Skip to main content
Install App
If you're using:

భాష అభివృద్ధికి మార్గదర్శిని

Default Avatar

Nayi Disha Team

Also available in: English

Key Takeaways:

  • సహాయక వాతావరణం: ప్రేమ, ప్రోత్సాహం మరియు భద్రత కలిగిన వాతావరణం పిల్లల భాషా నైపుణ్యాలు, సంభాషణ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
  •  కుటుంబం పాత్ర: పిల్లల భాషా అభివృద్ధిని ప్రోత్సహించడంలో కుటుంబ సభ్యుల పాత్ర ఎంతో ముఖ్యమైనది.
  •  సహజమైన అభ్యాసం: ఆటలు మరియు రోజువారీ కార్యకలాపాల ద్వారా భాషా నేర్చుకోవడం సహజంగానే జరుగుతుంది.
  •  నిరంతరంగా ఒకే భాషను ఉపయోగించడం: పిల్లల చుట్టూ ప్రధానంగా ఒకే భాషను నిరంతరం ఉపయోగించడం వల్ల వారు ఆ భాషను సులభంగా అర్థం చేసుకుని నేర్చుకోగలుగుతారు.
  •   ఆచరణాత్మక  మార్గదర్శిని: ఈ ప్రజెంటేషన్‌లో తల్లిదండ్రులు ఇంట్లోనే తమ పిల్లల భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడే సులభమైన కార్యకలాపాలు మరియు అవసరమైన నైపుణ్యాలను అందించబడ్డాయి.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [344.64 KB]

పిల్లలు సురక్షితంగా, ప్రోత్సాహకరమైన వాతావరణంలో ఉన్నప్పుడు, తమను అర్థం చేసుకుంటున్నారని భావించినప్పుడు సంభాషించడం ఉత్తమంగా నేర్చుకుంటారు. భాష అభివృద్ధి అంటే కేవలం మాట్లాడడం నేర్చుకోవడం మాత్రమే కాదు. ఇతరులను అర్థం చేసుకోవడం, వారితో అనుబంధాన్ని పెంచుకోవడం, అలాగే తమ అవసరాలు, భావాలు, ఆలోచనలను వ్యక్తపరచడం కూడా. భాష అభివృద్ధి చిన్న వయస్సులోనే ప్రారంభమవుతుంది. ఆటల సమయంలో, భోజనం చేసే సమయంలో, కథలు చదివే సమయంలో, అలాగే రోజువారీ చిన్న చిన్న సందర్భాల్లో జరిగే సంభాషణల ద్వారా అది సహజంగా అభివృద్ధి చెందుతుంది.

పిల్లలు ప్రోత్సహక వాతావరణంలోనే భాషను, సంభాషణా నైపుణ్యాలను సమర్థంగా నేర్చుకుంటారు. ఇటువంటి వాతావరణం పిల్లల్లో నేర్చుకోవాలనే ఆసక్తిని పెంచడమే కాకుండా, వారి పదజాలాన్ని విస్తరించడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పిల్లలు ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతోనే గడుపుతారు. అందువల్ల, వారి భాష అభివృద్ధిలో కుటుంబం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. థెరపీ సెషన్లు, పాఠశాల లేదా ఇతర అభ్యాస వాతావరణాలు పిల్లల అభివృద్ధికి తోడ్పడతాయి. అయితే, భాషను నేర్చుకోవడంలో ఎక్కువ భాగం ఆటలు, రోజువారీ సంభాషణలు, అలాగే సాధారణ రోజువారీ కార్యకలాపాల ద్వారా సహజంగా జరుగుతుంది.

కుటుంబం పాత్ర ఎందుకు ముఖ్యమైనది?

పిల్లల భాషాభివృద్ధిలో కుటుంబ పాత్ర ఎంతో కీలకమైనది. చిన్న వయస్సు నుంచే పిల్లలు తమ చుట్టూ ఉన్న వారి స్వరాలకు, ముఖ కవళికలకు స్పందించడం ప్రారంభిస్తారు. పసిపిల్లలు తల్లిదండ్రులు, సంరక్షకులు మాట్లాడే పదాలను అనుకరించి నేర్చుకుంటారు. ప్రీ-స్కూల్ వయస్సు పిల్లలు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి “ఎందుకు?”, “ఏమిటి?” వంటి ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. ఇవన్నీ పిల్లలు సురక్షితమైన, ప్రేమపూర్వకమైన మరియు స్పందించే వాతావరణంలో సంభాషణను నేర్చుకుంటున్నారనే సంకేతాలు.

పిల్లల భాషాభివృద్ధిని ప్రోత్సహించేందుకు తల్లిదండ్రులు, సంరక్షకులు అలవర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నైపుణ్యాలు ఇవి:

  • మీ పిల్లలు చేసే పనులను గమనించి, వాటికి స్పందించండి. మీ పిల్లలు ఏదైనా వస్తువును చూసినా లేదా చూపించినా, వారి ఆసక్తిని అనుసరిస్తూ దాని గురించి మాట్లాడండి. ఉదాహరణ: “అరే! నువ్వు కుక్కను చూస్తున్నావా? అది పెద్దగా ఉంది కదా…” అని మాట్లాడండి.
  • మాట్లాడే ముందు మీ పిల్లల దృష్టి మీపై ఉండేలా చూసుకోండి. వారిని మెల్లగా పేరుతో పిలవండి, వారి కంటి స్థాయికి తగినట్లుగా ఉండి, నెమ్మదిగా మరియు స్పష్టంగా మాట్లాడండి. ఇలా చేయడం వల్ల వారు మీ మాటలను సులభంగా అర్థం చేసుకుని స్పందించగలుగుతారు.
  • పదాలను పునరావృతం చేయండి, కొత్త పదాలను జోడించి చెప్పండి. మీ పిల్లలు “కారు” అని చెప్పినప్పుడు, “అవును! అది ఎర్ర కారు. ఎర్ర కారు వేగంగా వెళ్తోంది.” అని మీరు చెప్పండి. ఇలా పునరావృతం చేస్తూ, మరికొన్ని పదాలను జోడించడం వల్ల పిల్లల పదజాలం పెరుగుతుంది.
  • వారు చెప్పినదానిని “తప్పు” అని చెప్పకండి. పిల్లలు ఏదైనా వస్తువు పేరును తప్పుగా చెప్పినా, సరైన పదాన్ని నిదానంగా చెప్పండి. ఉదాహరణకు:
    పిల్లలు: (పిల్లిని చూపిస్తూ)”అది కుక్క.” 
    తల్లిదండ్రులు: “అది కుక్కలా కనిపిస్తోంది. కానీ అది పిల్లి. పిల్లి ‘మ్యావ్’ అంటుంది.” అని వివరించండి.
  • తదుపరి ప్రశ్నలు అడుగుతూ సంభాషణను కొనసాగించండి. ఇలా చేయడం వల్ల పిల్లలు మరింత ఆలోచించి మాట్లాడేందుకు ప్రోత్సాహం పొందుతారు. ఉదాహరణకు, “పిల్లి ఎక్కడికి వెళ్తోంది?”, “చెంచాను మనం దేనికి ఉపయోగిస్తాం?

భాషాభివృద్ధిని ప్రోత్సహించే సులభమైన కార్యకలాపాలు

పిల్లలకు భాషను నేర్పడానికి ప్రత్యేకించి ఫ్లాష్ కార్డులు లేదా ఖరీదైన సామాగ్రి అవసరం లేదు. రోజువారీ జీవితంలో చేసే చిన్న చిన్న కార్యకలాపాల ద్వారానే పిల్లలు భాషను అర్థం చేసుకోవడం, ఉపయోగించడం నేర్చుకుంటారు. అలాంటి కొన్ని సులభమైన కార్యకలాపాలు ఇవి:

  • సూచనలు ఇవ్వడం (ప్రాంప్టింగ్), అనుకరించడం, మరియు పదాలతో గుర్తించడం

సూచనలు ఇవ్వడం:  పిల్లలు మాట్లాడేలా మెల్లగా ప్రోత్సహించడం. ఇందుకోసం వారికి ప్రశ్నలు అడగడం లేదా ఎంపికలు ఇవ్వడం చేయవచ్చు.
అనుకరించడం: పిల్లలు చెప్పిన మాటలను లేదా చేసిన చర్యలను మీరు కూడా అలాగే చేయడం. ఇలా చేయడం వల్ల మీరు వారి మాటలు, చర్యలపై ఆసక్తిగా ఉన్నారని వారికి తెలుస్తుంది.
పదాలతో గుర్తించడం: పిల్లలు చూసే వస్తువులను వాటి పేర్లతో అనుసంధానం చేస్తూ చెప్పడం.
ఉదాహరణ: మీ పిల్లలు ఒక బంతిని తీసుకుంటే, “బంతి! నీ దగ్గర ఎర్ర బంతి ఉంది. రా, మనం బంతిని వేద్దాం.” అని చెప్పండి.

  • చిత్రాలతో కూడిన పుస్తకాలు చదవడం

పిల్లలతో కలిసి చిత్రాలతో కూడిన పుస్తకాలు చదవడం వల్ల వారి పదజాలం పెరగడంతో పాటు, వాక్యాలను ఎలా నిర్మించాలో కూడా క్రమంగా నేర్చుకుంటారు.

సూచన: చిత్రాలను చూపిస్తూ అందులో ఏమి జరుగుతోందో మాట్లాడండి. అలాగే పిల్లలను ఆలోచించేలా ప్రశ్నలు అడగండి. “ఇక్కడ నీకు ఏమి కనిపిస్తోంది?”, “ఆ అబ్బాయి ఎందుకు నవ్వుతున్నాడు?” వంటివి అడగవచ్చు.

  • WH’ ప్రశ్నలు అడగడం

ఏమిటి? (వాట్-WH), ఎక్కడ? (వేర్-WH), ఎవరు? (హూ-WH), ఎప్పుడు? (వెన్ -WH), ఎందుకు? (వై-WH), ఎలా? (హౌ) వంటి ప్రశ్నలను పిల్లలకు అడగండి.
ఉదాహరణ: కథ పూర్తయిన తర్వాత, “ఆ కుక్కకు ఏమైంది?”, “ఆ అమ్మాయి ఎందుకు బాధగా ఉంది?” అని అడగండి.

  • వస్తువుల ఉపయోగాలను నేర్పించడం.

ఏ వస్తువును ఎందుకు ఉపయోగిస్తారో పిల్లలకు నేర్పండి.
ఉదాహరణకు: “చెంచాను తినడానికి ఉపయోగిస్తాం.”, “టూత్‌బ్రష్‌ను పళ్లు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగిస్తాం.”

  • విశేషణాలు (వర్ణనాత్మక పదాలు) నేర్పించడం

విశేషణాలు పిల్లలు వస్తువులు, వ్యక్తులు లేదా పరిస్థితులను మరింత స్పష్టంగా వివరించడానికి సహాయపడతాయి.
ఉదాహరణకు: “ఇది పెద్ద బంతి.”, “నీళ్లు చల్లగా ఉన్నాయి.”, “ఆ బొమ్మ చూడు ఎలా చప్పుడు చేస్తుందో!”

  • వస్తువులను వర్గీకరించడం.

బొమ్మలు, పండ్లు లేదా బట్టలను రంగు, పరిమాణం లేదా ఆకారం ఆధారంగా వర్గీకరించే విధంగా చేయండి.
ఉదాహరణకు: “అన్ని ఎరుపు రంగు బ్లాక్‌లను ఒక పెట్టెలో వేద్దాం.”, “ఇవి పెద్దవి, ఇవి చిన్నవి.”

  • వాక్యాలు నిర్మించడం నేర్పించడం.

మీ పిల్లలను పూర్తి వాక్యాలలో మాట్లాడేలా ప్రోత్సహించండి. వారు చెప్పిన మాటలను విస్తరించి, సరైన వాక్యంగా చెప్పి చూపించండి.
ఉదాహరణకు:
పిల్లలు: “కుక్క పరిగెత్తుతుంది.”
తల్లిదండ్రులు: “అవును! కుక్క వేగంగా పరిగెత్తుతోంది.”

ఒకే భాష మాట్లాడే వాతావరణాన్ని కొనసాగించడం

పిల్లలతో మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా ప్రారంభ దశలో, ఒకే భాషను నిరంతరం ఉపయోగించడం మంచిది. తరచూ భాషలు మార్చి మాట్లాడడం వల్ల పిల్లలకు పదాల అర్థం, వాక్య నిర్మాణం అర్థం చేసుకోవడం కొంత కష్టంగా ఉండవచ్చు. మీ కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ భాషలు మాట్లాడితే, ఇంట్లో ఒకే భాషను నిరంతరం ఉపయోగించడం, మరో భాషను పాఠశాల లేదా థెరపీ వంటి ఇతర వాతావరణాల్లో ఉపయోగించవచ్చు.

సాంకేతికత మరియు కథల ద్వారా నేర్చుకోవడం

ఈ విషయ వివరణ తల్లిదండ్రులు, సంరక్షకులు రోజువారీ జీవితంలో తమ పిల్లల భాష మరియు సంభాషణా నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడేందుకు రూపొందించిన ప్రెజెంటేషన్ ఆధారంగా తయారు చేయబడింది. ఇందులో భాషాభివృద్ధికి ఉపయోగపడే సులభమైన కార్యకలాపాలు, ఉదాహరణ ప్రశ్నలు, అలాగే పిల్లలతో గౌరవంగా, ప్రేమతో ఎలా సంభాషించాలో తెలిపే ఉపయోగకరమైన సూచనలు ఉన్నాయి.

ప్రతి పిల్లవాడు తనదైన వేగంతో నేర్చుకుంటాడు. కొందరు పిల్లలు త్వరగా మాట్లాడటం ప్రారంభిస్తారు, మరికొందరికి కొంత ఎక్కువ సమయం పట్టవచ్చు. ఇది సహజమైన విషయం. ముఖ్యమైనది ఏమిటంటే, పిల్లలు తమను అర్థం చేసుకునే, గౌరవించే, ప్రోత్సహించే వాతావరణంలో ఎదగడం. ఆటిజం, ఏ.డి.హెచ్.డి, డౌన్ సిండ్రోమ్ లేదా అభివృద్ధి ఆలస్యం ఉన్న పిల్లలకు భాషాభివృద్ధి కోసం మరింత మద్దతు అవసరం కావచ్చు. వారు తమదైన వేగంతో నేర్చుకోవచ్చు. అదీ సహజమే. ప్రతి చిన్న పురోగతిని గుర్తించి, వారిని ప్రేమతో, ఓర్పుతో ప్రోత్సహించడం ఎంతో ముఖ్యం.

కృతజ్ఞతలు: ఈ సమాచారాన్ని సమీక్షించి, ధృవీకరించిన డెవెలప్మెంటల్ పిడియాట్రిషన్ డా. అజయ్ శర్మ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.

గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. సరైన మార్గదర్శకత్వం కోసం దయచేసి అర్హత కలిగిన వైద్య నిపుణుడిని సంప్రదించండి.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ఏ.డి.హెచ్.డి, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996 కు సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

Write Blog

Share your experiences with others like you!

English