Skip to main content
Install App
If you're using:

ఆటిజం మరియు పిల్లల అభివృద్ధిపై ఆందోళనలు

Default Avatar

Dr Ajay Sharma

Also available in: English

Key Takeaways:

  1. MMR టీకా అనేది ఆటిజంకు కారణం కాదు.
  2. 12–18 నెలల వయసులో ఆటిజాన్ని నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. 
  3. న్యూరోప్లాస్టిసిటీ అనేది పిల్లలు పొందే అనుభవాలను బట్టి మెదడు తనను తాను మార్చుకునే సామర్థ్యం. 
  4. పిల్లలు నేర్చుకోవడానికి, పనుల్లో పాల్గొనడానికి వారిలో ఆసక్తిని పెంచే మార్గాలు. 
  5. ప్రవర్తన నిర్వహణకు సూచనలు

ఆటిజం అనేది ఒక నాడీ అభివృద్ధి సంబంధిత పరిస్థితి. ఇది ఒక వ్యక్తి ఇతరులతో ఎలా మాట్లాడతారు, ఎలా కలిసిమెలిసి ఉంటారు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటారు అనే విషయాలను ప్రభావితం చేయవచ్చు. ఆటిజం ఉన్న పిల్లల్లో మాట్లాడటం, ఇతరులతో కలవడం, ప్రవర్తన వంటి విషయాల్లో కొన్ని తేడాలు ఉండవచ్చు. ఆటిజం కు ఖచ్చితమైన కారణం తెలియనప్పటికీ, జన్యుపరమైన మరియు పర్యావరణ  కారణాలు కలిసి ఆటిజం రావడానికి కారణమవుతాయని భావిస్తున్నారు. ఆటిజానికి ప్రస్తుతం పూర్తిగా నయం చేసే చికిత్స లేదు. అయితే థెరపీలు,తగిన సహాయం అందించడం ద్వారా ఆటిజం ఉన్న వ్యక్తులు సంతృప్తికరమైన జీవితాన్ని గడపడానికి సహాయం చేయవచ్చు.

ఆటిజం మరియు పిల్లల అభివృద్ధి గురించి సాధారణ ఆందోళనలు

తల్లిదండ్రులు తమ ఆందోళనలను గురించి అడిగిన ప్రశ్నలు అలాగే డాక్టర్ అజయ్ శర్మ గారు ఇచ్చిన సమాధానాలు కింద పేర్కొనడం జరిగింది. తల్లిదండ్రులకు ఇంకా ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి కామెంట్స్ విభాగంలో పోస్ట్ చేయాలని మేము కోరుతున్నాము. మా వద్ద ఉన్న నిపుణుల ద్వారా మీ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు మేము మా వంతు ప్రయత్నం చేస్తాము.

మేము ఆటిజం గురించిన ఆటిజం గురించి ఉన్నసాధారణ అపోహలు మరియు అపనమ్మకాలు  కూడా అందుబాటులో ఉంచాము. ఈ అపోహలను తెలుసుకొని, వాటిని తొలగించడంలో సహకరించండి మరియు ఈ విషయాన్ని ఇతరులకు తెలియజేయండి.

 ఆటిజం గురించి సాధారణ అపోహలు – వాస్తవాలను తెలుసుకుందాం.

  1. MMR టీకా వల్ల ఆటిజం వస్తుందా?
  2. పిల్లకు ఏ వయసులో ఆటిజం ఉందని నిర్ధారించవచ్చు?
  3. జన్యు లోపాల కారణంగా మా పిల్లలకు ఆటిజం ఉంటే, తల్లిదండ్రులుగా మేము ఆ ప్రభావాలను మార్చలేము.  అలాంటి సందర్భాల్లో పిల్లలకు సహాయం చేయడానికి మేము ఏమి చేయవచ్చు?
  4. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏమిటి?
  5. మా పిల్లలు  చిన్న వయసులో కొన్ని పదాలు మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఆ పదాలు వాడటం మానేసి మాట్లాడని స్థితిలో ఉన్నాడు. థెరపీ ప్రారంభించాక ఇప్పుడు మళ్లీ కొద్దిగా పలకడం మొదలుపెట్టాడు. ఆటిజం ఉన్న పిల్లల్లో ఇలా నేర్చుకున్న నైపుణ్యాలు తిరిగి తగ్గిపోవడం  (రిగ్రెషన్) జరుగుతుందా?
  6. ఆటిజం ఉన్న కొంతమంది పిల్లల్లో రిగ్రెషన్ ఎందుకు జరుగుతుంది? 
  7. నియంత్రిత లేదా ప్రత్యేక ఆహార విధానాలు ఆటిజం ఉన్న పిల్లల్లోని ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడతాయా?
  8. యోగా, వ్యాయామం లేదా శారీరక కార్యకలాపాలు వంటి కదలికలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల ఆటిజంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయా? 
  9. నా పిల్లవాడిని ప్రోత్సహించడం తాను నేర్చుకోవడంలో కీలకం అయితే, దాన్ని ఎలా చేయాలి? 
  10. ఆటిజం అని నిర్ధారణ అయిన నా పిల్లవాడు దాన్ని అధిగమించాడు. చదువులో ఇబ్బందులు ఎదురయ్యాయి , కానీ ఫుట్‌బాల్‌లో రాణించాడు. అందువల్ల మేము అతన్ని చదువులోకి ఒత్తిడి చేయకుండా, ఫుట్‌బాల్ శిక్షణపై దృష్టి పెట్టాము. ఇప్పుడు టీనేజ్‌లో ఉన్న మా అబ్బాయి ఫుట్‌బాల్‌లో ఎంపిక కావడం లేదు. దీనికి కారణం ఏమిటి? 
  11. డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు కూడా ఆటిజం వచ్చే అవకాశముందా?
  12. మా పిల్లలు ఎక్కువ శబ్దాలు లేదా ఇతర ఇంద్రియ అనుభూతుల (సెన్సరీ ఓవర్లోడ్ ) వల్ల ఇబ్బంది పడకుండా ఉండేందుకు నేను ఎలా సహాయం చేయగలను?  
  13. మా పిల్లలకు ప్రెషర్ కుక్కర్ విజిల్ వంటి కొన్ని శబ్దాలు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. కానీ పెద్దగా వినిపించే డ్రమ్ శబ్దం మాత్రం ఇబ్బందిగా అనిపించదు. ఇలా ఎందుకు జరుగుతుంది? 
  14. నా పిల్లలకు వ్యంగ్యం లేదా జోకులు అర్థం కావడం లేదు. వాటిని ఎలా అర్థం చేసుకునేలా చేయాలి?
  15. పిల్లలు మరియు యుక్తవయసులో ఉన్నవారి ప్రవర్తనను నిర్వహించడానికి కొన్ని సూచనలు చెప్పగలరా?
  16. మా పిల్లలు రోజంతా ప్రశాంతంగా, చక్కగా ఉంటారు . కానీ కుటుంబ సభ్యులు, ఉదాహరణకు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు, ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు కనిపిస్తుంది. తల బాదుకోవడం వంటి ప్రవర్తనలు పెరుగుతాయి. ఇది ఎందుకు జరుగుతుంది?

1.      MMR టీకా వల్ల ఆటిజం వస్తుందా?

ఆటిజానికి, MMR టీకాలకు సంబంధం ఉందని చెప్పిన శాస్త్రీయ అధ్యయనాలను తిరిగి పరిశీలించగా, దానికి ఆధారాలు లేవని తేలింది. ఆటిజం ఉన్న పిల్లలకు సంక్లిష్టతలు అప్పటికే ఉండి ఉండవచ్చు. అవి టీకా తర్వాత బయటపడినట్లుగా కనిపించవచ్చు. మనిషి మెదడు సంబంధం లేని విషయాల మధ్య కూడా సంబంధం ఉందని భావించే స్వభావం కలిగి ఉంటుంది ఇది తల్లిదండ్రుల్లో గందరగోళం మరియు ఆందోళనకు దారితీస్తుంది. ఇప్పుడు ఈ విషయంపై స్పష్టత లభించింది. MMR టీకా మరియు ఆటిజం అభివృద్ధి మధ్య ఎలాంటి సంబంధం లేదు అని చెప్పవచ్చు.

2.      పిల్లకు ఏ వయసులో ఆటిజం ఉందని నిర్ధారించవచ్చు?

పిల్లల్లో ఆటిజం నిర్ధారణ సాధారణంగా ఈ కింద ఇచ్చిన వయస్సులలో జరుగుతుంది:

  1. 12–18 నెలలు: ఈ వయస్సులో ఆటిజాన్ని నిర్ధారించే అవకాశం ఉంటుంది .

ముఖ్యమైన  సంకేతం: పిల్లలు ఇతర వ్యక్తులపై ఆసక్తి చూపించకపోవచ్చు. ఉదాహరణకు, కళ్లలోకి నేరుగా చూడకపోవడం, పేరు పిలిచినప్పుడు స్పందించకపోవడం వంటివి కనిపించవచ్చు. (సుమారు 9 నెలల వయసులో సామాజిక సంభాషణా నైపుణ్యాలను గుర్తించడం అంతగా సరైనది కాదు అని చెప్పవచ్చు.)

  1. 3–4 సంవత్సరాలు: పిల్లలు ఊహాజనిత ఆటలు ఆడటంలో ఆసక్తి చూపించకపోవచ్చు. అలాగే, వారి కమ్యూనికేషన్ విధానం అదే వయసు పిల్లలతో పోలిస్తే స్పష్టంగా భిన్నంగా కనిపించవచ్చు. .
  1. 6 సంవత్సరాలు: కొంతమంది పిల్లల్లో నిర్ధారణ కొంత ఆలస్యంగా జరుగుతుంది. ముఖ్యంగా సామాజిక ప్రవర్తనలోని తేడాలు స్పష్టంగా కనిపించే వయస్సులో ఉదాహరణకు ఇతర పిల్లలతో కలిసి ఆడేటప్పుడు ఆ తేడాలు కనిపించవచ్చు.

3. జన్యు లోపాల కారణంగా మా పిల్లలకు ఆటిజం ఉంటే, తల్లిదండ్రులుగా మేము ఆ ప్రభావాలను మార్చలేము. అలాంటి సందర్భాల్లో పిల్లలకు సహాయం చేయడానికి మేము ఏమి చేయవచ్చు?

తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా గమనించడం ద్వారా, పిల్లల అవసరాలను గమనించి అర్థం చేసుకోవడం ద్వారా సహాయం చేయవచ్చు. మీకు ఆందోళన కలిగించే అంశాలను గుర్తించిన తర్వాత, ఆ పరిస్థితిని మెరుగుపరచడానికి ఏం చేయవచ్చో తెలుసుకునేందుకు ప్రయత్నించండి.

గుర్తుంచుకోండి: ఆటిజంలో జన్యుపరమైన అంశాలు  పాత్ర పోషించినా, ప్రేమతో కూడిన మరియు సహాయకమైన వాతావరణం పిల్లలు ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటారు , తమ భావాలను ఎలా వ్యక్తపరుస్తారు అనే విషయంలో మంచి మార్పు తీసుకురావచ్చు. జన్యుపరమైన కారణాల వల్ల పిల్లలు కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం కొంత తగ్గినా, మెదడుకు నేర్చుకునే మరియు తనను తాను మార్చుకునే సహజ సామర్థ్యం ఉంటుంది.  (దీనిని న్యూరోప్లాస్టిసిటీ అంటారు)  ఈ సామర్థ్యాన్ని ఉపయోగించుకుని, పిల్లలకు కొత్త విషయాలను నేర్చుకునే అవకాశాలను కల్పించవచ్చు. న్యూరోప్లాస్టిసిటీ గురించి మరిన్ని వివరాలు తరువాతి ప్రశ్న-సమాధానంలో పొందుపరచబడ్డాయి.

4. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏమిటి?

న్యూరోప్లాస్టిసిటీ అంటే మనం పొందే అనుభవాలను బట్టి మెదడు తనను తాను మార్చుకునే సామర్థ్యం. అందువల్ల, ఒక వ్యక్తి ఏ వయసులో ఉన్నా, అతను పొందే అనుభవాల ఆధారంగా నేర్చుకోవడం, ప్రవర్తనలో మార్పులు రావచ్చు. జీవితంలోని ప్రారంభ సంవత్సరాల్లో న్యూరోప్లాస్టిసిటీ ఎక్కువగా  పనిచేస్తుంది (ఉదాహరణకు: చిన్నపిల్లలు పెద్దవారితో పోలిస్తే కొత్త భాషను చాలా వేగంగా నేర్చుకోవడం). అయితే వ్యక్తి వయసు పెరుగుతుండగా, మెదడు నేర్చుకునే సామర్థ్యం తగ్గినా పూర్తిగా ఆగిపోదు. ఈ ప్రక్రియను మరింత సులభంగా అర్థం చేసుకునేందుకు కొన్ని ఉదాహరణలు:

  1. జీవితంలోని మొదటి 2 సంవత్సరాల్లో మెదడు శబ్దాలను నేర్చుకోగలదు. ఆ తర్వాత, మెదడు కొత్త శబ్దాలను నేర్చుకోలేదు. ఆ అవకాశం తగ్గిపోతుంది. కానీ మెదడు ఇంకా అక్షరాలు, పదాలు లేదా కొత్త భాషను నేర్చుకోగలదు.
  2. మెదడు సుమారు 8 సంవత్సరాల వయసు వరకు ఒక భాషలోని ఉచ్చారణను (మాట్లాడే విధానాన్ని) సులభంగా నేర్చుకోగలదు. ఆ తర్వాత వ్యక్తి ఉచ్చారణపై ప్రభావం పడుతుంది, మాట్లాడే విధానంపై కూడా ఇది ప్రభావం చూపవచ్చు. 
  3. పుట్టిన దగ్గరి నుండి 4 సంవత్సరాల మధ్యకాలం చూపు అభివృద్ధి మరియు దాని ద్వారా నేర్చుకోవడంలో  ముఖ్యమైన దశ. మెల్లకన్ను ఉన్నవారిలో, మెదడు ప్రభావిత కంటిని ఒక వస్తువుపై కేంద్రీకరించనివ్వదు. అందువల్ల ఆ కంటితో వచ్చే చిత్రాలను పక్కన పెట్టవచ్చు. ప్రభావిత కంటి సామర్థ్యాన్ని తిరిగి తీసుకురావడానికి, వైద్యులు రెండవ కంటిపై ప్యాచ్ వేసి (మొదట కొన్ని గంటలపాటు) మూసివుంచేలా చేస్తారు. ఇప్పుడు, మెదడు ప్రభావిత కంటిని మాత్రమే ఉపయోగిస్తుంది మరియు దానిని తిరిగి పని చేయిస్తుంది.
  4. ఫిజియోథెరపిస్టులు కూడా న్యూరోప్లాస్టిసిటీ అనే ఇదే సామర్థ్యాన్ని ఉపయోగించి, సరిగ్గా పనిచేయని అవయవాన్ని ఉపయోగించేలా వ్యక్తికి శిక్షణ ఇస్తారు. అంటే, మెదడు ఎప్పుడూ కొత్త విషయాలను నేర్చుకునే స్థితిలోనే ఉంటుంది. ఒక విషయం నేర్చుకునే అవకాశం తగ్గిపోయిన తర్వాత కూడా న్యూరోప్లాస్టిసిటీ పనిచేస్తూనే ఉంటుంది. పిల్లల్లో న్యూరోప్లాస్టిసిటీని ఉపయోగించి కొత్త విషయాలను నేర్చుకునేలా చేయడానికి ఈ అంశాలను గుర్తుంచుకోవాలి: 
  • పిల్లలకు క్రమబద్ధమైన  బోధనా ప్రణాళిక ఇవ్వండి
  • నేర్చుకునే ప్రక్రియలో పిల్లలు స్వయంగా ప్రయత్నించేలా  ప్రోత్సహించండి
  • పిల్లలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపేలా ప్రోత్సహించండి. 
  • నమ్మకంతో ముందుకు సాగండి. మీరు చేస్తున్న ప్రయత్నాలు మంచి మార్పు తీసుకురాగలవనే విశ్వాసం ఉంచండి.

5. మా పిల్లలు  చిన్న వయసులో కొన్ని పదాలు మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ఆ పదాలు వాడటం మానేసి మాట్లాడని స్థితిలో ఉన్నాడు. థెరపీ ప్రారంభించాక ఇప్పుడు మళ్లీ కొద్దిగా పలకడం మొదలుపెట్టాడు. ఆటిజం ఉన్న పిల్లల్లో ఇలా నేర్చుకున్న నైపుణ్యాలు తిరిగి తగ్గిపోవడం  (రిగ్రెషన్) జరుగుతుందా?

అవును, జరుగుతుంది. ఆటిజం ఉన్న పిల్లల్లో సుమారు మూడింట ఒక వంతు  పిల్లల్లో ఇలా జరుగుతుంది. ఇది సాధారణంగా 18 నుండి 24 నెలల వయస్సు మధ్య జరుగుతుంది. పిల్ల పెరుగుతున్న కొద్దీ, వయసుకు అనుగుణంగా అభివృద్ధిలో తదుపరి దశలకు క్రమంగా ముందుకు వెళ్తారు.

6. ఆటిజం ఉన్న కొంతమంది పిల్లల్లో రిగ్రెషన్ ఎందుకు జరుగుతుంది? 

మనకు పూర్తిగా అర్థం కాని కొన్ని కారణాల వల్ల, కొన్ని సందర్భాల్లో పిల్లల శరీరం అభివృద్ధిలో తదుపరి దశలకు అవసరమైన కొన్ని జన్యువులను సరిగ్గా పనిచేసేలా చేయలేకపోవచ్చు. రిగ్రెషన్‌ను సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణగా తీసుకుందాం. ఒక చిన్నారి మెదడు సరిగ్గా పనిచేయడానికి 3 నెలల వయసులో 3 జన్యువులు పనిచేయాల్సి ఉంటాయని, 5 నెలల వయసులో 5 జన్యువులు పనిచేయాల్సి ఉంటాయని అనుకుందాం. ఏదో ఒక కారణం వల్ల, 5 నెలల వయసులో మెదడు పనితీరుకు అవసరమైన 5 జన్యువుల్లో 2 జన్యువులు పనిచేయకపోతే, మెదడు తన అభివృద్ధి స్థాయిని మళ్లీ తక్కువ స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు. అంటే 5 నెలల స్థాయి నుంచి 3 నెలల స్థాయికి తిరిగి వెళ్లినట్లుగా భావించవచ్చు. ఆ స్థాయిలో 3 జన్యువులు పనిచేస్తే సరిపోతుంది కాబట్టి, అది పిల్లల మెదడు అభివృద్ధికి సహాయపడుతుంది. ఇలా, జన్యువుల పనితీరు తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ మెదడు దానికి అనుగుణంగా పనిచేయడం ద్వారా ఒక స్థిరమైన స్థితిని కొనసాగించడానికి ప్రయత్నిస్తుంది. అందుకే పిల్లలు తమకు సాధ్యమైన స్థాయికి తిరిగి వెళ్లినట్లు కనిపించవచ్చు. ఇలాంటి మార్పు రిగ్రెషన్ రూపంలో కనిపిస్తుంది. ఇది ప్రధానంగా జన్యుపరమైన ప్రభావాల వల్ల జరుగుతుందని భావిస్తారు.

7. నియంత్రిత లేదా ప్రత్యేక ఆహార విధానాలు ఆటిజం ఉన్న పిల్లల్లోని ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడతాయా?

మీరు ప్రత్యేకమైన ఆహార నియమాన్ని అనుసరించాలనుకుంటారా లేదా అనేది మీ నిర్ణయం. కానీ ఒక కీలకమైన నియమం గుర్తుంచుకోండి: మీ పిల్లవాడికి హాని కలిగించే ఏదీ చేయకండి.

కొంతమంది పిల్లలకు గ్లూటెన్/పాలు/లాక్టోస్ పట్ల అలెర్జీ లేదా సున్నితత్వం కలిగి ఉండవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల విరేచనాలు లేదా ఇబ్బందులు రావచ్చు.  అలాంటి పరిస్థితుల్లో ఆహారాన్ని నియంత్రించడం పిల్లవాడికి ఉపశమనం కలిగించవచ్చు.

కొందరికి చాక్లెట్లు, ఆహారంలో కలిపే పదార్థాలు (అడిటివ్స్)/ఫుడ్ కలర్స్ లేదా చక్కెరలు అధిక చురుకుదనాన్ని కలిగించవచ్చు.ఇలాంటి సందర్భాల్లో ఫుడ్ డైరీ నిర్వహించి, పిల్లలు ఏ ఆహారం తీసుకున్న తర్వాత ఎలా స్పందిస్తున్నారో రాసుకోవడం వల్ల వారికి ఏ ఆహారం వల్ల ఇబ్బంది కలుగుతోందో అర్థం చేసుకోవచ్చు.  ఈ సమాచారాన్ని ఉపయోగించి, పిల్లవాడిలో అసహనం లేదా అధిక చురుకుదనాన్ని కలిగించే ఆహారాలను గుర్తించండి. ఒకసారి గుర్తించిన తర్వాత, ఆ ప్రత్యేక ఆహారాలను ఇవ్వకపోవడం ప్రయోజనకరంగా ఉండవచ్చు.

ఒక నిర్దిష్ట ఆహారం కొందరి పిల్లల్లో అధిక చురుకుదనం కనిపిస్తే , ఆ ఆహారాన్ని ఇవ్వకపోవడం వల్లపిల్లల అధిక చురుకుదనం పూర్తిగా తగ్గిపోతుందని అనుకోవద్దు. అందువల్ల, GFCF వంటి ప్రత్యేక ఆహార నియమాలను అర్థం లేకుండా పాటించడం పిల్లవాడి పరిస్థితికి పెద్దగా ఉపయోగకరం కాదు. మీరు ప్రత్యేకమైన ఆహార నియమం పాటించాలనే వ్యక్తిగత నిర్ణయం తీసుకుంటే, తప్పనిసరిగా ఒక డైటీషియన్‌ను సంప్రదించండి. పిల్లవాడి ప్రత్యేక ఆహారం సరైన సమతుల్యతతో ఉండి, ఎముకల పెరుగుదలకు సహాయపడేలా, అలాగే పోషకాహార లోపాలు లేదా విటమిన్ లోపాలు రాకుండా చూసుకోవాలి.

ఆహారం మార్చినప్పటికీ ఇతర థెరపీలు తగ్గించడం లేదా వాటి ప్రాముఖ్యత తగ్గిపోవడం కాదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రత్యేక ఆహారాన్ని పాటిస్తున్నప్పటికీ, ఇతర థెరపీలను కొనసాగించాలి. సాధారణ నియమంగా, 2 సంవత్సరాల వయసు వరకు పిల్లలకు రోజుకు 10 చుక్కల మల్టీ విటమిన్ సిరప్ ఇవ్వాలి. 2 సంవత్సరాల పైబడిన పిల్లలకు అవసరాన్ని బట్టి ఇవ్వవచ్చు. మార్కెట్‌లో చౌకగా లభించే ఔషధాలలో ఒకటైన మల్టీవిటమిన్ డ్రాప్స్‌ను చాలా మంది తల్లిదండ్రులు ఇంకా ఉపయోగించకపోవడం గమనించదగ్గ విషయం.

8. యోగా, వ్యాయామం లేదా శారీరక కార్యకలాపాలు వంటి కదలికలకు సంబంధించిన వ్యాయామాలు చేయడం వల్ల ఆటిజంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గుతాయా? 

శారీరక కార్యకలాపాలు స్వీయ నియంత్రణ, శరీర కదలికలను సమన్వయం చేసుకోవడం, మొత్తం ఆరోగ్యం మరియు శ్రేయస్సు మెరుగుపడేందుకు సహాయపడతాయి. మెదడు చురుకుగా మారి కొత్త విషయాలను నేర్చుకోవడానికి మరింత ఆసక్తి చూపుతుంది. దీనివల్ల మనం చేసే కార్యకలాపాలపై మరింత చురుకుగా స్పందించగలుగుతాం. . అదే సమయంలో, మెదడుకు అవసరమైన ఇంద్రియ అనుభూతులు కూడా అందుతాయి. దీంతో మెదడు మరింత చురుకుగా పనిచేసి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుంది.

9. నా పిల్లవాడిని ప్రోత్సహించడం తాను నేర్చుకోవడంలో కీలకం అయితే, దాన్ని ఎలా చేయాలి? 

ఇక్కడ పిల్లల్లో నేర్చుకోవాలనే ఆసక్తిని, పాల్గొనాలనే ఉత్సాహాన్ని పెంచడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి:

  • పిల్లలకు బాధ్యత అప్పగించండి: ఉదా. క్లాస్‌లో లీడర్‌గా నియమించడం.
  • వారికి సాధించే అవకాశాలు ఇవ్వండి. కేవలం ప్రయత్నం చేయడం సరిపోతుంది, అందులో అద్భుతంగా రాణించాల్సిన అవసరం లేదు.
  • పని పూర్తి చేసినప్పుడు వారిని ప్రోత్సహించండి .
  • పెద్ద పిల్లలకు లక్ష్యాలను ఏర్పరచుకోవడంలో  సహాయం చేయండి మరియు వారిని ఉత్సాహపరిచే విధంగా వారి సృజనాత్మకతను ఉపయోగించుకునే అవకాశాలను కల్పించండి. 
  • వారు ఒక నిర్దిష్ట పనిని చేయడానికి ఇష్టపడకపోతే, వారు కోరుకునే పనిలో వారిని పాల్గొననివ్వండి. ఆ తర్వాత, క్రమంగా ఆసక్తి లేని పనిని చేయడానికి వారి ఆసక్తిని పెంచండి.

10. ఆటిజం అని నిర్ధారణ అయిన నా పిల్లవాడు దాన్ని అధిగమించాడు. చదువులో ఇబ్బందులు ఎదురయ్యాయి , కానీ ఫుట్‌బాల్‌లో రాణించాడు. అందువల్ల మేము అతన్ని చదువులోకి ఒత్తిడి చేయకుండా, ఫుట్‌బాల్ శిక్షణపై దృష్టి పెట్టాము. ఇప్పుడు టీనేజ్‌లో ఉన్న మా అబ్బాయి ఫుట్‌బాల్‌లో ఎంపిక కావడం లేదు. దీనికి కారణం ఏమిటి?

ఇది పూర్తిగా సాధ్యమే. ఇప్పుడు యుక్తవయసులో ఉన్న మీ బిడ్డ టీనేజ్ సమస్యలతో ఇబ్బంది పడుతూ  ఉండవచ్చు. అతన్ని ఫుట్‌బాల్ ఆడమని ఒత్తిడి చేయకుండా, అతనికి ఆసక్తి ఉన్న ఇతర విషయాల్లో పాల్గొనాలని సున్నితంగా ప్రోత్సహించండి. క్రమంగా, అతను తిరస్కరణపట్ల ఉన్న భయాన్ని అధిగమించి, పాతవైనా కొత్తవైనా తన ఆసక్తులను కొనసాగించగలడు. తల్లిదండ్రులుగా గతంలో సాధించిన విషయాలపై ఆశలు పెట్టుకోకుండా మన పిల్లలను వారు ఉన్న విధంగానే అంగీకరించడం, వారిని మెరుగ్గా అర్థం చేసుకోవడానికి మరియు సహాయం చేయడానికి ఉపకరిస్తుంది. సమయం, ప్రోత్సాహం కలిస్తే అతను తిరిగి ఆత్మవిశ్వాసం పొందుతూ తనకు సరైన దారిని కనుగొనగలడు.

11. డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు కూడా ఆటిజం వచ్చే అవకాశముందా?

అవును, పూర్తిగా సాధ్యమే. ఈ రెండు పరిస్థితులు ఒకరిలోనే కనిపించవచ్చు.

12. మా పిల్లలు ఎక్కువ శబ్దాలు లేదా ఇతర ఇంద్రియ అనుభూతుల (సెన్సరీ ఓవర్లోడ్ ) వల్ల ఇబ్బంది పడకుండా ఉండేందుకు నేను ఎలా సహాయం చేయగలను?  

మొదటగా, పిల్లలకు అవసరమైన ఇంద్రియ అనుభూతులు (సెన్సరీ ఇన్‌పుట్‌) అందించండి. ఆ తర్వాత, చర్య (యాక్టివిటీ) ముగిసిన తర్వాత పిల్లలు ఒత్తిడిని తగ్గించుకునేందుకు సుమారు ఒక  గంట పాటు విశ్రాంతి తీసుకునే ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయండి. ఈ విశ్రాంతి సమయం వల్ల పిల్లలు ఆ  పరిస్థితిని మరింత సులభంగా  ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.

13. మా పిల్లలకు ప్రెషర్ కుక్కర్ విజిల్ వంటి కొన్ని శబ్దాలు చాలా ఇబ్బందిగా అనిపిస్తాయి. కానీ పెద్దగా వినిపించే డ్రమ్ శబ్దం మాత్రం ఇబ్బందిగా అనిపించదు. ఇలా ఎందుకు జరుగుతుంది? 

పిల్లలు కొన్ని ప్రత్యేకమైన రకాల శబ్దాలకు ఎక్కువ సున్నితంగా ఉండవచ్చు. అయితే, వారు తప్పనిసరిగా శబ్దం యొక్క తీవ్రత లేదా గట్టిగా ఉండటానికి సున్నితంగా ఉండాల్సిన అవసరం లేదు.

14. నా పిల్లలకు వ్యంగ్యం లేదా జోకులు అర్థం కావడం లేదు. వాటిని ఎలా అర్థం చేసుకునేలా చేయాలి? 

జోక్ లేదా వ్యంగ్యం అంటే ఏమిటో పిల్లలకు అర్థమయ్యేలా చేయడానికి సోషల్ స్టోరీస్ ఉపయోగించి వివరించడం ఒక మంచి మార్గం.

15. పిల్లలు మరియు యుక్తవయసులో ఉన్నవారి ప్రవర్తనను నిర్వహించడానికి కొన్ని సూచనలు చెప్పగలరా?

పిల్లల ప్రవర్తనను సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి: 

  • శిక్షపై కాకుండా ప్రోత్సాహంపై  దృష్టి పెట్టండి.
  • క్రమశిక్షణకు అతిగా ప్రాధాన్యత ఇవ్వకండి. అవసరమైనప్పుడు, సరైన విధంగా ఉపయోగించండి. 
  • పిల్లలపై ప్రేమ, ఆప్యాయతను ఎక్కువగా చూపించండి. 
  • కోపం చూపించడం కంటే, ప్రశాంతంగా కానీ దృఢంగా ఉండటం ముఖ్యం. 
  • ఒక నిర్దిష్టమైన రోజువారీ పద్ధతి లేదా క్రమాన్ని పాటించండి. 
  • పిల్లలు ప్రస్తుతం ఉన్న దశను, వారి పరిస్థితిని అర్థం చేసుకుని అంగీకరించడం వారిని ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. .
  • పిల్లలను కొట్టడం భయాన్ని పెంచుతుంది, కానీ ఆ భయం ఎక్కువ కాలం పనిచేయదు. అంతేకాదు, అది కోపాన్ని పెంచి, అతను కూడా ఇతరులను కొట్టడం నేర్చుకోవడానికి కారణం కావచ్చు. 
  • పిల్లవాడికి సూచనలు ఇస్తున్నప్పుడు స్పష్టంగా చెప్పండి.  ఉదాహరణలు: “నువ్వు ఇతరులను కొడితే నాకు కోపం వస్తుంది.”, “నేను లేకుండా రోడ్డు దాటితే నాకు కోపం వస్తుంది.”, “పిల్లల మీద అరుస్తే నాకు కోపం వస్తుంది.” , “సోఫా మీద దూకితే నాకు కోపం రాదు.”.
  • స్పష్టమైన సూచనలు ఇచ్చిన తర్వాత కూడా పిల్లల ప్రవర్తనను గమనించండి. వారు ఇష్టం లేని ప్రవర్తనను కొనసాగిస్తే, టీవీ చూడటం లేదా ఆటలు ఆడటం వంటి కొన్ని ఆట సమయపు అవకాశాలను తాత్కాలికంగా కోల్పోతారని వారికి స్పష్టంగా చెప్పండి. 
  • చివరిగా, కానీ చాలా ముఖ్యంగా తల్లిదండ్రులుగా మీరు జరిగిన విషయాన్ని అక్కడితో వదిలేయడం కూడా ముఖ్యం . దాన్ని పదేపదే గుర్తుచేసుకుంటూ ఉండకండి లేదా తర్వాత పిల్లలతో మాట్లాడేటప్పుడు మళ్లీ ప్రస్తావించకండి. అప్పటికే పిల్లలు జరిగిన విషయాన్ని మర్చిపోయి ఉండవచ్చు. అదే విషయాన్ని మళ్లీ మళ్లీ గుర్తుచేయడం వారి ప్రవర్తనను మెరుగుపరచడంలో సహాయపడదు.

16. మా పిల్లలు రోజంతా ప్రశాంతంగా, చక్కగా ఉంటారు . కానీ కుటుంబ సభ్యులు , ఉదాహరణకు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు, ప్రవర్తనలో అకస్మాత్తుగా మార్పు కనిపిస్తుంది. తల బాదుకోవడం వంటి ప్రవర్తనలు పెరుగుతాయి. ఇది ఎందుకు జరుగుతుంది?

దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. మీ పిల్లల  ప్రవర్తనా నమూనాలను మరింతగా అర్థం చేసుకోవడానికి మరియు అవి ఎలా గమనించాలో తెలుసుకోవడానికి ABC చార్ట్ – పిల్లల ప్రవర్తనను గమనించి నిర్వహించడానికి ఉపయోగపడే సాధనం. ఈ సమాచార వనరును చూడవచ్చు.

అయితే, మీ పిల్లల  ప్రవర్తనకు ఒక సాధ్యమైన కారణం తన కుటుంబ సభ్యుడి నుండి సాన్నిహిత్యం లేదా శ్రద్ధ కోరుకోవడం కావచ్చు. కొన్నిసార్లు పిల్లలు ఒక నిర్దిష్ట వ్యక్తి (ఉదా: రోజంతా బయట ఉండే తల్లి/తండ్రి) తమ ప్రవర్తనకు భిన్నంగా లేదా కొంత సౌమ్యంగా స్పందిస్తారని పిల్లలు గమనించవచ్చు.. అందువల్ల, వారు ఒక నిర్దిష్ట ప్రతిస్పందనను ఆశిస్తూ ఆ ప్రవర్తనలో పాల్గొంటారు.

ఇలాంటి సందర్భాల్లో ఇద్దరు తల్లిదండ్రులు లేదా ఇతర కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా మాట్లాడుకుని, ఆ ప్రవర్తన జరిగే సమయంలో ఎలా స్పందించాలో ఒకే విధమైన నిర్ణయం తీసుకోవడం మంచిది. అందరూ ఒకే విధంగా, ఒకే రీతిలో స్పందిస్తే, పిల్లవాడికి భద్రతా భావం పెరుగుతుంది మరియు అయోమయం లేదా అసమంజసమైన ప్రవర్తన తగ్గుతుంది.

అయినప్పటికీ, అలాంటి ప్రవర్తన మార్పుల వెనుక మరెన్నో కారణాలు ఉండవచ్చు. సెన్సరీ ఓవర్లోడ్, తీరని అవసరాలు, కమ్యూనికేషన్ ఇబ్బందులు మొదలైనవి. సందర్భాన్ని మరియు నమూనాలను గమనించడం, అవసరమైతే నిపుణుల సూచన పొందడం, మీ పిల్లలని మెరుగ్గా అర్థం చేసుకోవడంలో మరియు మద్దతు ఇవ్వడంలో సహాయపడుతుంది.

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD లేదా ఇతర మేధో సంబంధిత సవాళ్ల గురించి సందేహాలున్నా లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి ఆందోళనలు ఉన్నా నయీ దిశా టీమ్ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996 ను సంప్రదించండి. మీరు కాల్ లేదా వాట్సాప్ ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు, బెంగాలీ భాషల్లో మాట్లాడగలరు.

గమనిక: దయచేసి గమనించండి, ఈ విషయ వివరణ సమాచారం ఇవ్వడానికి మాత్రమే. సరైన మార్గదర్శకత కోసం అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

Write Blog

Share your experiences with others like you!

English