Skip to main content

Sakhi helpline

Free and confidential. 10am to 6pm, in five languages.

Call 844-844-8996 Message on WhatsApp

ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల దంత సంరక్షణ, నిర్వహణకు సూచనలు

ToothBuddies

Toothbudies

Also available in: English

Key Takeaways:

  1. మేధో మరియు అభివృద్ధి సంబంధిత సవాళ్లు (IDD) ఉన్న పిల్లలకు వైద్యపరమైన, ఇంద్రియ (సెన్సరీ) లేదా ప్రవర్తనా సమస్యల కారణంగా ప్రత్యేక దంత సంరక్షణ అవసరం కావచ్చు
  2. నోటి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం ద్వారా పళ్ళు పాడుకావడం, చిగుళ్ల సమస్యలు మరియు పళ్ల అసమాన అమరిక వంటి సమస్యలను నివారించవచ్చు.
  3. పిల్లల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా పిల్లల దంత వైద్యులు చికిత్స ప్రణాళికను రూపొందిస్తారు.
  4. దంత పరీక్షకు వెళ్లే ముందు పిల్లలకు క్రమంగా అలవాటు చేయడం, అక్కడ జరిగే విషయాలను ముందుగానే పరిచయం చేయడం ద్వారా వారి భయం, ఆందోళనను తగ్గించవచ్చు.
  5. ఇంట్లో నోటి పరిశుభ్రతను క్రమం తప్పకుండా మరియు సరైన విధంగా పాటించేలా చూడటంలో తల్లిదండ్రులు మరియు సంరక్షకుల పాత్ర చాలా ముఖ్యమైనది.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [637.34 KB]

దంత ఆరోగ్యం ఎందుకు ముఖ్యం? 

ప్రతి పిల్లల సంపూర్ణ ఆరోగ్యానికి నోటి ఆరోగ్యం ఎంతో అవసరం. మేధో మరియు అభివృద్ధి సంబంధిత సవాళ్లు (IDD) ఉన్న పిల్లల్లో, ఇప్పటికే ఉన్న ఆరోగ్య పరిస్థితులు, ఇంద్రియ (సెన్సరీ) సున్నితత్వం లేదా సంభాషణలో ఇబ్బందుల కారణంగా పళ్లు మరియు చిగుళ్ల ఆరోగ్యాన్ని నిర్వహించడం కొంత కష్టంగా ఉండవచ్చు. దంత క్షయం, చిగుళ్ల ఇన్‌ఫెక్షన్లు లేదా పళ్ల అసమాన అమరిక వంటి సమస్యలు పిల్లల చిరునవ్వుపైనే కాకుండా, ఆహారం తినడం, మాట్లాడటం మరియు సౌకర్యంగా ఉండటం వంటి అంశాలపైనా  కూడా ప్రభావం చూపవచ్చు. 

సాధారణంగా ఎదురయ్యే దంత సమస్యల గురించి తెలుసుకుని, చిన్నప్పటి నుంచే నోటి పరిశుభ్రత అలవాట్లను క్రమం తప్పకుండా పాటించేలా చూడటం ద్వారా సమస్యలు సమస్యలు తీవ్రమై నొప్పి కలిగించే ముందే వాటిని నివారించవచ్చు.

IDD ఉన్న పిల్లల్లో సాధారణంగా కనిపించే దంత సమస్యలు

IDD ఉన్న పిల్లల్లో ఈ క్రింది దంత సమస్యలు కనిపించవచ్చు:

  • పిప్పి పళ్ళు: క్రమం తప్పకుండా బ్రష్ చేయకపోవడం, నోరు సరిగా పుక్కిలించలేకపోవడం లేదా తీపి పదార్థాలు కలిగిన మందుల వల్ల పిప్పి పళ్ళు రావచ్చు.
  • చిగుళ్ల సున్నితత్వం: కొన్ని ఆరోగ్య పరిస్థితులు లేదా మందుల ప్రభావం వల్ల చిగుళ్లలో రక్తస్రావం లేదా ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది.
  • పళ్లు కొరకడం (బ్రక్సిజం): ఒత్తిడి లేదా సెన్సరీ అవసరాల కారణంగా కొంతమంది పిల్లలు పళ్లు కొరకవచ్చు. దీని వల్ల పళ్లపై ఉండే రక్షణ పొర (ఎనామెల్) అరిగిపోవచ్చు.
  • పళ్ల అసమాన అమరిక: కొంతమంది పిల్లల్లో పళ్లు దగ్గరగా ఉండటం, ఖాళీలు ఉండటం లేదా ఇతర అసమానతలు కనిపించవచ్చు. దీని వల్ల నోటి పరిశుభ్రతను నిర్వహించడం కష్టమవుతుంది.
  • అలవాట్లు: వేళ్ళు చప్పరించడం, నోటి ద్వారా శ్వాస తీసుకోవడం లేదా ఆహారాన్ని నోటిలోనే ఎక్కువసేపు ఉంచుకోవడం వంటి అలవాట్లు దంత ఆరోగ్యాన్ని ప్రభావితం చేయవచ్చు.

ఈ సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించడం ద్వారా సరైన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని, దీర్ఘకాలికంగా మంచి ఫలితాలు పొందవచ్చు.

పిల్లల దంత వైద్యుల పాత్ర

ఈ విషయ వివరణను రూపొందించడంలో సహకరించిన  పిల్లల దంత వైద్య నిపుణులు Dr. గాయత్రి మోఘే మరియు Dr. కెవిన్ వెర్గీస్ సామ్ పిల్లల అవసరాలకు అనుగుణమైన వ్యక్తిగత దంత సంరక్షణ ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు.

పిల్లల దంత వైద్యులు సాధారణంగా ఈ విషయాల్లో సహాయం చేస్తారు:

  • పిల్లల వైద్య చరిత్రను పరిశీలించి, దానికి అనుగుణంగా చికిత్స ప్రణాళిక రూపొందిస్తారు.
  • పిల్లలకు అనువైన టూత్‌బ్రష్‌లు, టూత్‌పేస్ట్‌లు లేదా నోరు శుభ్రపరిచే పద్ధతులను సూచిస్తారు
  • పళ్లను పాడవకుండా కాపాడేందుకు ఫ్లోరైడ్ చికిత్స లేదా పళ్లపై రక్షణ పూత (సీలెంట్స్) వంటి నివారణ చికిత్సలను అందిస్తారు.
  • ఇంట్లో పాటించాల్సిన నోటి పరిశుభ్రత అలవాట్లపై తల్లిదండ్రులకు సూచనలు ఇవ్వడం  మరియు సులభమైన బ్రషింగ్ పద్ధతులను తెలియజేస్తారు.
  • పళ్ల అమరికను పరిశీలించి, అవసరమైతే తగిన చికిత్సలను సూచిస్తారు.

సహాయక దంత వైద్యుడు, ముందుగా పిల్లల్లో నమ్మకం మరియు సౌకర్యాన్ని పెంపొందించేందుకు సమయం కేటాయిస్తారు. దీని వల్ల దంత పరిక్షలు పిల్లలకు తక్కువ ఒత్తిడిగా మరియు మరింత ప్రయోజనకరంగా మారుతాయి.

దంత వైద్యుల వద్దకు వెళ్లేందుకు మీ పిల్లలను సిద్ధం చేయడం

చాలా మంది పిల్లలకు దంత పరిక్షలు అంటే భయంగా లేదా ఆందోళనగా అనిపించవచ్చు. పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు తల్లిదండ్రులు ఈ పద్ధతులను పాటించవచ్చు:

  • దంత పరీక్ష గురించి ముందుగా చెప్పండి: ఏమి జరుగుతుందో పిల్లలకు సులభమైన మరియు ధైర్యం ఇచ్చే మాటలతో వివరించండి. విజువల్ షెడ్యూల్స్ లేదా కథల పుస్తకాలు ఉపయోగించడం కూడా సహాయపడుతుంది.
  • ఇంట్లో ముందుగా సాధన చేయించండి: పిల్లలను కుర్చీలో కూర్చోబెట్టి నోరు తెరవడం వంటి విషయాలను సాధన చేయించండి. ఇలా చేయడం వల్ల డెంటల్ చెయిర్ వారికి పరిచయంగా అనిపిస్తుంది.
  • పిల్లలకు ఇష్టమైన వస్తువులు వెంట తీసుకెళ్లండి: ఇష్టమైన బొమ్మ, ప్రశాంతమైన సంగీతం వినేందుకు హెడ్‌ఫోన్స్ లేదా సెన్సరీ సహాయక వస్తువులు పిల్లల్లో ఆందోళన తగ్గించడంలో సహాయపడవచ్చు.
  • సరైన సమయాన్ని ఎంచుకోండి: పిల్లలు ప్రశాంతంగా మరియు సహకరించే సమయాల్లో అపాయింట్‌మెంట్ తీసుకోవడం మంచిది.
  • పిల్లల అవసరాలను ముందుగా తెలియజేయండి: పిల్లలకు ఇబ్బంది కలిగించే అంశాలు, భయాలు లేదా వారిని ప్రశాంతంగా ఉంచే పద్ధతుల గురించి దంత వైద్య  బృందానికి ముందుగానే వివరించండి.

సంరక్షకుల  కోసం ఇంటి వద్ద దంత సంరక్షణ సూచనలు

ప్రతిరోజూ పాటించే చిన్న అలవాట్లు పిల్లల దంత ఆరోగ్యంపై పెద్ద ప్రభావం చూపుతాయి. తల్లిదండ్రులకు ఉపయోగపడే కొన్ని సూచనలు ఇవి:

  • మృదువైన బ్రష్ మరియు ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ ను తక్కువ పరిమాణంలో ఉపయోగించండి.
  •  రోజుకు రెండు సార్లు బ్రష్ చేసుకునేలా అలవాటు చేయండి. అవసరమైతే తల్లిదండ్రులు చూపిస్తూ మరియు సహాయం చేస్తూ  పళ్లు తోమించండి.
  • బ్రష్ చేయడాన్ని సరదాగా మార్చండి. పాటలు, లెక్కలు చెప్పే ఆటలు లేదా రివార్డ్ చార్ట్స్ ఉపయోగించవచ్చు.
  • భోజనం తర్వాత వెంటనే బ్రష్ చేయడం కష్టంగా ఉంటే, కనీసం నీటితో నోరు పుక్కిలించడం ప్రోత్సహించండి.
  • తీపి పదార్థాలు మరియు చక్కెర పానీయాలు తక్కువగా ఉండే సమతుల ఆహారం ఇవ్వండి.

క్రమం తప్పకుండా నోటి పరిశుభ్రతను కొనసాగించడం చాలా ముఖ్యం. మొదట్లో పళ్లు తోమించడం

 కష్టంగా అనిపించినా, చిన్న చిన్న అలవాట్లు క్రమంగా పిల్లలకు సౌకర్యంగా మారతాయి.

కుటుంబాలకు సహాయం, తోడ్పాటు

మొదట్లో దంత సంరక్షణ కొంత కష్టంగా లేదా ఆందోళనగా అనిపించవచ్చు. కానీ మీరు ఒంటరిగా లేరు. పిల్లల దంత వైద్యులు మరియు సహాయక వర్గాల మార్గదర్శకత్వంతో, IDD ఉన్న పిల్లలు కూడా మంచి నోటి ఆరోగ్యం మరియు అందమైన చిరునవ్వును పొందగలరు.

ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల్లో దంత సంరక్షణ మరియు సాధారణ దంత సమస్యలు గురించి మరింత సమాచారం కూడా తెలుసుకోవచ్చు.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ ను 844-844-8996 లో సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

దయచేసి గమనించండి: ఈ మార్గదర్శిని కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే రూపొందించబడింది. ఇది ముఖ్యంగా మేధో మరియు అభివృద్ధి సంబంధిత సమస్యలు ఉన్న పిల్లలను దృష్టిలో ఉంచుకుని తయారు చేయబడింది. ఈ సమాచారం పిల్లల దంత వైద్యుల సహకారంతో సిద్ధం చేయబడినప్పటికీ, మీ పిల్లల సురక్షితమైన దంత సంరక్షణ కోసం అర్హత కలిగిన వైద్య నిపుణులను తప్పనిసరిగా సంప్రదించాలి.

Write Blog

Share your experiences with others like you!

English