Skip to main content
Install App
If you're using:

మీ పిల్లల భాషా అభివృద్ధి నైపుణ్యాలను ప్రోత్సహించడానికి గైడ్

Default Avatar

Dr Ajay Sharma

Also available in: हिंदी English
Like Icon 0Likes
Download Icon 4 Downloads

Key Takeaways:

  • 6–8 వారాల నుండి 3–4 సంవత్సరాలు వరకు భాషాభివృద్ధి మైలురాళ్లు
  • పిల్లల భాషా అభివృద్ధిని ఎలా ప్రోత్సహించాలి
  • సంభాషణ: బిడ్డ దగ్గరగా ఉండి కళ్ళలోకి చూసే విధంగా తనతో సంభాషించాలి.
  • ప్రతిస్పందన:  మీ బిడ్డకు సానుకూలంగా స్పందిస్తూ వారు చెప్పే పదాలతో మరికొన్ని పదాలు జత చేసి చెప్పాలి. వారి చుట్టూ ఎటువంటి శబ్దాలు లేకుండా స్పష్టంగా వినగలిగేలా మీరు చెప్పాలి.
  • భాషను సరళీకరించడం: మీరు ఏ విధంగా సంభాషిస్తున్నారో తగిన విధంగా ముఖ్యమైన పదాలను నొక్కి చెప్పడం లేదా సంజ్ఞలతో తెలియజేయాలి ఇక్కడ వారి ప్రతిస్పందన కోసం సమయం ఇవ్వాలి.
  • ప్రతిరోజూ చేసే కార్యకలాపాలను బోధనా సాధనాలుగా మార్చడం: చిత్రాలతో కూడిన పుస్తకాలను చూపించడం మరియు ఉతికిన దుస్తులను విడివిడిగా పెట్టడం వంటి రోజువారీ కార్యకలాపాల గురించి తెలియజేయాలి.
Infographic Image

బాల్య దశలో భాషా అభివృద్ధి అనేది చాలా ఉత్సాహభరితమైన మరియు కీలకమైన భాగం. కానీ బిడ్డ తనదైన వేగం, తనదైన శైలితో భాషను అభివృద్ధి చేసుకుంటుంది. కొందరు పిల్లలు ఇతరులతో పోలిస్తే ముందుగానే మాట్లాడటం ప్రారంభిస్తారు. మరికొందరు పదాలు పలకడానికి కొంత సమయం తీసుకోవచ్చు కానీ తమ చుట్టూ చెప్పబడుతున్న విషయాలను అర్ధం చేసుకోవడానికి బలంగా ప్రయత్నిస్తారు.

కాలక్రమేణా పిల్లలు తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలను ఎలా అభివృద్ధి చేస్తారు, ఈ ప్రయాణాన్ని దినసరి జీవితంలో ఎలాంటి సాధారణ మార్గాల్లో స్వీకరించాలి, అలాగే సహాయం కోసం ఎప్పుడు సంప్రదించాలో మనం అన్వేషిస్తాం. ఈ మొత్తం ప్రక్రియలో బిడ్డ ప్రత్యేకమైన అభ్యాస శైలిని మరియు అవసరాలను మనం గౌరవించాలి.

భాషా అభివృద్ధి అంటే ఏమిటి?

బాషా అభివృద్ధి అనేది పిల్లలు తమ భాష ద్వారా లేదా, పదాల ద్వారా కాకుండా సంజ్ఞలు లేదా రాయడం ద్వారా ఎలా అర్ధం చేసుకుంటారు ఇంకా దానిని ఎలా ఉపయోగిస్తారు అనే విషయాన్ని తెలుపుతుంది. దీనిలో హావభావాలు, స్వర స్థాయి అంటే తమ భావోద్వేగాలను తెలియజేసే పద్దతి, శరీర భంగిమలు, కళ్ళల్లోకి నేరుగా చూడటం, ముఖ కవళికలు ఇంకా అనేకం ఉంటాయి.

బిడ్డ అసలు పదాలను పలకడం ప్రారంభించక ముందే తమ కమ్యూనికేషన్ తెలిపే విధానాలు:  

  • కూ మని అరవడం 
  • అస్పష్టంగా పలకడం
  • సంజ్ఞలు
  • చిరునవ్వులు మరియు భావాలు
  • కేకలు, ఏడవడం

ఇవన్నీ కమ్యూనికేషన్ కొరకు ముఖ్యమైన మరియు సరైన రూపాలు. పిల్లలకు వారి ప్రారంభ అనుభవంతో క్రమంగా భాషా అభివృద్ధి జరుగుతుంది.  

సాధారణ భాషా మైలురాళ్లు

ప్రతి బిడ్డ తనదైన వేగంలో అభివృద్ధి చెందుతుంది అయినప్పటికీ కమ్యూనికేషన్ మరియు భాష కాలక్రమంగా ఎలా ఎదుగుతాయో సూచించే కొన్ని సాధారణ సంకేతాలు క్రింద ఇవ్వబడ్డాయి.

6–8 వారాలు 

  • ప్రేమగా లేదా కోపంగా ఉన్న స్వరానికి స్పందించడం 
  • సామాజికంగా నవ్వడం ప్రారంభమవుతుంది
  • మృదువుగా “కూ” అనే శబ్దాలు చేయడం

2–4 నెలలు 

  • పరిచయమున్న గొంతుకు స్పందించడం
  • ముఖా ముఖి సంభాషణను ఆస్వాదించడం
  • వారితో మాట్లాడుతున్నప్పుడు ఉత్సాహం చూపించడం

6-9 నెలలు 

  • బ-బ, డ-డ వంటి శబ్దాలను చేయడం
  • తన పేరును గుర్తించడం
  • “వద్దు”,”దగ్గరకు రా” వంటి సరళమైన ఆదేశాలను అర్ధం చేసుకోవడం

12 నెలలు 

  • “అమ్మ”, “బంతి” వంటి పదాలను స్పష్టంగా పలకడం 
  • “బొమ్మ ఇవ్వు” వంటి సాధారణ ఆదేశాలను అనుసరించడం 
  • ఆసక్తి ఉన్న వస్తువులను వేలితో చూపించడం

18 నెలలు 

  • 10 నుండి 20 వరకు సరళ పదాలను ఉపయోగించగలుగుతారు 
  • తాము చెప్పే మాటలకన్నా ఎక్కువగా అర్ధం చేసుకోగలుగుతారు 
  • శరీర భాగాలను, పుస్తకాలలో ఉన్న చిత్రాలను, పరిచయమున్న వ్యక్తులను గుర్తు పట్టడం ప్రారంభిస్తారు.

2 సంవత్సరాలు 

  • రెండు పదాలను కలిపి చెప్పగలుగుతారు (“పాలు కావాలి”, “నాన్నా రా “)
  • సాధారణమైన చిన్న చిన్న ప్రశ్నలను అడగలుగుతారు 
  • రెండు దశల ఆదేశాలను పాటిస్తారు (ఉదాహరణకు “నువ్వు వచ్చి, ఇక్కడ కూర్చో”)

3–4 సంవత్సరాలు 

  • కొంచం పెద్ద వాక్యాలను స్పష్టంగా పలుకుతారు
  • “ఎందుకు”,”ఏమిటి” అనే ప్రశ్నలు అడుగుతారు 
  • వారు మాట్లాడుతున్న భాష చాలా మంది అర్ధం చేసుకోగలుగుతారు
  • ఏవైనా సంఘటనల గురించి ఇంకా తమ భావాలను కూడా చెప్పగలుగుతారు

బాషా అభివృద్ధి ఎందుకు ముఖ్యమైనది?

బాష ద్వారా పిల్లలు:

    • తమ కోరికలను, భావాలను తెలుపుకోగలుగుతారు  
    • సంభంధాలను మరియు నమ్మకాన్ని పెంచుకోగలుగుతారు  
    • కొత్త విషయాలు తెలుసుకుంటారు  
    • ఆటలలో నిమగ్నం కావడానికి, సృజనాత్మకను పెంచుకుంటారు  
    • విషయాల పట్ల అవగాహన కలిగి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

మంచి సంభాషణ అనేది భావోద్వేగ శ్రేయస్సు మరియు స్వీయ నియంత్రణతో బలంగా ముడిపడి ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు తాము చెప్పేది విన్నప్పుడు, అర్థం చేసుకున్నట్లు భావించినప్పుడు వారు సురక్షితంగా మరియు భద్రంగా ఉన్నట్లు భావిస్తారు.  

కమ్యూనికేషన్ కొరకు నాడీ ధ్రువీకరణ విధానం

మెదడు పనితీరులో వ్యత్యాసాలు (ఆటిజం, ఏ.డి. హెచ్.డి. అభివృద్ధి ఆలస్యం) ఉన్న పిల్లలో బాషా అభివృద్ధి భిన్నంగా ఉంటుంది. అంటే ఇది సరైనది కాదు అని అర్ధం కాదు. ఇది వారి కమ్యూనికేషన్ శైలి అని చెప్పవచ్చు.

మీ పిల్లల బాషా అభివృద్ధిని ఎలా ప్రోత్సహించాలి?

1.కమ్యూనికేషన్ అనేది ఒక అనుబంధం

  • మీ బిడ్డ మీ మాటలకు స్పందించకపోయినా వారితో తరచుగా మాట్లాడుతూ ఉండండి
  • మీరు చేస్తున్న పనులను వారికి వివరించండి. (“అమ్మ వంట చేస్తుంది“, “ఇప్పుడు మనం తలుపు తీద్దామా“)
  • సాధ్యమైనంతవరకు కళ్ళలోకి చూస్తూ ముఖా ముఖి మాట్లాడండి
  • వారు ఎటువైపు చూస్తున్నారో, వారికి ఏది ఆసక్తిగా ఉందో గమనిస్తూ వాటి గురించి మాట్లాడండి
  • వారి తప్పులను సరిదిద్దకుండా, ఆసక్తితో, ఆప్యాయతతో స్పందించండి

2.  భావాన్ని తగ్గించకుండా భాషని సులభతరం చేయాలి

  • చిన్న, స్పష్టమైన పదాలను ఉపయోగించాలి 
  • ముఖ్యమైన పదాలను నొక్కి చెప్పాలిఇది నీ కప్పు” 
  • అర్ధం చేసుకునేందుకు వీలుగా పదాలతో పాటుగా సంకేతాలను ఉపయోగించాలి 
  • పిల్లలు విన్న పదాలను అర్ధం చేసుకునేందుకు, స్పందించేందుకు మధ్యలో చిన్న విరామాలు ఇస్తూ ఉండాలి 
  • వివిధ సందర్భాలలో కొత్త పదాలు పునరావృతం చేయాలి

3. రోజువారీ జీవితాన్ని ఒక అభ్యాసంగా మార్చాలి

దీనికోసం ఖరీదయిన పరికరాలు లేదా యాప్స్ అవసరం లేదు. మీ ఇల్లే సాధనకు ఒక గొప్ప ప్రదేశం.    

  • స్నానం చేయడం, దుస్తులు వేసుకోవడం, లేదా భోజనచేయడం వంటి రోజువారీ పనుల సమయంలో మాట్లాడుతూ ఉండాలి.
  • సులభంగా ఉండే చిత్రాలతో కూడిన పుస్తకాలను కలసి చదవాలి. వస్తువుల పేర్లు చెప్పాలి.
  • యాక్షన్ తో కూడిన పాటలు మరియు పద్యాలు వినిపించడం ద్వారా మరింత మెరుగ్గా నేర్చుకుంటారు.
  • వేరుగా ఉతకవలసిన దుస్తుల పేర్లు, రంగులు తెలియజేయాలి.
  • వంట చేస్తున్నప్పుడు వచ్చే వాసనలు, రంగులు, స్పర్శలు గురించి వివరంగా చెప్పాలి.

4. వినే సమయంలో స్పందించాలి 

  • మీ బిడ్డ వేలితో చూపిస్తున్నప్పుడు లేదా అస్పష్టమైన శబ్దాలు చేస్తున్నప్పుడు ఆసక్తిగా స్పందించండి. ఉదా: “నీకు బంతి కావాలా? ఇదిగో తీసుకో” అని ఆసక్తితో స్పందించండి.   
  • పిల్లలు మాట్లాడినప్పుడు వారి వ్యాకరణాన్ని సరిచేయడంపై దృష్టి పెట్టకండి. బదులుగా వారు పలికిన పదాలను లేదా వాక్యాలను విస్తరించండి. ఉదా: “కారు వెళ్తుంది” అని బిడ్డ చెప్పినప్పుడు మీరు దానిని విస్తరిస్తూ “అవును ఎరుపు రంగు కారు వేగంగా వెళ్తుంది” అని చెప్పాలి. 
  • పరిసరాలలో ఎటువంటి శబ్దాలు లేకుండా చూడాలి. దీని ద్వారా పిల్లలు మీ మాటలను స్పష్టంగా వినగలుగుతారు. 
  • పిల్లలు పదాలు మొత్తంగా పలుకక పోయినా సరే వారి ప్రతి ప్రయత్నాన్ని ప్రోత్సహించాలి.

సహాయం కోసం ఎప్పుడు సంప్రదించాలి

మీ పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే నిపుణులను సంప్రదించడం మేలు: 

  • శబ్దాలు లేదా వారి పేరుకు స్పందించకపోవడం
  • కళ్ళలోకి చూడలేకపోవడం, మీకు సరిగా స్పందించకపోవడం 
  • 12 నెలల వయసు వచ్చినప్పటికీ అస్పష్టమైన శబ్దాలు చేయకపోవడం 
  • 2 సంవత్సరాల వయసుకు కొన్ని పదాలు మాత్రమే పలకడం 
  • 2 1 /2 సంవత్సలకు పదాలను కలిపి చెప్పలేక పోవడం లేదా స్థిరమైన వాడుక లేకపోవడం. 
  • వారు ఏదైనా చెప్పాలన్నా లేదా మీకు అర్ధం అయ్యేలా చెప్పాలనుకున్నప్పుడు ఇబ్బంది పడటం లేదా చిరాకు పడటం చేస్తున్నప్పుడు.

మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి పిల్లల వైద్య నిపుణిడిని సంప్రదించడం మంచిది. బిడ్డ పరిస్థితిని అంచనా వేసేందుకు ఒక స్పీచ్ లాంగ్వేజ్ థెరపిస్ట్ (ఎస్. ఎల్. పి) ను సూచించవచ్చు.  

తగిన సమయంలో సహాయం అందిస్తే, పిల్లలు తగిన విధంగా కమ్యూనికేట్ చేయడం నేర్చుకోవచ్చు. అది మాటల ద్వారా కానీ, సంకేతాల ద్వారా కానీ, దృశ్య రూపాలు లేదా ఇతర పద్ధతుల ద్వారా కావచ్చు.

అదనపు వనరులు

ప్రయాణంలో మరింత సహాయం కావాలా?

స్పీచ్, భాష మరియు కమ్యూనికేషన్ గురించి తెలియజేసే భాషా అభివృద్ధి పుస్తకాన్ని మరియు మా వీడియోలను చూడవచ్చు. వీటిలో మీరు ఇంట్లో ప్రయత్నించడానికి కొన్ని కార్యకలాపాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

You can also contact the Nayi Disha FREE Helpline:
844-844-8996 (Call or WhatsApp) Our counselors speak English, Hindi, Malayalam, Gujarati, Marathi, Telugu, and Bengali and can help guide you to the right professionals.

మీరు నయీ దిశా ఉచిత హెల్ప్‌లైన్‌ను 844-844-8996 కు కాల్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషల్లో మాట్లాడగలరు మరియు సరైన నిపుణులను సంప్రదించేందుకు మీకు మార్గనిర్దేశనం చేయగలరు.

గమనిక: ఈ అంశం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అందించబడింది. ఇది వైద్య సలహా, నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. భాష లేదా అభివృద్ధి సంబంధిత ఆలస్యాల గురించి మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే దయచేసి అర్హత కలిగిన వైద్య నిపుణులను లేదా స్పీచ్ లాంగ్వేజ్ థెరపిస్ట్‌ను సంప్రదించగలరు.

Write Blog

Share your experiences with others like you!

English