Skip to main content
Install App
If you're using:

డిస్ప్రాక్సియా అంటే ఏమిటి? దాన్ని ఎలా ఎదుర్కోవాలి?

FaridaRaj_SEducator
Farida Raj
Also available in: हिंदी English
Like Icon 0Likes
Download Icon 0 Downloads

Key Takeaways:

  1. ప్రాక్సిస్ అనేది కొత్త లేదా అపరిచిత కదలికలను ప్రణాళిక చేయడం, ఏర్పాటుచేసుకోవడం మరియు వాటిని అమలు చేయడానికి మెదడు చూపే సామర్థ్యం.
  2. డిస్ప్రాక్సియా అనేది శరీర కదలికల సమన్వయాన్ని మరియు పరిస్థితులకు సరిపడే కదలికల (మోటార్) నైపుణ్యాలను ప్రభావితం చేసే ఒక పరిస్థితి.
  3. డిస్ప్రాక్సియా ఉన్న పిల్లలు నేర్చుకోవడం, భాష, దృశ్య సమాచారాన్ని గుర్తించడం, మరియు స్వీయ నియంత్రణలో ఇబ్బందులు ఎదురుకోవచ్చు.
  4. బటన్లు పెట్టుకోవడం, జిప్పులు, కత్తెరలు లేదా రాయడానికి ఉపయోగించే పరికరాలను ఉపయోగించడంలో ఇబ్బందులు ఉండవచ్చు.
  5. వారికి ఏమి చేయాలో తెలుసు, కానీ ఆ కదలికను నిజంగా చేయడం వారికి కష్టంగా అనిపిస్తుంది.
  6. ప్రారంభ సంకేతాల్లో మొదటగా ఇతరులను చూసి నేర్చుకోవడంలో పిల్లలకు కష్టంగా అనిపించవచ్చు.
  7. ప్రతి పిల్లల్లో అభ్యాస వ్యత్యాసాలు భిన్నంగా ఉంటాయి—అన్ని లక్షణాలు ఒక్క పిల్లవాడిలో కనిపించవు.
  8. డిస్లెక్సియా, డిస్ కాల్కులియా, డిస్గ్రాఫియా వంటి సంబంధిత పరిస్థితులను కూడా పరిశీలించడం ముఖ్యం.

డిస్ప్రాక్సియా అంటే ఏమిటి?

ప్రాక్సిస్ అంటే మెదడు కొత్త లేదా తెలియని కదలికలను ఊహించి, అవి ఎలా చేయాలో ఒక ప్రణాళికతో క్రమబద్ధంగా అమలు చేసే సామర్థ్యం. ఉదాహరణకు, ఎవరినైనా మొదటిసారి చూసి అనుకరించడం.

డిస్ప్రాక్సియా అనేది కదలికలను సరిగ్గా ప్లాన్ చేసి అమలు చేసే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ఒక పరిస్థితి. ఇది మెదడు కదలికలకు సంబంధించిన సమాచారాన్ని ఎలా ప్రాసెస్ చేస్తుందో దానిపై ప్రభావం చూపుతుంది. ఇది రోజువారీ పనులను ఉదాహరణకు పెన్సిల్ పట్టుకోవడం, స్వయంగా దుస్తులు ధరించడం లేదా ఎవరో చేసే కదలికను అనుకరించడం. అదే వయసు పిల్లలతో పోలిస్తే చాలా కష్టతరం చేస్తుంది.

ఇది పిల్లలు ప్రయత్నం చేయకనో లేదా బద్దకంతోనో ఇలా జరగదు. డిస్ప్రాక్సియా అనేది నాడీ అభివృద్ధి పరిస్థితి. అంటే, పిల్లల మెదడు కదలికల సమన్వయం మరియు ప్లానింగ్‌కు సంబంధించిన ప్రాంతాల్లో భిన్నంగా పనిచేస్తుంది.

డిస్ప్రాక్సియా సంకేతాలు మరియు రోజువారీ సవాళ్లు

డిస్ప్రాక్సియా ఉన్న పిల్లలు కేవలం శరీర కదలికల (మోటార్ స్కిల్స్) లోనే కాకుండా అభ్యసనం, భాష, దృశ్య సమాచారాన్ని గుర్తించడం, మరియు భావోద్వేగ నియంత్రణలో కూడా ఇబ్బందులు ఎదురుకోవచ్చు. ఇక్కడ రోజువారీ జీవితంలో డిస్ప్రాక్సియా ఎలా కనిపించవచ్చో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి:

సూక్ష్మ (ఫైన్) మరియు స్థూల (గ్రాస్) మోటార్ నైపుణ్యాలు

  • చొక్కా బటన్లు పెట్టుకోవడం, జిప్ వేసుకోవడం లేదా షూ లేసులు కట్టడం కష్టంగా అనిపించడం.
  • కత్తెర, చెంచా లేదా క్రేయాన్‌లను ఉపయోగించడం కష్టతరం కావడం.
  • బంతిని పట్టుకోవడం, విసరడం లేదా తన్నడం కష్టంగా ఉండటం.

రాయడం మరియు తరగతి పనులు

  • నెమ్మదిగా రాయడం.
  • పెన్సిల్‌ను సరిగా పట్టుకోవడంలో ఇబ్బంది పడటం.
  • రాసే పనులను తప్పించుకోవడం లేదా త్వరగా వదిలేయడం వంటివి.

మోటార్ ప్లానింగ్ 

  • ఏం చేయాలో తెలిసినా, మధ్యలో “ఆగిపోయినట్టు” గా అనిపించడం
  • తడబాటుతూ లేదా సమన్వయం లేకుండా కనిపించడం
  • క్రీడలు లేదా డాన్స్ స్టెప్స్ వంటి కొత్త శారీరక పనులు నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టడం

ప్రారంభ అభివృద్ధి సంకేతాలు

  • బాల్య దశలో ఇతరులను చూసి అనుకరించడం ద్వారా నేర్చుకోవడంలో ఇబ్బందులు
  • పాకడం, నడవడం లేదా మాట్లాడడం వంటి మైలురాళ్లు ఆలస్యంగా ఉండటం
  • ఒకదాని కంటే ఎక్కువ దశలతో కూడిన సూచనలు ఇస్తే గందరగోళానికి గురయ్యేలా కనిపించడం.

సంకేతాలను గమనించడం

అభ్యాస లేదా అభివృద్ధి పరమైన జాప్యాలను గమనించినప్పుడు ముఖ్యంగా గుర్తించతగ్గ అంశాలు:

  • ప్రతి పిల్లవాడిలో అన్ని సంకేతాలు కనిపించవు.
  • పరిసరాలను బట్టి సంకేతాలు కూడా మారతాయి – ఇంట్లో, పాఠశాలలో లేదా బయట వేరుగా కనిపించవచ్చు.
  • కొంతమంది పిల్లలు అలసటగా ఉన్నప్పుడు లేదా ఆందోళనలో ఉన్నప్పుడు సమన్వయం చూపడం లేదా వ్రాతలో చిన్న సమస్యలు చూపించవచ్చు. దీనిని వైకల్యంగా భావించకూడదు. 
  • అయితే, కొన్ని సంకేతాలు ఎక్కువ కాలం కొనసాగితే మరియు రోజువారీ జీవితంలో అంతరాయం కలిగిస్తే, పరిశీలన కోసం ఒక నిపుణుడిని సంప్రదించడం మంచిది.

ఇది పిల్లల్ని లేబుల్ చేయడం కాకూడదు.  వారు నేర్చుకోవడం మరియు వారి ఆలోచనా శైలి ప్రకారం అర్థం చేసుకొని, మద్దతు ఇచ్చే మార్గాలను కనుగొనడం గురించి అని తెలుసుకోవాలి.

డిస్ప్రాక్సియాను త్వరగా గుర్తించడం ఎందుకు ఉపయోగకరం

డిస్ప్రాక్సియాను త్వరగా గుర్తించడం ద్వారా పిల్లల సంరక్షకులు మరియు ఉపాధ్యాయులు వారిని అర్థం చేసుకోవచ్చు. పిల్లవాడు “నెమ్మదిగా” లేదా “కష్టంగా” వ్యవహరిస్తున్నట్లు కాదని వారు కనిపించని నిజమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారని తెలుసుకోవాలి. తొలిదశలోనే సహాయం అందించడం వలన:

1. పిల్లల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం మరియు అసంతృప్తిని తగ్గించడం

డిస్ప్రాక్సియా ఉన్న పిల్లలు వారి తోటి పిల్లల కన్నా పనులు ఎక్కువ కష్టంగా అనిపిస్తుందని గమనిస్తారు. సరైన మద్దతు లేకపోతే, ఇది వారిమీద వారికే సందేహం కలగడం, వెనక్కు తగ్గడం లేదా “నేను ఏకంగా ఏదీ చేయలేను” అనే భావనకు దారితీయవచ్చు.  

    తొలిదశలో గుర్తించడం వల్ల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు చేయగలిగేవి:

    • పిల్లవాడి వేగానికి అనుగుణంగా అంచనాలను సర్దుబాటు చేయడం.
    • పిల్లవాడు ఒత్తిడికి గురవ్వకుండా సహాయం అందించడం.
    • ప్రయత్నం మరియు పురోగతిని ప్రశంసించడం, విజయాన్ని అనుభవించే భావనను పెంపొందించడం.

    ఇది అసంతృప్తిని తిరిగి రానివ్వకుండా నివారిస్తుంది మరియు భావోద్వేగ భద్రతను పెంపొందిస్తుంది.

    2. పిల్లవాడికి వారి స్వంత వేగంతో ఆచరణాత్మకంగా నైపుణ్యాలను అభ్యసనం చేయడంలో సహాయం చేయడం.

    డిస్ప్రాక్సియా ఉన్న పిల్లలు ప్రతిరోజూ చేసే పనులను పళ్ళు తోముకోవడం. షూలేస్ కట్టడం, సైకిల్ నడపడం, లేదా డెస్క్ వద్ద ఎక్కువ సమయం కూర్చోవడం వంటి సమన్వయంతో చేసే పనులను నేర్చుకోవడానికి కొంత ఎక్కువ సమయం మరియు సహాయం అవసరం అవుతుంది. తొలిదశలో గుర్తించడం వలన ఈ సవాళ్లు ప్రయత్న లోపం వలన కాదని నేర్చుకోవడంలో మరియు ప్రాసెస్ చేసుకోవడంలో కొంత భిన్నత ఉంటుందని తెలుసుకోవాలి.

    ఈ పరిస్థితిని అర్ధం చేసుకుంటూ తల్లిదండ్రులు, సంరక్షకులు పిల్లవాడి స్థాయికి అనుగుణంగా, మెల్లగా, సౌమ్యంగా నేర్చుకునే అనుభవాలను అందించవచ్చు. 

    3. కుటుంబాలకు సరైన మార్గాలు మరియు ఉపయోగకరమైన సాధనాలు అందించండి.

    కుటుంబాలకు సరైన సాధనాలు అందుబాటులో ఉన్నప్పుడు తమ పిల్లలకు స్పష్టంగా మరియు ధైర్యాన్ని ఇచ్చే రీతిలో సహాయం చేయడం సులభమవుతుంది. దృశ్య(విజువల్)షెడ్యూల్‌లను ఉపయోగించడం, పనులను చిన్న చిన్న దశలుగా విభజించడం, ప్రశాంతమైన మరియు ప్రోత్సహించే వాతావరణాన్ని సృష్టించడం వంటి చిన్న మార్పులు కూడా పెద్ద మార్పు తేవగలవు. మీ బిడ్డ ఏ విధంగా బాగా నేర్చుకుంటాడో అర్థం చేసుకొని, దానితో కలిసి పని చేయడం (దానికి వ్యతిరేకంగా కాదు) అనేది అనుబంధాన్ని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, మరియు వారి స్వంత వేగంలో ఎదగడానికి సహాయపడుతుంది.

    డిస్ప్రాక్సియా ఉన్న పిల్లలు చాలా సార్లు సహజమైన అర్ధం చేసుకునే శక్తి, గమనించే స్వభావం, సృజనాత్మకత కలిగి ఉంటారు. వారి ప్రకాశానికి కేవలం కొంచెం భిన్నమైన సహాయం అవసరం.

    ఇంట్లో చేయగల సులభమైన సహాయ మార్గాలు:

    మీ బిడ్డకు సహాయం చేసి, ప్రోత్సహించడానికి కొన్ని సరళమైన మార్గాలు:

    • పనులను చిన్న, సులభమైన దశలుగా విభజించండి.
    • రోజువారీ పనులకు దృశ్య సంకేతాలు లేదా చెక్‌లిస్ట్‌లు ఇవ్వండి.
    • ఫలితాలకే కాకుండా వారి కృషిని గుర్తించి, అభినందించండి.
    • ఆటల ద్వారా సమన్వయాన్ని పెంచండి (ఉదా: క్యాచ్ ఆడటం, డ్యాన్స్ చేయడం, పజిల్స్ ఆడటం).
    • వారు తమ స్వంత వేగంలో అన్వేషించేందుకు అవకాశం ఇవ్వండి – కొన్ని పిల్లలకు విషయాలను అర్థం చేసుకోవడానికి కొంత సమయం, స్థలం అవసరం అవుతుంది.

    సంబంధిత నేర్చుకునే తేడాలను తెలుసుకోవాలి

    కొన్ని సార్లు డిస్ప్రాక్సియా ఇతర నేర్చుకునే తేడాలు లేదా అభివృద్ధి పరిస్థితులతో కలసి ఉంటుంది. మీరు ఇవి కూడా తెలుసుకోవచ్చు:

    • డిస్లెక్సియా – చదవడం మరియు భాష ప్రాసెసింగ్‌పై ప్రభావం చూపుతుంది.
    • డిస్కాల్కులియా – అంకెలు మరియు గణితాన్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది కలిగిస్తుంది.
    • డిస్గ్రాఫియా – రాత శైలి మరియు సూక్ష్మ కదలికల పనులపై ప్రభావం చూపుతుంది.
    • ఆటిజం, ఏ. డి.హెచ్.డి., మరియు డౌన్ సిండ్రోమ్ – డిస్ప్రాక్సియాతో కొన్ని సంకేతాలు కలిపి ఉండవచ్చు, ముఖ్యంగా సమన్వయం, స్వీయ నియంత్రణ, మరియు సెన్సరీ ప్రాసెసింగ్ విషయాల్లో.

    ఇది వారికి సరైన సహాయం, అవసరమైన సౌకర్యాలు, మరియు అనుకూలమైన నేర్చుకునే వాతావరణాలను అందించడానికి మార్గం సుగమం చేస్తుంది, దాంతో వారు వికసించగలరు.

    డిస్లెక్సియా, డిస్కాల్కులియా, డిస్గ్రాఫియా వంటి ఇతర నేర్చుకునే లోపాలను కూడా తెలుసుకోవడానికి మరియు అర్థం చేసుకోవడానికి కొంత సమయం కేటాయించండి.

    మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ఏ. డి.హెచ్.డి. లేదా ఇతర మేధో వైకల్యాలు గురించి సందేహాలు ఉన్నా లేదా చిన్నారి అభివృద్ధిలో ఆలస్యం ఉందని అనుమానం ఉన్నా నయీ దిశా టీమ్ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీ ప్రశ్నలు లేదా సందేహాల కోసం దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌ 844-844-8996 కు కాల్ చేయండి లేదా వాట్సాప్‌లో సంప్రదించండి.మా కౌన్సిలర్లు ఆంగ్లం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషల్లో మాట్లాడగలరు.

    DISCLAIMER: This guide is intended to raise awareness and provide basic information about dyspraxia and related concerns. It is not a diagnostic tool. Please consult a qualified health practitioner for proper guidance.

    గమనిక: ఈ గైడ్ డిస్ప్రాక్సియాకు మరియు సంబంధిత సమస్యలకు సంబంధించిన అవగాహన పెంచడానికి మరియు ప్రాథమిక సమాచారం అందించడానికి ఉద్దేశించబడింది. ఇది నిర్ధారణ సాధనం కాదు. సరైన మార్గదర్శనానికి దయచేసి అర్హత కలిగిన వైద్య నిపుణులను సంప్రదించండి.

    Write Blog

    Share your experiences with others like you!

    English