Skip to main content
Install App
If you're using:

ప్రత్యేక అవసరాలున్న మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థిక భద్రత కల్పించేందుకు మూడు ముఖ్యమైన విషయాలు

Partners (People)

Jitendra Solanki

Also available in: हिंदी English

Key Takeaways:

  • జాగ్రత్తగా, ఆలోచించి ఆర్ధిక ప్రణాళిక రూపొందించుకోవడం భవిష్యత్తులో ఆర్థిక భద్రత కల్పించడంలో సహాయపడుతుంది.
  • మీ పిల్లల భవిష్యత్తు కోసం 3 దశల ఆర్థిక ప్రణాళిక విధానంపై దృష్టి పెట్టండి.
  • మీ లక్ష్యాలను నిర్ణయించి, వాటికి ప్రాధాన్యత ఇవ్వండి: మీ పిల్లల భవిష్యత్తు అవసరాలను గుర్తించి, వాటిని స్వల్పకాలిక (షార్ట్ టర్మ్), మధ్యకాలిక (మీడియం టర్మ్), దీర్ఘకాలిక (లాంగ్ టర్మ్) లక్ష్యాలుగా విభజించండి.
  • మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని తెలుసుకోండి: మీ దగ్గర ఉన్న ఆదాయం, ఖర్చులు, పొదుపు వంటి వాటిని పూర్తిగా అర్థం చేసుకుని, మీ పిల్లల భవిష్యత్తు కోసం తగిన ప్రణాళిక వేసుకోండి.
  • ప్రణాళిక ప్రక్రియ లో ఎదురయ్యే సమస్యలను ముందే గుర్తించండి:మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులను గుర్తించి, వాటిని ఎదుర్కొనేలా ముందుగానే ప్రణాళిక చేసుకోండి.
  • సమగ్రంగా, లోటుపాట్లు లేకుండా ఆర్థిక ప్రణాళిక చేసుకోవడానికి సమయం, ఆలోచన మరియు సరైన మార్గదర్శకత్వం అవసరం. అందుకే ముందుగానే ప్రణాళిక ప్రారంభించండి.

ప్రత్యేక అవసరాలున్న పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళికపై సాధారణ ప్రశ్నలు అనే విషయ వివరణలో, ప్రత్యేక అవసరాలున్న వ్యక్తులు ఉన్న కుటుంబాలు ఎదుర్కొనే కొన్ని సవాళ్ల గురించి చర్చించాము. భవిష్యత్తు గురించి ఉండే ఆందోళనలు, మీ పిల్లలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండగలరా అనే ఉండే భయాలను తగ్గించుకోవడానికి ముందుగానే ఆలోచించి, జాగ్రత్తగా ఆర్థిక ప్రణాళిక చేసుకోవడం చాలా ముఖ్యం. అనుభవం ఉన్న ఆర్థిక సలహాదారుల నుంచి సరైన మార్గదర్శకత్వం తీసుకుంటే, ఆర్థిక ప్రణాళిక అనేది కుటుంబాలు ఆందోళన చెందాల్సిన మరో సవాలుగా మిగలదు.

సులభంగా చెప్పాలంటే, ఆర్థిక ప్రణాళిక అనేది కొనుగోలు చేసే వస్తువు కాదు. ఇది ఒక ప్రక్రియ. ఈ విధానం వల్ల మీ పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భద్రత కల్పించే మార్గంలో ఎదురయ్యే లోటుపాట్లను ముందుగానే గుర్తించవచ్చు. సరైన ప్రణాళికలు, పద్ధతులను పాటించడం ద్వారా ఈ లోటుపాట్లను అధిగమించి, ఆర్థిక పరిస్థితిని సరిగ్గా నిర్వహించుకోవచ్చు. అంతేకాకుండా, జీవితంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఆర్థిక ప్రణాళికను కూడా మార్చుకోవచ్చు దీనివల్ల, కుటుంబ సంక్షేమం కోసం పెట్టుకున్న లక్ష్యాలను చేరుకునే దిశలో ముందుకు సాగవచ్చు.

మీ పిల్లల భవిష్యత్తు కోసం కుటుంబాలు అనుసరించగల 3 దశల ఆర్థిక ప్రణాళిక విధానంపై దృష్టి పెట్టండి:

మొదటి దశ: మీ లక్ష్యాలను నిర్ణయించి, వాటికి ప్రాధాన్యత ఇవ్వండి

జీవితంలో మన లక్ష్యాలను గుర్తించడం సులభమే. కానీ, వాటిలో దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. దీనిని సులభంగా చేసుకోవడానికి, ఈ లక్ష్యాలను వాటి అవసరాన్ని బట్టి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలుగా విభజించుకోవచ్చు. ఉదాహరణకు, స్వల్పకాలిక (షార్ట్ టర్మ్) లక్ష్యాల్లో రాబోయే 2–3 సంవత్సరాల్లో కుటుంబంతో విహారయాత్రకు వెళ్లడం లేదా కారు కొనడం వంటివి ఉండవచ్చు. మధ్యకాలిక (మీడియం టర్మ్) లక్ష్యాల్లో 4–6 సంవత్సరాల తర్వాత మీ పిల్లల చదువుకు అవసరమైన ఖర్చులను సిద్ధం చేసుకోవడం లేదా ఇల్లు కొనడం వంటివి ఉండవచ్చు. అంతకంటే ఎక్కువ కాలం తర్వాత సాధించాలనుకునే లక్ష్యాలను దీర్ఘకాలిక (లాంగ్ టర్మ్) లక్ష్యాలుగా గుర్తించవచ్చు.

అదేవిధంగా, మీ పిల్లల భవిష్యత్తు కోసం మంచి ఆర్థిక ప్రణాళిక చేసుకోవాలంటే, మీ పిల్లలకు భవిష్యత్తులో అవసరమయ్యే విషయాలను ముందుగానే గుర్తించి, వాటిని వర్గాలుగా విభజించుకోవడం చాలా ముఖ్యం.

దీని వల్ల మీరు భవిష్యత్తులో చేయాల్సిన ఖర్చులను బట్టి మీ పొదుపు చేయాల్సిన మొత్తాన్ని నిర్ణయించుకుని, దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకోవచ్చు. భవిష్యత్తులో వచ్చే ఖర్చులపై స్పష్టమైన అంచనా ఉంటే, మీ డబ్బును సరైన అవసరాలకు తగిన విధంగా కేటాయించుకోవడానికి అది ఉపయోగపడుతుంది.

స్వల్పకాలిక లక్ష్యాలు: రాబోయే 2–3 సంవత్సరాల్లో మీ పిల్లల అవసరాల కోసం అయ్యే ఖర్చులను స్వల్పకాలిక లక్ష్యాలుగా పరిగణించవచ్చు. ఉదాహరణకు, చదువుకు అయ్యే ఖర్చులు, థెరపీలను కొనసాగించడానికి అయ్యే ఖర్చులు లేదా వైద్య పరీక్షలకు అయ్యే ఖర్చులు ఇందులో ఉండవచ్చు.

మధ్యకాలిక లక్ష్యాలు: రాబోయే 5–7 సంవత్సరాల్లో మీ పిల్లల కోసం అయ్యే ఖర్చులను మధ్యకాలిక లక్ష్యాలుగా పరిగణించవచ్చు. పిల్లలు పెరుగుతున్న కొద్దీ ఉన్నత విద్య, వృత్తి శిక్షణ, సహాయక సాంకేతిక పరికరాలు వంటి వాటికి అయ్యే ఖర్చులు ఇందులో ఉండవచ్చు.

దీర్ఘకాలిక లక్ష్యాలు: తల్లిదండ్రులు పదవీ విరమణ చేసిన తర్వాత వచ్చే ఖర్చుల కోసం ముందుగానే డబ్బు సిద్ధం చేసుకోవడం ఒక ముఖ్యమైన దీర్ఘకాలిక లక్ష్యం కావచ్చు.

రెండవ దశ: ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవడం

తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుతో పాటు తమ భవిష్యత్తును కూడా భద్రంగా ఉంచుకోవడానికి ఆర్థిక ప్రణాళిక మొదలుపెట్టేటప్పుడు, ప్రస్తుతం తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో స్పష్టంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇది భవిష్యత్తు కోసం సరైన ప్రణాళిక చేసుకోవడానికి సహాయపడుతుంది.

మొదట ఈ ప్రశ్నలను మీరే అడగడం ద్వారా ప్రారంభించవచ్చు:

  • ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఆర్థిక వనరులు ఏమిటి?
  •  మన పిల్లల సంరక్షణకు, అలాగే మన అవసరాలకు ఈ వనరులు సరిపోతాయా?

కుటుంబం ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితిని సరిగ్గా పరిశీలించడం ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవచ్చు.

ఈ విశ్లేషణలో రెండు విషయాలను పరిశీలిస్తారు – నికర ఆస్తి విలువ (నెట్ వర్త్) మరియు నగదు ప్రవాహం (కాష్ ఫ్లో)

1. నికర ఆస్తి విలువ: మీ మొత్తం ఆస్తులు, అప్పులను లెక్కలోకి తీసుకుని, మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి విలువ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది. మీ ఆస్తుల విలువ నుంచి చెల్లించాల్సిన మొత్తాల మొత్తాన్ని తీసివేస్తే వచ్చే విలువే నికర ఆస్తి విలువ.

  •  ఆస్తులు: ప్రస్తుతం మీ సొంతంగా ఉన్నవి. (ఇల్లు, కారు, మ్యూచువల్ ఫండ్స్, PPF, వ్యక్తిగత పొదుపులు మొదలైనవి.)
  • చెల్లించాల్సిన మొత్తాలు (రుణాలు, బకాయిలు): మీరు ఇతరులకు చెల్లించాల్సిన డబ్బు.

రెండింటి మధ్య తేడా మీ నికర విలువను చూపిస్తుంది.

2.        మీ ఆర్థిక విశ్లేషణలో మరో ముఖ్యమైన అంశం క్యాష్ ఫ్లో. దీని ద్వారా మీకు వచ్చే ఆదాయంలో నుంచి ఖర్చులు పోగా, మీరు ఎంత మొత్తాన్ని పొదుపు చేయగలుగుతున్నారో తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో మీ పిల్లల సంరక్షణకు అవసరమైన ఖర్చులకు ఈ పొదుపు ముఖ్యమైన ఆధారంగా ఉంటుంది.

క్యాష్ ఫ్లోలో 2 అంశాలు ఉంటాయి:

  • ఆదాయం: ఆదాయం వివిధ మార్గాల నుంచి రావచ్చు. ఇందులో తల్లిదండ్రుల సంపాదన (జీతం), ప్రభుత్వం అందించే సహాయం (దివ్యాంగుల పెన్షన్), పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయం, తాతయ్యలు, అమ్మమ్మలు లేదా ఇతర బంధువుల నుంచి వచ్చే వారసత్వం వంటివి ఉంటాయి. ఆదాయం వచ్చే అన్ని మార్గాలను స్పష్టంగా గుర్తించాలి.
  •  ఖర్చులు: ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం అయ్యే ఖర్చులను విడిగా లెక్కించాలి. దీనివల్ల పిల్లల కోసం అవసరమయ్యే మొత్తం ఖర్చును అంచనా వేయవచ్చు.

అందువల్ల, రెండు వేర్వేరు ఖర్చుల పట్టికలను సిద్ధం చేసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. కుటుంబానికి అయ్యే ఖర్చుల వివరాలు మరొకటి, పిల్లల రోజువారీ అవసరాలకు అయ్యే ఖర్చుల వివరాలు.

కుటుంబ ఖర్చులను స్థిర ఖర్చులు మరియు మారే ఖర్చులుగా విభజించవచ్చు.

  1. స్థిర ఖర్చులు అనేవి ముందుగానే తెలిసిన, సాధారణంగా పెద్దగా మారని ఖర్చులు. ఉదాహరణకు ఇంటి అద్దె, కరెంట్/వాటర్ బిల్లులు, బీమా ప్రీమియం వంటివి.
  1. మారే ఖర్చులు అనేవి ప్రతి నెలా ముందుగా అంచనా వేయలేని లేదా ప్రత్యేకంగా డబ్బు పక్కన పెట్టని ఖర్చులు. ఉదాహరణకు ప్రయాణాలు, వ్యక్తిగత కొనుగోళ్లు వంటివి.

పిల్లల ఖర్చుల్లో థెరపీలు, చదువు, ప్రయాణం, వృత్తి శిక్షణ, రోజువారీ అవసరాలకు అయ్యే ఖర్చులు ఉంటాయి. ముఖ్యంగా మొదట్లో ఈ ఖర్చులను అంచనా వేయడం కష్టంగా ఉండవచ్చు. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని నెలల పాటు ఈ ఖర్చులను గమనిస్తూ, ఆ తర్వాత వాటి ఆధారంగా సుమారుగా ఎంత ఖర్చవుతుందో అంచనా వేయవచ్చు.

మూడవ దశ: ఆర్థిక ప్రణాళికలో ఎదురయ్యే సవాళ్లను గుర్తించడం

మీ కుటుంబానికి అవసరమైన ఆర్థిక వనరులు, ఖర్చుల గురించి స్పష్టత వచ్చిన తర్వాత, ఆర్థిక ప్రణాళికలో ఎక్కడ లోటు ఉందో గుర్తించగలుగుతారు. ఈ సమయంలో వివిధ పరిస్థితులు ఎదురుకావచ్చు.

1.  ఖర్చులు ఎక్కువగా, ఆదాయం తక్కువగా ఉండవచ్చు. దాంతో భవిష్యత్తు అవసరాల కోసం తగినంత పొదుపు చేయలేకపోవచ్చు.

2.  మరో పరిస్థితిలో, మీరు పదవీ విరమణకు దగ్గరలో ఉండవచ్చు, కానీ ఇప్పటివరకు చేసిన పొదుపు భవిష్యత్తు అవసరాలకు సరిపోకపోవచ్చు.

పరిస్థితి ఏదైనా, మీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా విశ్లేషించుకోవడం వల్ల మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆర్థికంగా ఎలాంటి విషయాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలో స్పష్టంగా తెలుస్తుంది. ఆ తర్వాత తగిన చర్యలు, సూచనలు తీసుకుని, మీ పిల్లల భవిష్యత్తు భద్రంగా ఉండేలా సరైన ప్రణాళికలు రూపొందించుకోవచ్చు.

ఇలాంటి సమగ్రమైన, పక్కాగా ఉండే ఆర్థిక ప్రణాళికకు సమయం, ఆలోచన మరియు సరైన మార్గదర్శకత్వం అవసరం. అందుకే ముందుగానే ప్రణాళిక చేసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడిని తగ్గించుకోవడంతో పాటు, పిల్లలకు మరియు తల్లిదండ్రులకు ఆర్థిక భద్రత ఉండేలా చూసుకోవచ్చు.

మీ పిల్లల కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఎలా తయారు చేసుకోవాలో కూడా తెలుసుకోవచ్చు. ఇందులో మీ పిల్లల గురించి భవిష్యత్తులో సంరక్షణ చూసుకునే వ్యక్తికి అవసరమైన ముఖ్యమైన సమాచారాన్ని నమోదు చేయవచ్చు.

గమనిక: ఈ వివరణ కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. మీ అవసరాలకు సంబంధించిన చట్టపరమైన లేదా ఆర్థిక సలహా కోసం దయచేసి ఆర్థిక సలహాదారుడిని సంప్రదించండి.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ 844-844-8996 కు సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

Write Blog

Share your experiences with others like you!

English