Skip to main content
Install App
If you're using:

పిల్లలకు మల విసర్జన శిక్షణ (పూప్ ట్రైనింగ్)

SethuChildDevelopmentCenter from Goa is a Therapy Centre .

Sethu Centre for Child Development and Family Guidance

Also available in: English
Like Icon 0Likes

Key Takeaways:

 

  1.   ఈ రెడీ స్టడీ పాటీ వీడియోలో పిల్లలకు టాయిలెట్‌లో మల విసర్జన చేయడం మరియు టాయిలెట్ కు వెళ్లే మధ్యలో శుభ్రంగా ఉండడం నేర్పించే విధానంపై దృష్టి పెట్టబడింది.
  2.   టాయిలెట్ శిక్షణ అనేది పిల్లల జీవితాంతం స్వతంత్రతను పెంపొందించే ఒక ముఖ్యమైన మైలురాయి.
  3.   శిక్షణ ప్రారంభించే ముందు, పిల్లల ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.
  4.   పూప్ ట్రైనింగ్ ను అన్ని దశలను వరుసగా అనుసరిస్తూ ఇవ్వవచ్చు.
  5.   పిల్లలు సిద్ధంగా లేకముందే ప్రక్రియను తొందరపెడితే, మధ్యలో చిన్న పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది.
  6.   పిల్లలు సరిగా టాయిలెట్ ఉపయోగించినప్పుడు వారిని తప్పకుండా అభినందించి ప్రోత్సహించండి.
  7.   శ్రీమతి మధురా మనేరికర్ ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు, ముఖ్యంగా ఆటిజం ఉన్న పిల్లలకు బోధన చేయడంపై ఆసక్తి కలిగిన ప్రత్యేక విద్యావేత్త.

ఈ వ్యాసం రెడీ స్టడీ పాటీ సిరీస్‌లోని చివరి వీడియో ఆధారంగా రూపొందించబడింది. ఇందులో పిల్లలకు పూప్ ట్రైనింగ్ ఇచ్చే విధానం వివరించబడింది.

  • పిల్లలకు మల విసర్జన శిక్షణ ప్రారంభించే ముందు, వారి మల విసర్జనపై ప్రభావం చూపే ఏదైనా వైద్య పరిస్థితి ఉందో లేదో గుర్తించడం మొదటి దశ. దీనిని వైద్యుడు పరిశీలించి అవసరమైన సూచనలు ఇవ్వాలి.
  • మరో ముఖ్యమైన అంశం పిల్లల ఆహారం. ఆహారంలో ఫైబర్ సమృద్ధిగా ఉండాలి. ఫైబర్ మూలాలైన పండ్లు మరియు కూరగాయలను పిల్లలు తగినంతగా తీసుకునేలా చూడాలి. అలాగే తగినంత ద్రవాలు కూడా తీసుకోవాలి.
  • బొప్పాయి, అంజీర్, యాపిల్స్, పియర్స్ వంటి పండ్లు మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి మరియు ఆరోగ్యానికి మంచివి. నూనెలో వేయించిన ఆహారాలు మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలు మలబద్ధకానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది.
  • మలబద్ధకం లేదా గట్టిగా ఉండే మలం పిల్లలకు నొప్పిని కలిగించవచ్చు. అందువల్ల ఫైబర్ అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం చాలా అవసరం.
  • పాలు లేదా పాల పదార్థాలు జీర్ణం కాకపోవడం (లాక్టోస్ ఇన్ టోలరెన్స్) వంటి కొన్ని పరిస్థితులు కూడా మలబద్ధకానికి కారణమవుతాయి. ఇటువంటి విషయాలను వైద్యుడితో చర్చించి సరైన పరిష్కారం తీసుకోవాలి.

పిల్లలను టాయిలెట్‌కు ఎప్పుడు తీసుకెళ్లాలి?

  • పూప్ ట్రైనింగ్ యొక్క లక్ష్యం కూడా టాయిలెట్ శిక్షణలాగే ఉంటుంది. శిక్షణ పూర్తయ్యే సమయానికి, పిల్లలు టాయిలెట్‌కు తీసుకెళ్లినప్పుడు అక్కడే మల విసర్జన చేయడం మరియు మధ్యలో బట్టలు మురికికాకుండా ఉండడం నేర్చుకోవాలి.
  • అయితే, ఇది మూత్ర విసర్జన శిక్షణను ప్రణాళిక చేయడం అంత సులభం కాదు.
  • ప్రతి రోజు పిల్లలు సాధారణంగా ఏ సమయంలో బట్టలు మురికిచేస్తారో తల్లిదండ్రులు గుర్తించాలి.
  • చాలా మంది పిల్లల్లో ఈ సమయాలు కొంతవరకు నియమితంగా ఉంటాయి.
  • ఉదాహరణకు, కొంతమంది పిల్లలు ఉదయం వేళల్లో, భోజనం చేసిన తర్వాత లేదా శారీరక కార్యకలాపాల తర్వాత ఎక్కువగా మల విసర్జన చేయవచ్చు.
  • ఎక్కువ సందర్భాల్లో పిల్లలు మల విసర్జన చేసే ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. తల్లిదండ్రులు కొన్ని రోజుల పాటు ఈ సమయాలను గమనించి నమోదు చేయాలి. ఇవి ఖచ్చితంగా కాకపోయినా సాధారణంగా ఒకే సమయం ఉండే అవకాశం ఉంటుంది.
  • పిల్లల్లో ఈ సమయాలు నియమితంగా లేకపోతే, అది ఆహారానికి సంబంధించిన అంతర్గత సమస్యను సూచించే అవకాశం ఉంది. ముందుగా ఆ సమస్యను గుర్తించి పరిష్కరించడం అవసరం.

నా పిల్లలకు ఎలా శిక్షణ ఇవ్వాలి?

  • పిల్లలు సాధారణంగా మల విసర్జన చేసే సమయాన్ని గుర్తించిన తర్వాత, ఆ సమయానికి ఐదు నుంచి పది నిమిషాల ముందుగానే వారిని టాయిలెట్‌కు తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టండి. మూత్ర విసర్జనతో పోలిస్తే, మల విసర్జన కోసం వారు కొంచెం ఎక్కువసేపు కూర్చోవాల్సి ఉంటుంది.
  • ఉదాహరణకు, పిల్లలు ఉదయం నిద్రలేవగానే మల విసర్జన చేస్తారని గమనిస్తే, తల్లిదండ్రులు కొంచెం ముందుగానే పిల్లలను లేపి, బట్టల్లో కాకుండా టాయిలెట్‌లో మల విసర్జన చేయడానికి కూర్చోబెట్టాలి.
  • ఈ ప్రక్రియ పిల్లలకు ప్రశాంతంగా మరియు సరదాగా అనిపించేలా చూడండి.
  • పిల్లలు టాయిలెట్ ఉపయోగించిన తర్వాత, ఈ దశలను వారికి నేర్పుతూ సహాయం చేయండి:
    1. తమను తాము శుభ్రం చేసుకోవడం
    2. ప్యాంట్‌ను పైకి వేసుకోవడం
    3. టాయిలెట్‌ను ఫ్లష్ చేయడం
    4. చేతులు కడుక్కోవడం

ప్రోత్సాహం

  • పిల్లలు టాయిలెట్‌లో మల విసర్జన చేసిన వెంటనే వారిని ప్రోత్సహించడం చాలా ముఖ్యం.
  • టాయిలెట్‌ను సరిగ్గా ఉపయోగించిన తర్వాత వారికి ఇష్టమైన బొమ్మ, చిన్న బహుమతి లేదా ఇష్టమైన తినుబండారం ఇవ్వవచ్చు. పిల్లలను ప్రశంసించడం కూడా చాలా ముఖ్యం.
  • ఒకవేళ పొరపాటు జరిగితే, వారిని శుభ్రం చేసి, ఉతికిన బట్టలు వేయండి.
  • అలాంటి సందర్భాల్లో ఎక్కువ మాట్లాడకుండా, ప్రశాంతంగా వ్యవహరించండి.  “నువ్వు బట్టలు మురికిగా చేసుకున్నావు కాబట్టి నీకు బొమ్మ ఇవ్వను” వంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయకండి.
  • పిల్లలు కనీసం 90% సందర్భాల్లో టాయిలెట్‌లోనే మల విసర్జన చేసే వరకు శిక్షణను కొనసాగించండి. ఈ అలవాటును కనీసం రెండు వారాల పాటు స్థిరంగా కొనసాగించేలా సాధన చేయించండి.

స్వయంగా టాయిలెట్‌కు వెళ్లడం 

  • కొన్ని వారాల శిక్షణ తర్వాత, పిల్లలు స్వయంగా టాయిలెట్ ఉపయోగించాలనే సంకేతాలను చూపించడం ప్రారంభించవచ్చు.
  • టాయిలెట్‌కు వెళ్లాల్సిన అవసరాన్ని తెలియజేయడానికి వారు నేర్చుకున్న పదాలను ఉపయోగించవచ్చు.
  • కొంతమంది పిల్లలు మాటలకన్నా హావభావాలు, సంకేతాలు లేదా చిత్ర కార్డుల సహాయంతో తమ అవసరాన్ని తెలియజేయవచ్చు.
  • ఈ సంకేతాలను గమనించిన వెంటనే, “అవును! మనం టాయిలెట్‌కు వెళ్లాలి” అని సరళంగా చెప్పి పిల్లలను టాయిలెట్‌కు తీసుకెళ్లండి. ఎక్కువ వివరణలు లేదా పెద్ద సంభాషణలు అవసరం లేదు.
  • టాయిలెట్ శిక్షణ మాదిరిగానే, పిల్లలు ఎలాంటి సంకేతాలు ఇవ్వకపోతే, వారు స్వయంగా ప్రారంభించే అవకాశాలను సృష్టించండి.
  • ఉదాహరణకు, టాయిలెట్‌కు వెళ్లాల్సిన సమయం దగ్గరపడినప్పుడు కొంతసేపు వేచి ఉండి, పిల్లలు తమ అవసరాన్ని తెలియజేసే అవకాశాన్ని ఇవ్వవచ్చు.
  • ఈ దశలో పిల్లలను స్వయంగా టాయిలెట్‌కు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నప్పుడు, అప్పుడప్పుడు పొరపాటున బట్టల్లో మల విసర్జన జరగవచ్చు. అలాంటి సందర్భాల్లో నిరుత్సాహపడకుండా, సహనంతో వ్యవహరించి శిక్షణను కొనసాగించండి.

నా బిడ్డకు బట్టల్లో మల విసర్జన ఎందుకు జరుగుతోంది?

మల విసర్జన కోసం టాయిలెట్ శిక్షణ ఇస్తున్న సమయంలో పొరపాటుగా బట్టల్లో మల విసర్జన జరగడం సహజం. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు:

  • పిల్లలు ఇంకా సిద్ధంగా లేకముందే శిక్షణను వేగంగా ముందుకు తీసుకెళ్తుండవచ్చు. అలాంటి సందర్భంలో, వారు సిద్ధంగా అయ్యే వరకు మరికొన్ని రోజులు టాయిలెట్‌కు తీసుకెళ్లే ప్రక్రియను కొనసాగించండి.
  • పిల్లలు ఇచ్చే సంకేతాలను మీరు గుర్తించకపోవచ్చు. పిల్లలు స్వయంగా టాయిలెట్ అవసరాన్ని తెలియజేయడం ప్రారంభించిన తర్వాత, వారి స్పష్టంగా కనిపించనివి అయి ఉండవచ్చు. కాబట్టి వారు చూపించే ఏ చిన్న సూచననైనా జాగ్రత్తగా గమనించండి.
  • పిల్లలు పూర్తిగా సిద్ధం కాకముందే ప్రోత్సాహకాలను అకస్మాత్తుగా నిలిపివేయకండి. ఇష్టమైన బొమ్మలు లేదా బహుమతుల స్థానంలో రివార్డ్ చార్ట్ లేదా టోకెన్ వ్యవస్థను ఉపయోగించవచ్చు. ప్రోత్సాహకాలను క్రమంగా మరియు ప్రణాళికాబద్ధంగా తగ్గించాలి.
  • పిల్లలు టాయిలెట్‌ను ఉపయోగించడంలో మరింత నమ్మకం కలిగాక తర్వాత మాత్రమే వాటిని తగ్గించడం ప్రారంభించండి.

నమ్మకం కోల్పోవద్దు

మూత్ర విసర్జన లేదా మల విసర్జన కోసం టాయిలెట్ శిక్షణ ఇస్తున్నప్పుడు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. ప్రతి పిల్లవాడు తన స్వంత వేగంతో నేర్చుకుంటాడని గుర్తుంచుకోండి.

  1. అన్ని దశలను క్రమపద్ధతిలో మరియు వరుసగా అనుసరించండి.
  2. టాయిలెట్ రొటీన్‌కు సిద్ధం చేసే శిక్షణ (ట్రిప్ ట్రైనింగ్) సమయంలో సిద్ధంగా ఉండండి. సమయాలను నమోదు చేసుకోండి.
  3. పిల్లలు టాయిలెట్‌పై సౌకర్యంగా కూర్చునేలా చూడండి.
  4. టాయిలెట్ వినియోగించిన ప్రతిసారి ప్రశంసించండి మరియు ప్రోత్సహించండి.
  5. అనవసరంగా ఎక్కువ ప్రశ్నలు అడగవద్దు.
  6. ముఖ్యంగా, నిరుత్సాహపడవద్దు. 

ఈ విషయ వివరణ సేతు సెంటర్ రూపొందించిన టాయిలెట్ శిక్షణ వీడియో ఆధారంగా రూపొందించబడింది

ఈ సెషన్ 5 భాగాలుగా విభజించబడింది:  టాయిలెట్ శిక్షణకు సిద్ధం చేయడం, అలవాట్లను గమనించి నమోదు చేయడం (రికార్డింగ్),  టాయిలెట్ రొటీన్‌కు సిద్ధం చేసే శిక్షణ (ట్రిప్ ట్రైనింగ్), పిల్లలు స్వయంగా టాయిలెట్ అవసరాన్ని గుర్తించడం, మల విసర్జనకు సంబంధించిన శిక్షణ (పూప్ ట్రైనింగ్). ఈ దశలు తల్లిదండ్రులకు పిల్లల టాయిలెట్ శిక్షణను క్రమబద్ధంగా అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి.

ప్రత్యేక విద్యలో శిక్షణ పొందిన తర్వాత, మధుర మనేరీకర్ తన సమయాన్ని మరియు బోధనా నైపుణ్యాలను ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల అభివృద్ధికి అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. సేతు సెంటర్ లో పనిచేసిన సమయంలో, ఆమెకు ముఖ్యంగా ఆటిజం స్పెక్ట్రమ్ డిసార్డర్ ఉన్న పిల్లలకు బోధించడం పట్ల ప్రత్యేక ఆసక్తి పెరిగింది. పిల్లల స్వతంత్రతను పెంపొందించే నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో ఆమె విశేషంగా కృషి చేస్తున్నారు

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ ను 844-844-8996 లో సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు

గమనిక: ఈ విషయ వివరణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. మరింత సమాచారం కోసం దయచేసి అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి

Write Blog

Share your experiences with others like you!

English