Skip to main content
Install App
If you're using:

మూర్ఛ (ఎపిలెప్సీ) సమయంలో ఉపయోగపడే మెడికల్ ఎమర్జెన్సీ కార్డు

20180628_104304_NikitMilind

Dr.Nikit Milind Shah

Also available in: हिंदी English

Key Takeaways:

  • మూర్ఛ ఉన్న పిల్లలు ఎల్లప్పుడూ మెడికల్ ఎమర్జెన్సీ (అత్యవసర వైద్య) కార్డును వెంట ఉంచుకోవడం మంచిది.
  • సీజర్ (మూర్ఛ) ఐ.డి కార్డులో పిల్లల పరిస్థితి, మూర్ఛ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ప్రథమ చికిత్స చర్యలు వంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది.
  • పిల్లలు పరిచయం లేని వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు, వెంటనే సరైన సహాయం అందించేందుకు ఈ కార్డు సహాయపడుతుంది.
  • పిల్లల భద్రత కోసం కార్డులోని వివరాలను ఎప్పటికప్పుడు సరిచేయడం (అప్డేట్) చేయడం చాలా ముఖ్యం.
  • ముందుగానే సిద్ధంగా ఉండేందుకు, మూర్ఛ ఎలా కనిపిస్తుంది, మూర్ఛ వచ్చినప్పుడు ఎలా స్పందించాలి అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ పిల్లల న్యూరాలజిస్ట్‌ను అడిగి అవసరమైన విషయాలను తెలుసుకోవడం ద్వారా, ఎటువంటి పరిస్థితిలోనైనా మీ పిల్లలకు సురక్షితంగా సరైన సహాయం అందించడానికి ఉపయోగపడుతుంది.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [50.61 KB]

మూర్ఛ ఉన్న పిల్లలు కూడా ఇతర పిల్లల మాదిరిగానే చురుకుగా, సంతోషంగా తమ జీవితాన్ని గడపగలరు. వారు పాఠశాలకు వెళ్లవచ్చు, థెరపీ సెషన్‌లకు హాజరు కావచ్చు, స్నేహితులను కలవవచ్చు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణించవచ్చు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో మీ పిల్లల దగ్గర వారి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తిగా తెలిసిన తల్లిదండ్రులు లేదా సంరక్షకులతో ఎప్పుడూ ఉండకపోవచ్చు.

ఇలాంటి సందర్భాల్లో పిల్లలు మూర్ఛ వచ్చినప్పుడు ఉపయోగపడే మెడికల్ ఎమర్జెన్సీ కార్డును వెంట ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది చిన్నదే అయినా, ఎంతో ఉపయోగకరమైన కార్డు, పిల్లల భద్రతను కాపాడడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పిల్లలు ఇతరుల సంరక్షణలో లేదా పరిచయం లేని వ్యక్తుల మధ్య ఉన్నప్పుడు ఇది ఎంతో సహాయపడుతుంది.

సీజర్ ఎమర్జెన్సీ కార్డు అంటే ఏమిటి?

సీజర్ ఎమర్జెన్సీ కార్డు (లేదా సీజర్ ఐ.డి) అనేది మీ పిల్లల ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ముఖ్యమైన వైద్య సమాచారాన్ని కలిగి ఉండే ఒక చిన్న కార్డు. మూర్ఛ వచ్చిన సమయంలో పిల్లలతో ఉన్న ఉపాధ్యాయులు, సంరక్షకులు, పొరుగువారు లేదా పరిచయం లేని వ్యక్తులు ఈ కార్డును చూసి అవసరమైన సమాచారాన్ని వెంటనే తెలుసుకోవచ్చు.

మూర్ఛ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే స్పష్టమైన సూచనలు ఈ కార్డులో ఉంటాయి. దీనివల్ల అత్యవసర సమయంలో ఆలస్యం కాకుండా సరైన సహాయం అందించవచ్చు, ముఖ్యంగా వైద్య సహాయం అందేలోపు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

సీజర్ ఐ.డి లో ఏమేమి ఉండాలి?

కార్డులోని సమాచారం స్పష్టంగా, సంక్షిప్తంగా, సులభంగా అర్థమయ్యేలా ఉండాలి. అందులో చేర్చాల్సిన ముఖ్యమైన వివరాలు ఇవి:

1. పిల్లల పేరు మరియు వయస్సు

సహాయం చేసే వ్యక్తి మీ పిల్లలను వెంటనే గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది.

2. అత్యవసర సమయంలో సంప్రదించవలసిన వారి వివరాలు

ఏ సమయంలో అయినా సంప్రదించగలిగే తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఫోన్ నంబర్లను ఇందులో చేర్చాలి.

3. నిర్ధారణ మరియు వైద్య వివరాలు

మీ పిల్లలకు మూర్ఛ ఉందని, అలాగే వారికి వచ్చే మూర్ఛ రకం గురించి తెలిసి ఉంటే ఆ వివరాలను పేర్కొనాలి.

4. ప్రథమ చికిత్స సూచనలు

మూర్ఛ వచ్చినప్పుడు ఏమి చేయాలో స్పష్టంగా పేర్కొనాలి. ఉదాహరణకు:

o   పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు చుట్టూ పదునైన లేదా గట్టి వస్తువులు లేకుండా చూడాలి.

o   శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా పిల్లలను మెల్లగా ఒక పక్కకు తిప్పి ఉంచాలి.

o   వారి నోటిలో ఎలాంటి వస్తువునూ పెట్టకూడదు.

o   మూర్ఛ కొనసాగుతున్న సమయాన్ని గమనించాలి.

o   మూర్ఛ 5 నిమిషాల కంటే ఎక్కువసేపు కొనసాగితే వెంటనే అత్యవసర వైద్య సహాయం కోసం కాల్ చేయాలి.

5. ప్రస్తుతం ఉపయోగిస్తున్న మందులు

మీ పిల్లలు క్రమం తప్పకుండా తీసుకుంటున్న మందుల పేర్లు మరియు మోతాదులను చేర్చాలి.

6.  వైద్యుల సమాచారం

మీ పిల్లల న్యూరాలజిస్ట్ లేదా ఆరోగ్య సేవలందించే వైద్యులను సంప్రదించడానికి అవసరమైన వివరాలను చేర్చండి.

7.  అలర్జీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు

వైద్య సిబ్బందికి తప్పనిసరిగా తెలియాల్సిన ఏవైనా ముఖ్యమైన మందుల అలర్జీలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే వాటిని పేర్కొనండి.

కార్డును లామినేట్ చేయడం లేదా సురక్షితమైన కవర్‌లో ఉంచడం ఉపయోగకరంగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల కార్డును సులభంగా వెంట తీసుకెళ్లవచ్చు, అలాగే ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చు.

కార్డులో వివరాలను ఎప్పటికప్పుడు సరిచేయడం

మీ పిల్లల మెడికల్ ఎమర్జెన్సీ కార్డులోని వివరాలు ఎప్పటికప్పుడు సరిగ్గా ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. మందుల పేరు, మోతాదు లేదా అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన వ్యక్తుల వివరాల్లో ఏదైనా మార్పు వచ్చిన ప్రతిసారీ, కార్డులో ఆ మార్పులను నమోదు చేసి కొత్త కార్డును ప్రింట్ చేసుకోవాలి. మీ పిల్లలు పాఠశాలకు, థెరపీ సెషన్లకు లేదా స్నేహితులతో బయటకు వెళ్లినప్పుడు కూడా ఈ కార్డును ఎల్లప్పుడూ తమ వెంట ఉంచుకునేలా ప్రోత్సహించాలి.

ఈ కార్డు కాపీలను మీ పిల్లల టీచర్, పాఠశాల నర్సు లేదా బస్సు అటెండెంట్‌తో కూడా పంచుకోవచ్చు. దీనివల్ల మీ పిల్లల రోజువారీ కార్యకలాపాల్లో భాగమయ్యే ప్రతి ఒక్కరూ, మూర్ఛ సమయంలో అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు త్వరగా మరియు సమర్థవంతంగా స్పందించగలరు.

మిమ్మల్ని మరియు ఇతరులను సిద్ధం చేయడం

అనుకోని పరిస్థితుల్లో ఎమర్జెన్సీ కార్డు ఉపయోగపడుతుంది. అయితే, మిమ్మల్ని మరియు మీ పిల్లల చుట్టూ ఉన్న ఇతరులను కూడా ముందుగానే సిద్ధం చేయడం అంతే ముఖ్యం. మూర్ఛ అంటే ఏమిటి, ఇది ఎలా కనిపిస్తుంది, మూర్ఛ వచ్చినప్పుడు ఏమి చేయాలి అనే విషయాల గురించి మీ పిల్లల టీచర్లు, స్నేహితులు మరియు సంరక్షకులతో మాట్లాడేందుకు కొంత సమయం కేటాయించండి.

మీ పిల్లల పిడియాట్రిక్ న్యూరాలజిస్ట్‌ను సంప్రదించి, వారికి వచ్చే మూర్ఛలు, ఉపయోగించే మందులు, అలాగే మూర్ఛకు కారణమయ్యే అంశాల గురించిన ప్రశ్నలు అడిగి తెలుసుకోవడం ద్వారా మీరు మరింతగా సిద్ధం కావచ్చు. మీ పిల్లల పరిస్థితి గురించి తెలుసుకోవడం వల్ల వారికి మరింత మెరుగ్గా సహాయం చేయగలుగుతారు. అలాగే, అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే నమ్మకం పెరుగుతుంది.

మూర్ఛ వచ్చినప్పుడు చేయవలసిన ప్రథమ చికిత్స సూచనలపై ఉన్న వీడియోను కూడా చూడాలని కోరుతున్నాము. ఈ వీడియోలో సంరక్షకులు మరియు కుటుంబ సభ్యులు మూర్ఛ వచ్చినప్పుడు ఏమి చేయాలో దశలవారీగా వివరించబడింది.

కృతజ్ఞతలు: ఈ విషయ వివరణను ఇంగ్లీష్‌ నుంచి తెలుగులోకి అనువదించడానికి తమ సమయాన్ని, తమ వంతు కృషిని అందించిన మా వాలంటీర్లు శైలజ తాడిమేటి మరియు శ్రీ కృష్ణాజీ దేవల్కర్‌కు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే, ఈ విషయాన్ని హిందీలోకి అనువదించిన ప్రేరణ చౌక్ మరియు హేమంతా నిజ్వాన్‌కు కూడా మా ధన్యవాదాలు. వారి సహకారం వల్ల ఈ ముఖ్యమైన సమాచారం భారతదేశంలోని మరెన్నో కుటుంబాలకు అందుబాటులోకి వస్తోంది.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996 కు సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

దయచేసి గమనించండి: మూర్ఛ నిర్వహణ కోసం అందిస్తున్న ఈ మెడికల్ ఎమర్జెన్సీ కార్డు నమూనా కేవలం సమాచారం కోసం మాత్రమే. మీ పిల్లలకు సురక్షితమైన మరియు తగిన వైద్య సలహా, సంరక్షణ అందించడానికి ఎల్లప్పుడూ అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి.

Write Blog

Share your experiences with others like you!

English