Skip to main content

Sakhi helpline

Free and confidential. 10am to 6pm, in five languages.

Call 844-844-8996 Message on WhatsApp

ప్రత్యేక అవసరాలున్న పిల్లల థెరపిస్టులకు ఉండాల్సిన అర్హతలు

Default Avatar

Nayi Disha Team

Also available in: हिंदी English

Key Takeaways:

  1. థెరపీ విభిన్నంగా ఉంటుంది – వివిధ రకాల నిపుణులు పిల్లల అభివృద్ధి మరియు అభ్యాస అవసరాలకు తగిన విధంగా సహాయం చేస్తారు.
  2. అర్హతలను తెలుసుకోవడం – థెరపిస్టుల అర్హతలు, వారు అందించే సేవల గురించి తెలుసుకోవడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోవచ్చు.
  3. సమగ్ర విధానం: పిల్లలకు వైద్య, అభివృద్ధి, అభ్యాస రంగాలకు చెందిన నిపుణుల సహాయం అవసరమవచ్చు.
  4. న్యూరోఅఫర్మింగ్ కేర్ – పిల్లల బలాలు, సంభాషణ నైపుణ్యాలు, రోజువారీ పనులు చేసుకునే సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [1.02 MB]

ఎక్కడి నుండి ప్రారంభించాలి: మీ పిల్లల కోసం థెరపిస్టుల పాత్రను తెలుసుకుందాం

మీ పిల్లలకు మేధో వైకల్యం  లేదా అభివృద్ధి లోపం అని నిర్ధారణ అయినప్పుడు, కుటుంబ సభ్యులు తరచుగా “థెరపీ” అనే పదాన్ని ఎక్కువగా వింటారు. కానీ ఎన్నో రకాల థెరపిస్టులు, సేవలు ఉండటంతో, అయోమయంగా లేదా ఒత్తిడిగా అనిపించడం సహజం.

మీ పిల్లల అభివృద్ధికి తోడ్పడటంలో థెరపిస్టులు కీలక పాత్ర పోషించగలరు. కానీ ప్రతి బిడ్డకు ప్రతి థెరపీ అవసరం ఉండకపోవచ్చు. సరైన విధానం మీ బిడ్డ అవసరాలు, ఆసక్తులు, వయస్సు మరియు సౌకర్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ విషయవివరణ కుటుంబాలు సాధారణంగా కలిసే నిపుణులపై త్వరిత అవగాహనను ఇవ్వడానికి, అలాగే వారు పిల్లల అభివృద్ధికి వివిధ రంగాలలో ఎలా సహాయపడగలరో వివరించడానికి రూపొందించబడింది.

అన్ని విషయాల గురించి వెంటనే తెలుసుకోవాల్సిన అవసరం లేదు. లక్ష్యం మీ బిడ్డను “సరిచేయడం” కాదు. వారి వికాసానికి, ఉపయోగకరమైన నైపుణ్యాలను నేర్చుకోవడానికి, మరియు వారిని వారు తమ స్వంత విధానంలో వ్యక్తపరచడానికి సహాయపడటమే.

మేధో మరియు అభివృద్ధి లోపాలు ఉన్న పిల్లలకు వివిధ రకాల థెరపిస్టుల సహాయం ఉపయోగకరంగా ఉండవచ్చు. అయితే, ఎవరిని సంప్రదించాలి, వారికి ఉన్న అర్హతలు ఏమిటి అనే విషయంలో తల్లిదండ్రులు అయోమయానికి గురికావచ్చు. ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, వివిధ రకాల థెరపిస్టులు మరియు వారి పాత్రలపై స్పష్టమైన సమాచారాన్ని అందించడం నయీ దిశా లక్ష్యం.

వివిధ రకాల థెరపిస్టులు, వైద్య నిపుణులు మరియు వారి అర్హతలు

మీ పిల్లల అభివృద్ధి ప్రయాణంలో మీరు సంప్రదించాల్సి వచ్చే వివిధ రకాల నిపుణులు, వారికి సాధారణంగా ఉండే విద్యార్హతల గురించి ఈ విషయవివరణలో తెలుసుకుందాం. ఈ నిపుణులు పిల్లల ఎదుగుదల, అభ్యాసం, ఆరోగ్యం, శ్రేయస్సు మెరుగుపడేందుకు వివిధ విధాలుగా సహాయపడతారు.

ఆడియాలజిస్ట్

అర్హత: ఆడియాలజీ లేదా స్పీచ్ & హియరింగ్‌లో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ (BASLP/MASLP)

పాత్ర: వినికిడికి సంబంధించిన అవసరాలు, వినికిడి ప్రక్రియలో ఇబ్బందులు ఉన్నవారికి సహాయం చేస్తారు. వినికిడి పరికరాల  వినియోగం, వినికిడి నైపుణ్యాలను మెరుగుపరిచే థెరపీల ద్వారా తోడ్పడతారు.

బిహేవియరల్ థెరపిస్ట్

అర్హత: అప్లైడ్ బిహేవియర్ అనాలిసిస్ (ABA) లేదా సంబంధిత రంగాల్లో శిక్షణ (సైకాలజీ, స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా సోషల్ వర్క్‌లో డిగ్రీలు కలిగి ఉండవచ్చు)

పాత్ర: ముఖ్యంగా ఆటిజం లేదా ADHD ఉన్న పిల్లల్లో సానుకూల ప్రవర్తనలు, స్వీయ నియంత్రణ మరియు ఒత్తిడిని తగ్గించే నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయం చేస్తారు.

కౌన్సిలర్

అర్హత: కౌన్సెలింగ్ సైకాలజీ, క్లినికల్ సైకాలజీ లేదా మెంటల్ హెల్త్ కౌన్సెలింగ్‌లో పీజీ డిప్లొమా లేదా మాస్టర్స్ డిగ్రీ

పాత్ర: భావోద్వేగపరమైన తోడ్పాటు, మార్గదర్శకత్వం అందిస్తూ పిల్లల భావాలను అర్థం చేసుకుని వ్యక్తీకరించేందుకు సురక్షితమైన వాతావరణం కల్పించి, ధైర్యాన్ని పెంపొందించడంలో సహాయపడతారు.

డెర్మటాలజిస్ట్ (చర్మ రోగ నిపుణుడు)

అర్హత: డెర్మటాలజీలో MBBS + MD

పాత్ర: ఎగ్జిమా, దద్దుర్లు లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లు వంటి చర్మ సమస్యలను గుర్తించి చికిత్స చేస్తారు.

డెవలప్మెంటల్ పీడియాట్రిషన్

అర్హత: పీడియాట్రిక్స్‌లో MBBS + MD/DNB + డెవలప్మెంటల్ పీడియాట్రిక్స్‌లో అదనపు ఫెలోషిప్

పాత్ర: అభివృద్ధి ఆలస్యం, ఆటిజం, ADHD, అభ్యాసానికి సంబంధించిన భిన్నత్వాలు  వంటి పరిస్థితులను అంచనా వేసి సహాయం అందిస్తారు.

డిస్లెక్సియా థెరపిస్ట్

అర్హత: ఆర్టన్-గిల్లింగ్‌హామ్, బార్టన్ వంటి స్ట్రక్చర్డ్ లిటరసీ ప్రోగ్రామ్‌లలో సర్టిఫికేషన్, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేదా రిమీడియల్ థెరపిస్టులు కూడా కావచ్చు.

పాత్ర: చదవడం, రాయడం, మరియు అక్షరదోషాలలో(స్పెల్లింగ్) ఇబ్బందులు ఎదుర్కొనే పిల్లలకు సహాయం చేస్తారు.

ఎండోక్రినాలజిస్ట్

అర్హత: ఇంటర్నల్ మెడిసిన్‌లో MBBS + MD + ఎండోక్రైనాలజీలో DM

పాత్ర: ఎదుగుదలకు సంబంధించిన  సమస్యలు, థైరాయిడ్, మధుమేహం వంటి హార్మోన్ సంబంధిత సమస్యలను గుర్తించి చికిత్స చేస్తారు.

ఆర్థిక సలహాదారు (ఫైనాన్షియల్ కన్సల్టెంట్)

అర్హత: చార్టర్డ్ అకౌంటెంట్ (CA), సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (CFP) లేదా ఇతర సంబంధిత ఆర్థిక సర్టిఫికేషన్లు.

పాత్ర: మీ పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం – పొదుపు, ఇన్సూరెన్స్, లీగల్ గార్డియన్ షిప్ మొదలైన అంశాలపై ప్రణాళిక సిద్ధం చేయడంలో సహాయం చేస్తారు.

గైనకాలజిస్ట్

అర్హత: ప్రసూతి మరియు గైనకాలజీలో MBBS + MD/MS

పాత్ర: రుతుక్రమ ఆరోగ్యం , యుక్తవయస్సులో వచ్చే మార్పులు , మరియు పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించిన అంశాలలో సహాయం చేస్తారు.

హోమియోపతి వైద్యుడు

అర్హత: BHMS హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.)

పాత్ర: వివిధ శారీరక లేదా భావోద్వేగ సమస్యలకు హోమియోపతి చికిత్సలను అందిస్తారు.

న్యూరాలజిస్ట్

అర్హత: మెడిసిన్‌లో MBBS + MD + న్యూరాలజీలో DM

పాత్ర: మూర్ఛ (సీజర్లు), కదలిక సమస్యలు లేదా నాడీ వ్యవస్థ అభివృద్ధిలోని భిన్నత్వాలు మెదడు మరియు నాడీవ్యవస్థ సమస్యలను గుర్తించి చికిత్స చేస్తారు.

న్యూట్రిషనిస్ట్ / డైటీషియన్ (పోషకాహార నిపుణుడు)

అర్హత: పోషకాహారం లేదా డైటెటిక్స్‌లో BSc/MSc; రిజిస్టర్డ్ డైటీషియన్ (RD) సర్టిఫికేషన్

పాత్ర: అలర్జీలు, పరిమిత ఆహారాలను ఎంచుకోవడం,ఎదుగుదల  మరియు శక్తి అవసరాలకు అనుగుణంగా ఆహార ప్రణాళికలు మరియు పోషకాహార మార్గదర్శకత్వాన్ని అందిస్తారు.

ఆక్యుపేషనల్ థెరపిస్ట్ (ఓ.టి)

అర్హత: ఆక్యుపేషనల్ థెరపీలో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ (BOT/MOT) ఉండాలి

పాత్ర: తినడం, దుస్తులు ధరించడం, రాయడం, ఇంద్రియ(సెన్సరీ) నియంత్రణ వంటి రోజువారీ జీవన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతారు.

పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్ (శిశువుల కంటి నిపుణుడు)

అర్హత: ఆఫ్తాల్మాలజీలో MBBS + MS + పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజీలో ఫెలోషిప్

పాత్ర: పిల్లల్లో మెల్లకన్ను, ఒక కన్ను తక్కువగా కనిపించడం, చూపు సరిగా లేకపోవడం వంటి కంటి సమస్యలను గుర్తించి, చికిత్స అందిస్తారు.

పిడియాట్రిషన్ (పిల్లల వైద్యుడు)

అర్హత: పీడియాట్రిక్స్‌లో MBBS + MD/DNB

పాత్ర: పిల్లలకు సమగ్ర ఆరోగ్య సేవలు, టీకాలు మరియు అభివృద్ధి సంభందిత వైద్య పరీక్షలు అందిస్తారు.

ఫిజియోథెరపిస్ట్

అర్హత: ఫిజియోథెరపీలో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ (BPT/MPT) ఉండాలి.

పాత్ర: శారీరక సవాళ్లను ఎదుర్కొనే పిల్లలలో కదలిక, శరీర భంగిమ, సమతుల్యం మరియు కండరాల బలాన్ని మెరుగుపరచడంలో సహాయపడతారు.

సైకియాట్రిస్ట్ (మానసిక వైద్యుడు)

అర్హత: సైకియాట్రిలో MBBS + MD

పాత్ర: మానసిక ఆరోగ్య సమస్యలను గుర్తించి చికిత్స చేస్తారు. ఔషధాలు సూచించడమే కాకుండా థెరపీ కూడా అందించగలరు.

సైకాలజిస్ట్ (మానసిక నిపుణుడు)

అర్హత: క్లినికల్ సైకాలజీ లేదా కౌన్సెలింగ్ సైకాలజీలో మాస్టర్స్ లేదా ఎంఫిల్

పాత్ర: IQ, అభ్యాస సామర్థ్యాలు, భావోద్వేగాలకు సంబంధించిన అంచనాలు నిర్వహిస్తారు. అవసరమైన థెరపీ, భావోద్వేగపరమైన తోడ్పాటు అందిస్తారు. సైకాలజిస్టులు మందులు సూచించరు.

రిక్రియేషనల్ థెరపిస్ట్

అర్హత: థెరప్యూటిక్ రిక్రియేషన్ లేదా శిశు అభివృద్ధిలో శిక్షణ సంబంధిత రిక్రియేషన్ థెరపీ బోర్డుల నుండి సర్టిఫికేషన్ ఉండవచ్చు

పాత్ర: ఆటలు, కళ, సంగీతం మరియు క్రీడల ద్వారా చికిత్స, సామాజిక నైపుణ్యాల అభివృద్ధి మరియు ఆనందాన్ని పెంపొందిస్తారు.

రెమీడియల్ ఎడ్యుకేటర్ (ప్రత్యేక విద్యా నిపుణుడు)

అర్హత: స్పెషల్ ఎడ్యుకేషన్, రెమీడియల్ ఎడ్యుకేషన్ లేదా లెర్నింగ్ డిసెబిలిటీస్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా డిప్లొమా

పాత్ర: చదవడం, రాయడం, గణితం మరియు తరగతి గదిలో ఎదురయ్యే సవాళ్లకు వ్యక్తిగత విద్యా సహాయాన్ని అందిస్తారు.

షాడో టీచర్ (సహాయక ఉపాధ్యాయుడు)

అర్హత: సైకాలజీ, విద్య లేదా ప్రత్యేక విద్యలో ప్రాథమిక విద్యార్హతతో పాటు, ఉద్యోగంలో భాగంగా పొందిన శిక్షణ ఉండాలి.

పాత్ర: సాధారణ తరగతులలో పిల్లలు తోటి పిల్లలతో  కలిసి నేర్చుకోవడంలో మరియు పాల్గొనడంలో సహాయం చేస్తారు.

సోషల్ వర్కర్ (సామాజిక కార్యకర్త)

అర్హత: సోషల్ వర్క్‌లో బ్యాచిలర్ లేదా మాస్టర్ డిగ్రీ (BSW/MSW)

పాత్ర: సేవలు, ప్రభుత్వ పథకాలు, థెరపీ సూచనలు మరియు హక్కుల కోసం కుటుంబాలను అనుసంధానిస్తారు. మరియు వారికి మద్దతును అందిస్తారు.

స్పెషల్ ఎడ్యుకేషన్ నీడ్స్ (SEN) టీచర్ (ప్రత్యేక విద్యా అవసరాల ఉపాధ్యాయుడు)

అర్హత: ప్రత్యేక విద్యలో B.Ed లేదా M.Ed డిగ్రీ ఉండాలి. లేదా SENకు సంబంధించిన ఇతర గుర్తింపు పొందిన సర్టిఫికేషన్లు కలిగి ఉండాలి.

పాత్ర: వ్యక్తిగత విద్యా ప్రణాళికలు (IEPs) రూపొందించి, అభ్యాస మరియు అభివృద్ధి అవసరాలు ఉన్న పిల్లలకు బోధిస్తారు.

స్పీచ్ థెరపిస్ట్

అర్హత: BASLP/MASLP (ఆడియాలజీ మరియు స్పీచ్-లాంగ్వేజ్ పాథాలజీలో బాచిలర్ / మాస్టర్ డిగ్రీ ఉండాలి.

పాత్ర: మాటల స్పష్టత, భాష అర్థం చేసుకోవడం, కమ్యూనికేషన్ పరికరాల వినియోగం, అలాగే తినడం/మింగడం వంటి నైపుణ్యాలలో సహాయం చేస్తారు.

డిసేబిలిటీ స్పోర్ట్స్ కోచ్

అర్హత: అడాప్టివ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ లేదా ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి క్రీడా శిక్షణ అందించడంలో డిప్లొమా లేదా సర్టిఫికేషన్ ఉండాలి.

పాత్ర: సమ్మిళిత క్రీడల ద్వారా శారీరక దృఢత్వం, జట్టుగా పనిచేసే నైపుణ్యం (టీం వర్క్) మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడతారు.

విజన్ థెరపిస్ట్

అర్హత: ఆప్టోమెట్రీ లేదా నేత్ర వైద్యంలో అర్హతతో పాటు విజన్ థెరపీలో అదనపు శిక్షణ పొంది ఉండాలి.

పాత్ర: ముఖ్యంగా అభ్యాసం లేదా సెన్సరీ సంబంధిత ఇబ్బందులు ఉన్న పిల్లల్లో కళ్లతో వస్తువులను అనుసరించడం, కంటి–చేతి సమన్వయం, చూపు ఆధారంగా కదలికలను నియంత్రించే నైపుణ్యాలను మెరుగుపరచడంలో సహాయపడతారు.

యోగ థెరపిస్ట్

అర్హత: ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు యోగా ద్వారా సహాయం అందించడంలో శిక్షణతో పాటు, గుర్తింపు పొందిన యోగా థెరపీ సర్టిఫికేషన్ ఉండాలి.

పాత్ర: శారీరక, భావోద్వేగ ఆరోగ్యం మెరుగుపడేందుకు శరీర కదలికలు, శ్వాస వ్యాయామాలు, విశ్రాంతి పద్ధతులను ఉపయోగిస్తారు.

మరిన్ని వివరాల కోసం, ఆటిజం‌లో ప్రత్యామ్నాయ థెరపీలు నుకూడా పరిశీలించవచ్చు.

ప్రత్యేక అవసరాలున్న మీ పిల్లలకు సరైన థెరపిస్ట్‌ను ఎలా ఎంచుకోవాలి?

సరైన థెరపిస్ట్‌ను ఎంచుకోవడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు. మీ అవసరానికి ఉపయోగపడే కొన్ని సులభమైన సూచనలు ఇవి:

  •  ముందుగా మీ పిల్లలకు ఎక్కువగా అవసరమైన సహాయాన్ని గుర్తించండి. ఉదాహరణకు, మాట్లాడటం, శారీరక కదలికలు లేదా భావోద్వేగపరమైన తోడ్పాటు.
  •  మీ పిల్లల లాంటి అవసరాలు లేదా నిర్ధారణలు ఉన్న పిల్లలతో ఆ థెరపిస్ట్‌కు ఉన్న అనుభవం గురించి తెలుసుకోండి.
  •  మొదటి సెషన్‌లలో మీ బిడ్డ ఎలా స్పందిస్తున్నాడో గమనించండి – సరైన ఫలితం రాకపోతే థెరపిస్ట్‌ను మార్చడం తప్పు కాదు.
  • తల్లిదండ్రి లేదా సంరక్షకుడిగా మీ మనసు మాటను వినండి– మీ పిల్లలను మీరు మాత్రమే బాగా తెలుసుకోగలరు.

మీ పిడియాట్రిషన్ లేదా అభివృద్ధి నిపుణుడితో మాట్లాడి సూచనలు, మార్గదర్శకత్వం పొందవచ్చు.

థెరపిస్టుల నుండి ఏమి ఆశించాలి?

మీ పిల్లల థెరపిస్ట్‌తో మంచి సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి కొంత సమయం పడుతుంది. సహాయక థెరపీ అనుభవంలో భాగంగా ఏమేమి ఉండవచ్చో ఇక్కడ ఉంది:

సమిష్టిగా లక్ష్యాలు నిర్ణయించుకోవడం – మీ పిల్లల నేర్చుకునే వేగానికి తగ్గ చిన్న సరళమైన దశలను రూపొందించడం.

పురోగతి మరియు సవాళ్లపై చర్చించేందుకు క్రమం తప్పకుండా థెరపిస్ట్ ను సంప్రదించడం.

మీ పిల్లల బలాలు, ఆసక్తులు మరియు సౌలభ్యతల ఆధారంగా సులభ పద్దతులను ఎంచుకోవడం.

నిరంతర అభ్యాసం కోసం కుటుంబ సభ్యులు ఇంట్లో సులభంగా చేయగలిగే కార్యకలాపాలను ప్రోత్సహించడం

గుర్తుంచుకోండి: థెరపీ అనేది పోటీ కాదు. అది మీ పిల్లలు తన స్వంత వేగంలో ఎదగడానికి సురక్షితమైన, ప్రోత్సహించే వాతావరణాన్ని కలిసికట్టుగా సృష్టించుకోవడం.

సాధారణంగా థెరపీలు కష్టమైన పిల్లలకు ఇబ్బందిగా ఉన్నఅంశాలపై దృష్టి పెడతాయి – కానీ మీ పిల్లల యొక్క ప్రత్యేక ప్రతిభను మాత్రం మర్చిపోవద్దు. మేధో మరియు అభివృద్ధి వైకల్యాలు ఉన్న పిల్లల్లో ఇతరుల భావాలను అర్థం చేసుకునే సున్నితత్వం, మంచి జ్ఞాపకశక్తి, సృజనాత్మకంగా సమస్యలను పరిష్కరించే నైపుణ్యం లేదా చక్కటి హాస్య చతురత వంటి ప్రత్యేక బలాలు ఉండవచ్చు. ఈ సామర్థ్యాలే వారు నేర్చుకోవడానికి, ఎదగడానికి, ప్రపంచంతో మమేకం కావడానికి పునాదిగా నిలుస్తాయి.

థెరపిస్టులు వారి సవాళ్ల చుట్టూ పని చేయడం కాకుండా మీ పిల్లల బలాలను ఆధారంగా తీసుకుని పనిచేయాలని కోరండి.

మీ మొదటి సెషన్‌లో ఏమి అడగాలి?

మీ పిల్లలను మొదటి థెరపీ సెషన్‌కి వెళ్లే ముందు కంగారు లేదాఏం అడగాలో తెలియక గందరగోళంగా అనిపించడం సహజమే. చాలామంది తల్లిదండ్రులకు తాము సరైన ప్రశ్నలు అడుగుతున్నామా, సరైన విధంగా వ్యవహరిస్తున్నామా అనే సందేహాలు ఉంటాయి. లాంటి అనుభవం మీకు మాత్రమే కాదు. థెరపిస్ట్‌లు మీకు అన్ని విషయాలు ముందే తెలిసి ఉండాలని ఆశించరు. “ఏం అడగాలో నాకు తెలియడం లేదు” లేదా “నా పిల్లల పరిస్థితి గురించి నాకు వివరంగా అర్థమయ్యేలా చెప్పగలరా?” అని అడగడంలో ఎలాంటి ఇబ్బంది లేదు.

  • నా పిల్లల మాటలు, సంభాషణ లేదా ప్రవర్తనను గమనించినప్పుడు మీకు ఏమి గమనిస్తున్నారు?
  • పిల్లలతో నమ్మకం ఏర్పరచుకోవడానికి మీరు ఎలాంటి పద్ధతులను అనుసరిస్తారు?
  • తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నుండి మీరు ఎలాంటి భాగస్వామ్యాన్ని ఆశిస్తారు?

ఈ ప్రశ్నలు మీరు మరింత మద్దతుగా మరియు స్పష్టమైన సమాచారంతో ఉండడానికి సహాయపడతాయి.

సూచన: ఈ వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడినవి. దయచేసి సురక్షితంగా నిర్వహించుకోవడానికి అర్హత పొందిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

కృతజ్ఞతలు: ఈ విషయవివరణలోని సమాచారాన్ని ధృవీకరించిన నిపుణులు జితేంద్ర సోలంకి, రెను మనీష్, ఫరీదా రాజ్, అఫ్షాన్ జబీన్, సనా స్మృతి, చిత్ర తడతిల్ మరియు రెబెక్కా గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD. లేదా ఇతర మేధో వైకల్యాలు గురించి సందేహాలు ఉన్నా లేదా చిన్నారి అభివృద్ధిలో ఆలస్యం ఉందని అనుమానం ఉన్నా నయీ దిశా టీమ్ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీ ప్రశ్నలు లేదా సందేహాల కోసం దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌ 844-844-8996 కు కాల్ చేయండి లేదా వాట్సాప్‌లో సంప్రదించండి.మా కౌన్సిలర్లు ఆంగ్లం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషల్లో మాట్లాడగలరు.

Write Blog

Share your experiences with others like you!

English