Skip to main content
Install App
If you're using:

మేధో వైకల్యం అంటే ఏమిటి? -త్వరిత మార్గదర్శిని

Default Avatar
Nayi Disha Team
Also available in: हिंदी English
Like Icon 0Likes
Download Icon 0 Downloads

Key Takeaways:

  • మేధో వైకల్యం (ఐ.డి) అభ్యాస, సామాజిక నైపుణ్యాలు మరియు రోజువారీ జీవితంపై ప్రభావం చూపుతుంది.
  • ఇది సాధారణంగా 5 నుండి 18 ఏళ్ల వయసులో ప్రారంభమవుతుంది మరియు దీని ప్రభావం వ్యక్తుల మధ్య భిన్నంగా ఉంటుంది.
  • సరైన సహాయం మరియు థెరపీలతో పిల్లలు స్వతంత్రంగా జీవనాన్ని పొందగలరు.
  • పిల్లల అభివృద్ధిలో కుటుంబ సహకారం కీలక పాత్ర పోషిస్తుంది.
  • సహాయానికి అవసరమైన వనరులు మరియు నిపుణుల మార్గదర్శనం అందుబాటులో ఉన్నాయి.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [1.95 MB]

మీ పిల్లవాడు లేదా మీకు తెలిసిన ఎవరైనా మేధో వైకల్యం (ఐ.డి.)తో నిర్ధారించబడ్డారా? అలా అయితే, మీ మనసులో ఎన్నో భావాలు కలగలిపి ఉండవచ్చు. ఈ పదాన్ని మీరు మొదటిసారిగా వింటుండవచ్చు, లేదా కొంతమేరకు మాత్రమే తెలుసుకునే అవకాశం ఉంది. ఈ త్వరిత మార్గదర్శిని – మేధో వైకల్యం (ఐ.డి.) సమాచార పత్రిక ఈ సమయంలో మీకు అవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది.

మేధో వైకల్యం అంటే ఏమిటి?

మేధో వైకల్యం (ఇంటలెక్చువల్ డిసేబిలిటీ) అనేది చిన్ననాటి నుండి ప్రారంభమయ్యే ఒక నాడీఅభివృద్ధి సంభందిత పరిస్థితి. (గతంలో దీనిని మెంటల్ రిటార్డేషన్ – ఎం. ఆర్. అని పిలిచేవారు, కానీ ఈ పదం ఇప్పుడు వాడడం లేదు.) సాధారణంగా ఇది 5 నుండి 18 సంవత్సరాల మధ్య మొదలవుతుంది. ఇది అభ్యాసం, సామాజిక పరస్పర చర్యలు, రోజువారీ జీవిత నైపుణ్యాలు వంటి విషయాల్లో, పిల్లల మనో సామర్థ్యం మరియు అనుకూలతలను ప్రభావితం చేస్తుంది. అయితే, సరైన సహాయం, అందుబాటులో ఉన్న వనరులు, మరియు కుటుంబ సహకారం ఉంటే, ఐ.డి  ఉన్న పిల్లలు నేర్చుకోవచ్చు, ఎదగవచ్చు మరియు సంతృప్తికరమైన జీవితం గడపగలరు.

చేస్తుంది. అయితే, సరైన సహాయం, అందుబాటులో ఉన్న వనరులు, మరియు కుటుంబ సహకారం ఉంటే, ఐ.డి  ఉన్న పిల్లలు నేర్చుకోవచ్చు, ఎదగవచ్చు మరియు సంతృప్తికరమైన జీవితం గడపగలరు.

మీ పిల్లల ప్రత్యేక అవసరాలను అర్ధం చేసుకోండి

మేధో వైకల్యం ప్రారంభ సంకేతాలు మరియు సూచనలు

ఐ.డి. యొక్క ప్రారంభ సంకేతాలు పిల్లల వయస్సు మరియు అభివృద్ధి దశను బట్టి మారుతాయి. సంరక్షకులు మరియు ఉపాధ్యాయులు గమనించగల కొన్ని సంకేతాలు ఇవి:

  • నడక, మాటలాడటం, లేదా టాయిలెట్ శిక్షణ వంటి అభివృద్ధి దశలను చేరుకోవడంలో ఆలస్యం.
  • సమస్యలు పరిష్కరించడంలో లేదా చెప్పినది అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడటం.
  • భాష మరియు సంభాషణలో సవాళ్లు.
  • ఆహారం తీసుకోవడం, దుస్తులు ధరించడం లేదా అలవాట్లను పాటించడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను నేర్చుకోవడానికి అదనపు సమయం అవసరం కావడం.
  • తోటి పిల్లలతో కలిసిపోవడంలో లేదా కొత్త పరిస్థితుల్లో భావోద్వేగాలను నియంత్రించడంలో ఇబ్బంది పడటం.

ప్రతి పిల్లవాడి అభివృద్ధి తనదైన వేగంలోనే ఉంటుందని గమనించాలి. కాలం గడుస్తున్నకొద్దీ వివిధ కోణాల్లో ఇబ్బందిని గమనిస్తే, అభివృద్ధి సంభందిత శిశు వైద్యుడిని (డెవలప్ మెంటల్ పిడియాట్రిషియన్) లేదా పిల్లల మనో వైద్యుడిని (చైల్డ్ సైకాలజిస్ట్) సంప్రదించడం వలన సరైన అంచనా లభిస్తుంది.

మేధో వైకల్యాన్ని ఏ విధంగా నిర్ధారణ చేస్తారు?

సాధారణంగా ఐ.డి ని క్రింది పద్ధతుల ద్వారా నిర్ధారణ చేస్తారు.   

  • అభివృద్ధి పరమైన అంచనాలు: పిల్లవాడు శారీరక, భావోద్వేగ మరియు సామాజిక పరంగా మైలురాళ్లను ఎలా చేరుకుంటున్నాడో పరిశీలించడం.
  • ఐ. క్యూ పరీక్షలు: మేధో పనితీరును కొలవడం (కానీ ఒక్క పరీక్ష పిల్లవాడి సామర్థ్యాన్ని నిర్ణయించదు).
  • అనుకూల ప్రవర్తన అంచనాలు(బిహేవియర్ అస్సెస్ మెంట్స్): రోజువారీ జీవనానికి అవసరమైన నైపుణ్యాలు, స్వీయ-సంరక్షణ, కమ్యూనికేషన్ వంటివి అంచనా వేస్తాయి.

ఈ మూల్యాంకనాలు క్లినికల్ సైకాలజిస్టులు లేదా ప్రత్యేక విద్యా నిపుణులు వంటి వృత్తి నిపుణులచే నిర్వహించబడతాయి.

ప్రారంభదశలో నిర్ధారణ ఎందుకు ముఖ్యం?

ముందుగా గుర్తించడం ద్వారా సమయానుకూల సహాయం, అవసరమైన మద్దతు అందించడానికి మార్గం సుగమమవుతుంది. ఇది పిల్లల అవసరాలను సంరక్షకులు మరియు ఉపాధ్యాయులు మరింతగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. దీని వలన:

  • పిల్లలు వారి స్వంత వేగంతో రోజువారీ పనులను అభివృద్ధి చేసుకోవడానికి మద్దతు ఇవ్వాలి.
  • సాధ్యమైన సహాయక లక్ష్యాలను పెట్టడం ద్వారా పిల్లల్లో ఒత్తిడి మరియు నిరాశ తగ్గుతుంది.
  • తక్కువ ఆత్మగౌరవం లేదా ఒంటరితనం కలిగించే భావాలను కలగకుండా చూడాలి.
  • పిల్లలు చురుకుగా, అర్థవంతంగా పాల్గొనడానికి పాఠశాలలు మరియు సమాజం సహాయం అందించేలా తోడ్పడండి.
  • కుటుంబాలు బలమైన సహాయక వలయాన్ని ఏర్పరచుకొని, తమ పిల్లలు సమర్థంగా ముందుకు రావడానికి సహాయపడండి.

తొలిదశలో సహాయం అందించడం అంటే, వారి అవసరాలను బాగా అర్థం చేసుకుని, అవగాహన, ప్రేమ, మరియు శ్రద్ధతో వారికి తోడుగా నిలబడటం.

మేధో వైకల్యం వల్ల ప్రభావితమయ్యే ప్రధాన అంశాలు

మేధో వైకల్యం పిల్లవాడి జీవనంపై పలు అంశాలలో ప్రభావితం చేస్తాయి. వాటిలో:

  • మేధో నైపుణ్యాలు: వీటిలో కొత్త సమాచారాన్ని నేర్చుకోవడం, రీజనింగ్ మరియు జ్ఞాపకశక్తి ఉంటాయి.
  • భాష మరియు సంభాషణ: ఇతరులను అర్థం చేసుకోవడం, అవసరాలను మరియు భావాలను వ్యక్తపరచడం.
  • సామాజిక మరియు భావోద్వేగ నైపుణ్యాలు: స్నేహాలు ఏర్పరచుకోవడం, భావోద్వేగాలను నియంత్రించడం, సామాజిక నియమాలను అర్థం చేసుకోవడం.
  • రోజువారీ జీవన నైపుణ్యాలు: దుస్తులు ధరించడం, ఆహారం తీసుకోవడం, శుభ్రత, దినచర్యను అనుసరించడం.

కానీ ఈ సవాళ్లతో పాటు, ఐ.డి ఉన్న పలువురు పిల్లలకు అద్భుతమైన సామర్ధ్యాలు కూడా ఉంటాయి, అవి దయ, సృజనాత్మకత, సంకల్పశక్తి, హాస్యభావం, లేదా వారిని సురక్షితంగా అనిపించే వ్యక్తులతో లోతుగా సంబంధం ఏర్పరచే సామర్థ్యం వంటివి కావచ్చు.

నిర్ధారణ పొందడం ద్వారా మీ బిడ్డ పరిస్థితిని మార్చలేరు కానీ వారి ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఈ అవగాహన ద్వారా మీరు ఎక్కువ ధైర్యంతో, స్పష్టతతో, మరియు సహానుభూతితో స్పందించగలరు.

ప్రతి బిడ్డ భిన్నంగా నేర్చుకుంటాడు

గమనించుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే మేధో వైకల్యం అనేది స్థిరమైన పరిమితి కాదు, అది ప్రపంచాన్ని తెలుసుకునే  మరియు అర్థం చేసుకునే భిన్న విధానం. పిల్లలకు కావలసిన సమయం, స్థలం, మరియు సహాయం అందిస్తే మేధో వైకల్యం ఉన్న పిల్లలు కూడా వికసించగలరు. వారు ఒక నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోవచ్చు లేదా దాన్ని వేరే విధంగా బోధించాల్సి రావచ్చు, కానీ దాంతో వారు నేర్చుకోలేరని అర్థం కాదు.

చిన్న విజయాలను కూడా ఆనందించండి. మీ బిడ్డ వేసే ప్రతి అడుగు అది ఎంత చిన్నదిగా కనిపించినా అది వారి అభివృద్ధికి సంకేతం. మీ బిడ్డ బలాలు, ఆసక్తులు, వారికి ఆనందాన్ని కలిగించే విషయాలపై దృష్టి పెట్టండి. అది సంగీతం, కదలిక, కళ లేదా రోజువారీ నియమం ఏదైనా కావొచ్చు. అన్నీ అనుబంధానికి, అభ్యాసానికి విలువైన మార్గాలుగా మారుతాయి.

ఐ.డి ఉన్న బిడ్డను పెంచడం కొన్ని ప్రత్యేక సవాళ్లతో ఉండవచ్చు కానీ అర్థం చేసుకునే క్షణాలు, మరియు ధైర్యం కూడా అందులో ఉంటాయి. ఈ ప్రయాణంలో మీరు ఒంటరిగా లేరు. సరైన మార్గదర్శకత్వం మరియు తోడ్పాటు ఉన్న సమాజం ఉంటే, మీరు మరియు మీ బిడ్డ అర్థవంతమైన, సహాయంతో నిండిన జీవితాన్ని నిర్మించగలరు.

కృతజ్ఞతలు:

మేధో వైకల్యం పై ఈ సమాచార పత్రాన్ని (ఫాక్ట్ షీట్) సిద్ధం చేయడంలో నిపుణుల సలహా మరియు మార్గదర్శకత్వం అందించిన న్యూరో-డెవలప్‌మెంటల్ పీడియాట్రీషియన్ డాక్టర్ సనా స్మృతి గారికి మా కృతజ్ఞతలు.

మేధోవైకల్యం పై అందుబాటులో ఉన్న సమాచార పత్రాన్ని కుటుంబాలు పరిశీలించాలని మేము ప్రోత్సహిస్తున్నాము. ఇందులో ప్రారంభ సంకేతాలు, బలాలను ఆధారంగా చేసుకుని వారికి అందుబాటులో ఉన్న థెరపీలు, అలాగే బిడ్డ శ్రేయస్సును పెంపొందించే మార్గదర్శకత్వం వంటి సమాచారం ఇవ్వబడింది.

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ఏ. డి హెచ్.డి. లేదా ఇతర మేధో వైకల్యాలు గురించి సందేహాలు ఉన్నా లేదా చిన్నారి అభివృద్ధిలో ఆలస్యం ఉందని అనుమానం ఉన్నా నయీ దిశా టీమ్ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీ ప్రశ్నలు లేదా సందేహాల కోసం దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌ 844-844-8996 కు కాల్ చేయండి లేదా వాట్సాప్‌లో సంప్రదించండి.మా కౌన్సిలర్లు ఆంగ్లం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషల్లో మాట్లాడగలరు.

DISCLAIMER: Please note that this guide is for information purposes only. Please consult a qualified health practitioner for safe management.

సూచన: ఈ వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడినవి. దయచేసి సురక్షితంగా నిర్వహించుకోవడానికి అర్హత పొందిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

Write Blog

Share your experiences with others like you!

English