ సమయాలను నిర్ణయించే ముందు, మీ పిల్లల రక్తస్రావం మరియు సౌకర్యాన్ని తప్పనిసరిగా పరిగణలోకి తీసుకోవాలి.
  • అలాగే, రక్తస్రావం ప్రారంభమైన తర్వాత కాకుండా, ప్రారంభమయ్యే అవకాశాన్ని ముందుగానే ఊహించి కొన్ని గంటల ముందు ప్యాడ్ ధరించడం మంచి అలవాటు కావచ్చు.
  •  అందువల్ల, మీ పిల్లల నెలసరి చక్రానికి అనుగుణంగా నిర్దిష్ట రోజుల్లో ప్యాడ్‌లు ధరించేలా ముందుగానే ప్రణాళిక చేయాలి.
  •  అయితే, ప్యాడ్‌లను తరచుగా మార్చడం అవసరం. ఎక్కువసేపు ఒకే ప్యాడ్‌ను ఉపయోగిస్తే చికాకు, దద్దుర్లు లేదా చర్మ సమస్యలు కలిగే అవకాశం ఉంటుంది.

గమనిక

రక్తస్రావం ఎంత తక్కువగా లేదా ఎక్కువగా ఉన్నా కానీ, ఇన్‌ఫెక్షన్లు మరియు ఇతర చర్మ సమస్యలు రాకుండా ఉండేందుకు పిల్లలకు దృశ్య సూచనల సహాయంతో ప్యాడ్‌లను క్రమం తప్పకుండా మార్చుకోవడం నేర్పించాలి.

ఇది మీకు భారంగా అనిపించాల్సిన  అవసరం లేదు! 

పిల్లల నెలసరి సమయంలో వారికి సహాయం చేయడం, సంరక్షించడం కొంత శ్రమతో కూడుకున్న పని కావచ్చు . అయితే, అది మీపై గానీ, మీ పిల్లలపై గానీ ఎక్కువ అసౌకర్యాన్ని కలిగించకూడదు. 

  • పిల్లలు నెలసరి సంరక్షణ మరియు పరిశుభ్రతకు సంబంధించిన పనులలో వారికి సహాయం చేయడం మీకు కూడా శారీరకంగా అలసట కలిగించవచ్చు.
  • అందువల్ల, మీ సౌకర్యాన్ని కూడా ముందుగానే పరిగణలోకి తీసుకోవాలి. పిల్లలు ప్యాడ్ మార్చుకునే సమయంలో లేదా దుస్తులు ధరించే సమయంలో మిమ్మల్ని ఆసరాగా తీసుకునే పరిస్థితి ఉంటే, మీకు శారీరక అసౌకర్యం కలగకుండా సరైన స్థితిని ఎంచుకోవాలి.

F) స్వీయ వ్యక్తీకరణకు అవకాశం ఇవ్వండి 

పిల్లలు ఎదుగుతున్న కొద్దీ, వ్యక్తిగత సంరక్షణ  అనేది స్వీయ వ్యక్తీకరణలో ఒక ముఖ్యమైన భాగంగా మారుతుంది.

కాబట్టి, పిల్లలు తమను తాము చూసుకోవడం, దుస్తులు ధరించడం, తల దువ్వుకోవడం వంటి పనులు స్వయంగా చేసుకునేలా ప్రోత్సహించాలి. ఇది వారిలో ఆత్మవిశ్వాసం తో పాటు, సానుకూల అభిప్రాయం ను అభివృద్ధి చేయడంలో కూడా ఎంతో కీలకంగా ఉంటుంది.

అలాగే, నెలసరి పరిశుభ్రతను నిర్వహించే సూచనలు మరియు భావోద్వేగ ఇబ్బందులు  వాటిని ఎదుర్కొనే మార్గాలపై ఉన్న ప్రెజెంటేషన్‌ను కూడా చూడండి.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ ను 844-844-8996 లో సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

గమనిక: ఈ విషయ వివరణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం దయచేసి అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

Write Blog

Share your experiences with others like you!

English