మూర్ఛ(ఎపిలెప్సీ/సీజర్) అంటే ఏమిటి? ప్రథమ చికిత్స ఎందుకు ముఖ్యం?
మూర్ఛ అనేది మెదడుకు సంబంధించిన దీర్ఘకాలిక నాడీ సంబంధిత పరిస్థితి. దీనివల్ల పదేపదే మూర్ఛలు రావచ్చు. మెదడులో విద్యుత్ సంకేతాలు ఒక్కసారిగా అసాధారణంగా విడుదలైనప్పుడు, కొద్దిసేపు మెదడు సాధారణంగా పనిచేయడంలో అంతరాయం కలుగుతుంది. దీనివల్ల వ్యక్తి కదలికలు, అనుభూతులు లేదా ప్రవర్తనలో మార్పులు కనిపించవచ్చు. ఈ మార్పులు కొన్నిసార్లు కొన్ని సెకన్లపాటు, మరికొన్నిసార్లు అంతకంటే ఎక్కువసేపు ఉండవచ్చు.
మూర్ఛలు సాధారణంగా కనిపించే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఒకరికి జీవితంలో ఏదో ఒక సమయంలో మూర్ఛ రావచ్చు. భారతదేశంలోనూ ఈ సమస్య గణనీయంగానే ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 కోట్ల మంది మూర్ఛ వ్యాధితో జీవిస్తున్నారు. వీరిలో దాదాపు 80% మంది తక్కువ, మధ్యస్థ ఆదాయం ఉన్న దేశాల్లో నివసిస్తున్నారు. భారతదేశంలో సుమారు 1.2 కోట్ల మంది మూర్ఛ వ్యాధితో జీవిస్తున్నట్లు అంచనా. మూర్ఛ వ్యాధి ఉన్నవారిలో చాలామందికి బాల్యంలోనే మూర్ఛలు మొదలవుతాయి. అంచనాల ప్రకారం, మూర్ఛ వ్యాధి ఉన్నవారిలో 60% కంటే ఎక్కువ మందికి 18 ఏళ్లలోపు మొదటి మూర్ఛ వస్తుంది.
భారతదేశంలోని కుటుంబాలకు ఈ సమాచారం ఎందుకు ముఖ్యమైనది? మీరు మూర్ఛ సమస్య ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంరక్షకులైతే, ఏదో ఒక సమయంలో పిల్లలకు మూర్ఛ రావడాన్ని మీరు ప్రత్యక్షంగా చూడవచ్చు. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ముందుగానే సిద్ధంగా ఉండటం ముఖ్యం. మూర్ఛ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు తెలుసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.
కుటుంబ సభ్యులు, సంరక్షకులు లేదా చుట్టూ ఉన్నవారు సరైన సమయంలో ప్రథమ చికిత్స అందించడం వల్ల ప్రమాదాలను తగ్గించి, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు సహాయపడవచ్చు. మూర్ఛకు ప్రథమ చికిత్స అంటే మూర్ఛను ఆపడం కాదు. మూర్ఛ దానంతట అదే తగ్గే వరకు పిల్లలను సురక్షితంగా ఉంచడం, అవసరమైనప్పుడు వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలో తెలుసుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం.
మూర్ఛ రకాలను తెలుసుకుందాం
మూర్ఛ వచ్చినప్పుడు ఎప్పుడూ ఒకేలా కనిపిస్తుందని మీరు అనుకోవచ్చు. అంటే, వ్యక్తి వణుకుతూ కింద పడిపోతారని భావించవచ్చు. కానీ, అన్ని మూర్ఛలు ఒకేలా ఉండవు. మూర్ఛలో అనేక రకాలు ఉన్నాయి. కొన్నిసార్లు వ్యక్తి అయోమయానికి గురవ్వడం లేదా శూన్యంలోకి చూస్తూ ఉండటం కనిపించవచ్చు. మరికొన్ని సందర్భాల్లో స్పృహ కోల్పోయి కింద పడిపోవడం, శరీరం వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
సాధారణంగా మూర్ఛలను రెండు ప్రధాన రకాలుగా విభజించవచ్చు.
1. ఫోకల్ మూర్ఛలు (పాక్షిక మూర్ఛలు)
ఈ రకమైన మూర్ఛ మెదడులోని ఒక నిర్దిష్ట భాగంలో ప్రారంభమవుతుంది. ఫోకల్ మూర్ఛ వచ్చినప్పుడు వ్యక్తికి చుట్టూ ఏం జరుగుతుందో లేదా తాను ఏం చేస్తున్నారో తెలియకపోవచ్చు. దుస్తులను పదేపదే పట్టుకోవడం లేదా లాగడం, పెదవులను పదేపదే కదపడం, మళ్లీ మళ్లీ మింగడం లేదా లక్ష్యం లేకుండా అటూ ఇటూ తిరగడం వంటి అసాధారణ కదలికలు, ప్రవర్తన కనిపించవచ్చు.
భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, మూర్ఛ వ్యాధి నిర్ధారణ అయిన పిల్లల్లో 53% మందికి ఫోకల్ మూర్ఛలు ఉన్నట్లు గుర్తించారు.
2. జనరలైజ్డ్ మూర్ఛలు (శరీరం బిగుసుకుపోవడం (టోనిక్) – శరీరం వణకడం / కొట్టుకోవడం (క్లోనిక్))
ఈ రకమైన మూర్ఛ మెదడు మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. టోనిక్-క్లోనిక్ మూర్ఛ వచ్చినప్పుడు శరీరం బిగుసుకుపోవడం, స్పృహ కోల్పోవడం, కింద పడిపోవడం, చేతులు, కాళ్లు అదుపు లేకుండా కుదుపులకు గురవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
భారతదేశంలో మూర్ఛ వ్యాధి ఉన్న పిల్లల్లో అత్యంత సాధారణంగా కనిపించిన మూర్ఛ రకం జనరలైజ్డ్ టానిక్-క్లోనిక్ మూర్ఛలు. ఒక అధ్యయనంలో ఇవి మొత్తం కేసుల్లో 69.6%గా నమోదయ్యాయి.
3. మూర్ఛకు ముందు కనిపించే హెచ్చరిక సంకేతాలు
కొంతమంది పిల్లల్లో మూర్ఛ ప్రారంభమయ్యే ముందు కొన్ని సంకేతాలు కనిపించవచ్చు. వీటిని ఆరాస్ అంటారు. అవి:
ఆందోళనగా అనిపించడం లేదా వింత వాసన, రుచి అనుభవించడం- గతంలో జరిగిన సంఘటనను మళ్లీ అనుభవిస్తున్నట్లుగా అనిపించడం- వికారం లేదా కడుపులో ఏదో కదులుతున్నట్లుగా అనిపించడం- కళ్ల ముందు మెరుపులు కనిపించడం వంటి దృశ్య మార్పులు.
ఫోకల్ మూర్ఛలు ప్రారంభమయ్యే సమయంలో కొంతమందికి గతంలో జరిగిన సంఘటనను మళ్లీ అనుభవిస్తున్నట్లుగా అనిపించవచ్చు. అలాగే, అసహ్యకరమైన వాసన లేదా రుచి రావడం, కడుపులో ఏదో కదులుతున్నట్లుగా అనిపించడం లేదా వికారం కలగడం వంటి అనుభూతులు ఉండవచ్చు.
గుర్తుంచుకోండి: ప్రతి పిల్లలోనూ మూర్ఛకు ముందు హెచ్చరిక సంకేతాలు కనిపించవు. చాలా సందర్భాల్లో మూర్ఛ అకస్మాత్తుగా, ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండానే వస్తుంది. సాధారణంగా కొన్ని సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు కొనసాగి, దానంతట అదే తగ్గిపోతుంది.
మూర్ఛ వచ్చినప్పుడు ప్రథమ చికిత్స – దశలవారీగా
మూర్ఛ వచ్చినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బంధువులు లేదా స్నేహితులు ఎవరైనా ఈ సూచనలను పాటించవచ్చు.
1 వ దశ – ప్రశాంతంగా ఉండండి. పిల్లల దగ్గరే ఉండండి.
ఇది సాధారణమైన విషయంలా అనిపించినా, చాలా ముఖ్యం. మీరు ప్రశాంతంగా ఉంటే, మీ చుట్టూ ఉన్నవారు కూడా ప్రశాంతంగా ఉండగలరు. మూర్ఛ తగ్గి పిల్లలకు స్పృహ తిరిగి వచ్చినప్పుడు, మీ ప్రశాంతమైన వైఖరి వారికి భద్రతగా అనిపించేందుకు సహాయపడుతుంది. మూర్ఛ వచ్చినప్పుడు ఏం చేయాలో ముందుగానే తెలుసుకోవడం వల్ల, మీరు సిద్ధంగా ఉండగలరు, కంగారు పడకుండా స్పందించగలరు.
2 వ దశ – పిల్లలకు గాయాలు కాకుండా జాగ్రత్తపడండి.
పిల్లల చుట్టూ గాయాలు కలిగించే వస్తువులను తొలగించండి. ఫర్నిచర్‌ను దూరంగా జరపండి. పదునైన వస్తువులను పక్కకు పెట్టి, చుట్టూ ఉన్న ప్రదేశాన్ని ఖాళీగా ఉంచండి. మెడ చుట్టూ బిగుతుగా ఉన్న దుస్తులను వదులు చేయండి. అవి శ్వాసకు అడ్డంకి కాకుండా చూసుకోండి. పిల్లలు కళ్లద్దాలు పెట్టుకుని ఉంటే, వాటిని మెల్లగా తీసేయండి. తల కింద బట్టల వంటి మెత్తని, చదునైన వస్తువును ఉంచండి.
3 వ దశ – పిల్లలను ఒకవైపుకు తిప్పండి.
పిల్లలను మెల్లగా ఒకవైపుకు తిప్పి పడుకోబెట్టండి. దీనివల్ల శ్వాస తీసుకునే మార్గం తెరిచి ఉండేందుకు సహాయపడుతుంది. లాలాజలం గొంతులోకి వెళ్లి ఉక్కిరిబిక్కిరి కాకుండా ఉండేందుకు ఇది చాలా ముఖ్యమైన జాగ్రత్త.
4 వ దశ – మూర్ఛ ఎంతసేపు కొనసాగుతుందో గమనించండి
మూర్ఛ ప్రారంభమైన సమయాన్ని గమనించండి. మూర్ఛ 5 నిమిషాల కంటే ఎక్కువసేపు కొనసాగితే, వెంటనే వైద్య సహాయం తీసుకోండి.
సాధారణంగా మూర్ఛ కొన్ని నిమిషాల్లో తగ్గిపోతుంది. అయితే, 5 నిమిషాలు దాటితే పరిస్థితి అత్యవసరంగా మారవచ్చు.
5 వ దశ– పిల్లలను బలవంతంగా అదుపు చేయకండి
పిల్లలను గట్టిగా పట్టుకోవడం లేదా వారి కదలికలను ఆపడానికి ప్రయత్నించడం చేయకండి. మూర్ఛ వచ్చినప్పుడు అలా చేయడం వల్ల ఎముకలు విరగడం లేదా కీళ్లు స్థానభ్రంశం చెందడం వంటి గాయాలు కావచ్చు. శరీరం సహజంగా మూర్ఛ ప్రక్రియను పూర్తి చేసుకునే వరకు ఆగండి.
6 వ దశ– నోట్లో ఎలాంటి వస్తువులూ పెట్టకండి
ఇది చాలామంది చేసే సాధారణ తప్పు. కానీ, ఇది ప్రమాదకరం. నోటిని బలవంతంగా తెరవడానికి ప్రయత్నించకండి. మూర్ఛ వచ్చినప్పుడు నాలుకను మింగేయడం జరగదు. నోట్లో వస్తువులు పెట్టడం వల్ల పళ్లు విరగవచ్చు, ఉక్కిరిబిక్కిరి కావచ్చు లేదా పిల్లలకు, సహాయం చేసేవారికి గాయాలు కావచ్చు.
7 వ దశ– మూర్ఛ తగ్గే వరకు పిల్లల దగ్గరే ఉండండి
మూర్ఛ దానంతట అదే తగ్గే వరకు పిల్లల దగ్గరే ఉండండి. వారికి స్పృహ తిరిగి వస్తున్నప్పుడు ఆప్యాయంగా, ధైర్యం చెప్పేలా మాట్లాడండి.
8 వ దశ – మూర్ఛ తగ్గిన తర్వాత ధైర్యం చెప్పి, ఓదార్చండి
మూర్ఛ తగ్గిన తర్వాత, పిల్లలు కోలుకునేందుకు సురక్షితమైన ప్రదేశంలో కూర్చునేలా సహాయం చేయండి. వారికి పూర్తిగా స్పృహ వచ్చాక, ఓదార్చి ఏం జరిగిందో ప్రశాంతంగా వివరించండి.
మూర్ఛ తగ్గిన తర్వాత కొంతమంది త్వరగా కోలుకోవచ్చు. మరికొందరికి చాలా అలసటగా అనిపించవచ్చు, నిద్రపోవాలనిపించవచ్చు. కొన్ని గంటలపాటు మామూలుగా అనిపించకపోవచ్చు. ఇది సాధారణమే. పిల్లల దగ్గరే ఉండి, ప్రశాంతంగా మాట్లాడండి. వారు పూర్తిగా కోలుకునే వరకు తొందరపెట్టకండి.
పిల్లలకు పూర్తిగా స్పృహ వచ్చి, మింగగలిగే స్థితికి వచ్చే వరకు నీళ్లు లేదా ఆహారం ఇవ్వకండి. అలా ఇవ్వడం వల్ల ఉక్కిరిబిక్కిరి అయ్యే ప్రమాదం ఉంది.
మూర్ఛ సమయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు – చేయాల్సినవి , చేయకూడనివి
చేయాల్సినవి :
- మూర్ఛ పూర్తిగా తగ్గే వరకు పిల్లల దగ్గరే ఉండండి.
- గట్టిగా ఉన్న లేదా పదునైన వస్తువులను పిల్లలకు దూరంగా జరపండి.
- తల కింద మెత్తని, చదునైన వస్తువును ఉంచండి.
- పిల్లలను మెల్లగా ఒకవైపుకు తిప్పండి.
- మూర్ఛ మొదలైన సమయం నుంచి ఎంతసేపు కొనసాగుతుందో గమనించండి.
- మెడ చుట్టూ బిగుతుగా ఉన్న దుస్తులు లేదా ఇతర వస్తువులను వదులుగా చేయండి.
- పిల్లలకు స్పృహ తిరిగి వచ్చినప్పుడు ధైర్యం చెప్పి, ఓదార్చండి.
- మెడికల్ ఐడీ బ్రేస్లెట్ (వైద్య సమాచారాన్ని తెలిపే బ్రేస్లెట్) ఉందేమో చూడండి. అందులో పిల్లల ఆరోగ్య పరిస్థితి, వాడుతున్న మందులు, అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన వారి వివరాలు ఉండవచ్చు.
చేయకూడనివి :
- పిల్లల నోట్లో ఎలాంటి వస్తువులూ పెట్టకండి.
- పిల్లలను గట్టిగా పట్టుకుని, వారి కదలికలను ఆపడానికి ప్రయత్నించకండి.
- పిల్లలకు పూర్తిగా స్పృహ వచ్చే వరకు ఆహారం, నీళ్లు లేదా మందులు ఇవ్వకండి.
- పిల్లలను ఒంటరిగా వదిలేయకండి.
- భయపడకండి. చాలా సందర్భాల్లో మూర్ఛ కొన్ని నిమిషాల్లో దానంతట అదే తగ్గిపోతుంది.
ఎప్పుడు అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి?
సాధారణంగా, మూర్ఛ వచ్చిన ప్రతిసారీ అంబులెన్స్‌కు ఫోన్ చేయాల్సిన అవసరం ఉండదు. అయితే, కొన్ని పరిస్థితుల్లో వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
కింది పరిస్థితుల్లో మీ స్థానిక అత్యవసర నంబర్‌కు ఫోన్ చేయండి లేదా పిల్లలను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లండి.
- మూర్ఛ 5 నిమిషాల కంటే ఎక్కువసేపు కొనసాగితే: 5 నిమిషాలకు మించి మూర్ఛ కొనసాగినా లేదా 5 నిమిషాల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు మూర్ఛ వచ్చి, మధ్యలో పిల్లలకు పూర్తిగా స్పృహ తిరిగి రాకపోయినా అది అత్యవసర వైద్య పరిస్థితి.
- ఒకటి తగ్గకముందే మరో మూర్ఛ వస్తే: కొన్నిసార్లు మూర్ఛ ఆగకుండా కొనసాగవచ్చు లేదా మధ్యలో పూర్తిగా కోలుకోకముందే మరోసారి రావచ్చు. ఇలా 5 నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు కొనసాగితే దాన్ని స్టేటస్ ఎపిలెప్టికస్ అంటారు. ముఖ్యంగా శరీరం బిగుసుకుపోయి, కుదుపులు వచ్చే మూర్ఛలో ఇది అత్యవసర పరిస్థితి. వెంటనే వైద్య సహాయం అవసరం.
- మూర్ఛ తగ్గిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితే.
- పిల్లలకు మొదటిసారిగా మూర్ఛ వస్తే: దానికి కారణం తెలియకపోతే వెంటనే వైద్య సహాయం తీసుకోండి.
- మూర్ఛ వచ్చిన సమయంలో పిల్లలకు గాయమైతే.
- నీటిలో ఉన్నప్పుడు మూర్ఛ వస్తే: బాత్‌టబ్ లేదా స్విమ్మింగ్ పూల్‌లో కొద్దిపాటి నీటిలో ఉన్నప్పటికీ వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
సులభంగా గుర్తుంచుకోవడానికి: మీకు తెలియని వ్యక్తికి మూర్ఛ వచ్చినప్పుడు ప్రథమ చికిత్సలోని ఈ మూడు ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి – ప్రశాంతంగా ఉండండి , తలకు మెత్తని ఆధారం కల్పించండి, అవసరమైనప్పుడు అత్యవసర సహాయం కోసం ఫోన్ చేయండి.
మూర్ఛ రకాన్ని బట్టి ప్రథమ చికిత్సలో మార్పులు
వ్యక్తికి వచ్చే మూర్ఛ రకాన్ని బట్టి ప్రథమ చికిత్స చేసే విధానం మారుతుంది. సాధారణంగా కనిపించే మూర్ఛ రకాలకు అనుసరించాల్సిన ప్రథమ చికిత్స పద్ధతులు ఇవి.
1. టానిక్-క్లోనిక్ మూర్ఛ (శరీరం బిగుసుకుపోయి, కుదుపులు రావడం)
వీలైనంత త్వరగా వ్యక్తిని మెల్లగా ఒకవైపుకు తిప్పి పడుకోబెట్టండి. శ్వాస తీసుకోవడం సులభం కావడానికి, శ్వాసనాళం తెరిచి ఉండేలా గడ్డాన్ని కొద్దిగా పైకి ఎత్తండి. మూర్ఛ దానంతట అదే తగ్గే వరకు వారి దగ్గరే ఉండండి. స్పృహ తిరిగి వచ్చే వరకు ప్రశాంతంగా మాట్లాడుతూ ధైర్యం చెప్పండి.
2. ఫోకల్ మూర్ఛ (పాక్షిక అవగాహనతో కూడిన మూర్ఛ)
ఈ సమయంలో వ్యక్తి అయోమయంగా ఉండవచ్చు, శూన్యంలోకి చూస్తూ ఉండవచ్చు లేదా ఒకే కదలికను పదేపదే చేయవచ్చు. వారిని గట్టిగా పట్టుకోవద్దు లేదా కదలికలను ఆపడానికి ప్రయత్నించవద్దు. ప్రమాదకరమైన ప్రదేశం నుంచి మెల్లగా సురక్షితమైన ప్రదేశానికి తీసుకెళ్లండి. ప్రశాంతంగా మాట్లాడుతూ, వారి దగ్గరే ఉండండి. వారు సురక్షితంగా ఉన్నారని, పూర్తిగా కోలుకునే వరకు మీరు తోడుగా ఉంటారని ధైర్యం చెప్పండి.
3. అబ్సెన్స్ మూర్ఛ (కొద్దిసేపు శూన్యంలోకి చూస్తూ ఉండటం)
ఈ మూర్ఛ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని సెకన్ల పాటు వ్యక్తి శూన్యంలోకి చూస్తూ ఉండవచ్చు. ఇలా జరిగిందనే విషయం పిల్లలకు తెలియకపోవచ్చు. ఈ సమయంలో ప్రత్యేకంగా శారీరక ప్రథమ చికిత్స అవసరం లేదు. ప్రశాంతంగా ఉండి, మూర్ఛ వచ్చిన సమయాన్ని గమనించండి. పిల్లలకు తిరిగి పరిసరాలపై అవగాహన వచ్చిన తర్వాత, వారు చేస్తున్న పనిపై మెల్లగా దృష్టి మళ్లించండి.
మూర్ఛ వచ్చినప్పుడు ప్రథమ చికిత్సపై సాధారణ అపోహలు – నిజాలు
మూర్ఛ గురించి చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. వాటిలో కొన్ని నమ్మకాలు పిల్లలకు హాని కూడా కలిగించవచ్చు. కాబట్టి, వాటి వెనుక ఉన్న నిజాలను తెలుసుకుందాం.
అపోహ 1: “నాలుక మింగకుండా ఉండటానికి నోట్లో ఏదైనా పెట్టాలి.”
ఇది పూర్తిగా తప్పు, ప్రమాదకరమైన అపోహ. ఎవరూ తమ నాలుకను మింగలేరు. నోట్లో వస్తువులు పెట్టడం వల్ల తీవ్రమైన గాయాలు కలగవచ్చు.
అపోహ 2: “మూర్ఛ వ్యాధి దుష్టశక్తులు లేదా అతీంద్రియ శక్తుల వల్ల వస్తుంది.”
మూర్ఛ వ్యాధి మెదడుకు సంబంధించిన నాడీ సంబంధిత సమస్య. మెదడులో విద్యుత్ సంకేతాల అసాధారణ కార్యకలాపాల వల్ల ఇది వస్తుంది. దీనికి దుష్టశక్తులతో లేదా అతీంద్రియ శక్తులతో ఎలాంటి సంబంధం లేదు.
అపోహ 3: “మూర్ఛ వచ్చిన ప్రతిసారీ శరీరం వణుకుతుంది, వ్యక్తి కింద పడిపోతారు.”
మూర్ఛలో అనేక రకాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వ్యక్తికి అయోమయం కలగవచ్చు, చుట్టూ ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు లేదా స్పృహ కోల్పోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో కొద్దిసేపు శూన్యంలోకి చూడటం లేదా స్వల్పంగా కండరాలు కదలడం వంటి లక్షణాలు మాత్రమే కనిపించవచ్చు.
అపోహ 4: “మూర్ఛ వ్యాధి జీవితాంతం ఉంటుంది. దాన్ని నియంత్రించడం సాధ్యం కాదు.”
ఇది ఎప్పుడూ నిజం కాదు. సరైన చికిత్సతో మూర్ఛ వ్యాధి ఉన్న చాలామంది సాధారణంగా, చురుకుగా జీవించగలరు. బాల్యంలో వచ్చే కొన్ని రకాల మూర్ఛలు వయస్సు పెరిగే కొద్దీ తగ్గిపోవచ్చు లేదా పూర్తిగా ఆగిపోవచ్చు. మూర్ఛ వ్యాధి ఉన్నప్పటికీ, చాలామందికి సరైన చికిత్స అందడం లేదు. దీనివల్ల చికిత్స పొందడంలో పెద్ద అంతరం ఏర్పడుతోంది. మూర్ఛకు సంబంధించిన మందులపై అవగాహన లేకపోవడం, పేదరికం, సామాజిక నమ్మకాలు, వివక్ష, శిక్షణ పొందిన నిపుణుల కొరత వంటి అంశాలు ఇందుకు కారణమవుతున్నాయి. అందుకే మూర్ఛ వ్యాధిపై అవగాహన పెంచడం చాలా ముఖ్యం.
అపోహ 5: “మూర్ఛ వ్యాధి ఉన్న పిల్లలు పాఠశాలకు వెళ్లలేరు, ఇతర పిల్లల్లా సాధారణ జీవితం గడపలేరు.”
మూర్ఛ వ్యాధి ఉన్న పిల్లలు కూడా ఇతర పిల్లల్లాగే పాఠశాలకు వెళ్లగలరు, ఆటల్లో పాల్గొనగలరు, ఎదుగుతూ తమ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోగలరు. వారికి కావాల్సింది ఒంటరిగా ఉంచడం కాదు, సురక్షితమైన వాతావరణం, తగిన సహకారం.
భారత దేశంలో మూర్ఛ వ్యాధికి తగిన వైద్య సహాయం అందని పరిస్థితి – ప్రథమ చికిత్స ఎందుకు ముఖ్యం?
భారతదేశంలోని కుటుంబాలకు ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించడంపై ఈ విషయవివరణలో ఎందుకు ఎక్కువగా దృష్టి పెట్టామనే సందేహం మీకు రావచ్చు. దీనికి కారణం – మన దేశంలో మూర్ఛ వ్యాధికి సరైన చికిత్స అందడంలో ఇప్పటికీ లోటు ఉండటమే.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 5 కోట్ల మంది మూర్ఛ వ్యాధితో జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. భారతదేశంలో సుమారు కోటి మంది మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో చాలామందికి తగిన చికిత్స అందడం లేదు.
భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పిల్లలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో, మూర్ఛ వ్యాధి చికిత్స పొందడంలో 45.45% అంతరం ఉన్నట్లు వెల్లడైంది. అలాగే, ఈ వ్యాధిపై అవగాహన, నిర్ధారణ, చికిత్సకు సంబంధించిన అంశాల్లోనూ గణనీయమైన లోపాలు ఉన్నట్లు గుర్తించారు.
భారతదేశ జనాభాలో సుమారు 1% మందికి మూర్ఛ వ్యాధి ఉన్నట్లు అంచనా. గ్రామీణ ప్రాంతాల్లో దీని వ్యాప్తి (1.9%) పట్టణ ప్రాంతాలతో (0.6%) పోలిస్తే ఎక్కువగా ఉంది.
ఇది ఎందుకు ముఖ్యమంటే, వైద్య సేవలు ఆలస్యంగా అందినప్పుడు లేదా అందుబాటులో లేనప్పుడు, పిల్లలకు మొదటగా సహాయం అందించాల్సిన బాధ్యత సంరక్షకులపైనే ఉంటుంది. ఇంట్లో, పాఠశాలలో లేదా సమాజంలో మూర్ఛ వచ్చినప్పుడు సరైన ప్రథమ చికిత్స అందించడం వల్ల పిల్లలు వైద్యుడిని చేరుకునే వరకు సురక్షితంగా ఉండేలా చూడవచ్చు.
భారతదేశం వంటి దేశంలో సరైన అవగాహన, తగిన వైద్య సేవలు అందుబాటులో ఉంటే ఎంతో మార్పు తీసుకురావచ్చు.
మూర్ఛలను ఎలా నమోదు చేయాలి? సీజర్ డైరీ ఉపయోగం
మూర్ఛ వచ్చినప్పుడు ప్రథమ చికిత్స అందించడం ముఖ్యం. అయితే, మూర్ఛ వ్యాధి ఉన్న పిల్లలను సంరక్షించడంలో మూర్ఛలను ఎలా నిర్వహించాలో తెలుసుకోవడంతో పాటు, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించడం కూడా అవసరం. ఇందుకు మూర్ఛలకు సంబంధించిన వివరాలను నమోదు చేయడం మొదటి అడుగు.
సీజర్ డైరీ అంటే మీ పిల్లలకు మూర్ఛ వచ్చినప్పుడు సంబంధిత వివరాలను రాసుకునే ఒక సరళమైన నమోదు పుస్తకం. ఇలా వివరాలను క్రమం తప్పకుండా నమోదు చేయడం వల్ల మూర్ఛలు ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో వస్తున్నాయో వైద్యుడు అర్థం చేసుకుని, చికిత్సలో అవసరమైన మార్పులు చేయడానికి సహాయపడుతుంది.
మూర్ఛ డైరీలో ఏ వివరాలు నమోదు చేయాలి: –మూర్ఛ వచ్చిన తేదీ, సమయం – మూర్ఛ ఎంతసేపు కొనసాగింది? -మూర్ఛ ప్రారంభమయ్యే ముందు పిల్లలు ఏం చేస్తున్నారు? – మూర్ఛ వచ్చినప్పుడు ఎలా కనిపించింది? (ఉదా: శరీరం వణకడం, శూన్యంలోకి చూస్తూ ఉండటం, కింద పడిపోవడం మొదలైనవి) -మూర్ఛ రావడానికి కారణమై ఉండవచ్చని భావించే అంశాలు ఏమిటి? (ఉదా: మందులు వేసుకోవడం మర్చిపోవడం, సరిగ్గా నిద్రపోకపోవడం, జ్వరం, మెరుస్తున్న కాంతులు), మూర్ఛ తగ్గిన తర్వాత పిల్లలు పూర్తిగా కోలుకుని, సాధారణ స్థితికి రావడానికి ఎంత సమయం పట్టింది? వంటి వివరాలు నమోదు చేయాలి.
మూర్ఛ నిర్వహణ ప్రణాళికలు ద్వారా మూర్ఛలకు సంబంధించిన వివరాలను క్రమబద్ధంగా నమోదు చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు, ఎక్కడైనా ఆ సమాచారాన్ని సులభంగా అందుబాటులో ఉంచుకోవచ్చు.
నయీ దిశా ప్లాట్‌ఫామ్ నుంచి సీజర్ డైరీ నమూనాను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ డైరీని క్రమం తప్పకుండా ఉపయోగించండి. పిల్లలను వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లిన ప్రతిసారీ దానిని వెంట తీసుకెళ్లండి.
మీ పిల్లల చుట్టూ ఉన్నవారికి మూర్ఛ గురించి ఎలా అవగాహన కల్పించాలి?
తల్లిదండ్రులుగా మీరు చేయగలిగే ముఖ్యమైన పనుల్లో ఒకటి – మీ పిల్లలతో సమయం గడిపే వారికి మూర్ఛ గురించి, మూర్ఛ వచ్చినప్పుడు ఎలా స్పందించాలో ముందుగానే తెలియజేయడం.
పాఠశాలలో:
మీ పిల్లల తరగతి ఉపాధ్యాయుడు, పాఠశాల నర్సు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (P.E.T).మూర్ఛకు సంబంధించిన ప్రథమ చికిత్స వివరాలను పంచుకోండి. మీ పిల్లలకు ఎలాంటి మూర్ఛలు వస్తాయి? , సాధారణంగా మూర్ఛ ఎంతసేపు కొనసాగుతుంది? , మూర్ఛ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఏం చేయకూడదు? , మీకు ఎప్పుడు ఫోన్ చేయాలి లేదా ఎప్పుడు అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి? వంటి విషయాలను వారికి తెలియజేయండి.
మూర్ఛ సమస్య ఉన్న పిల్లల తల్లిదండ్రులు పాఠశాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మూర్ఛ నిర్వహణ ప్రణాళిక ను ఉపయోగించవచ్చు. ఈ ప్రణాళిక కాపీని పాఠశాల నర్సుకు అందించండి. దీనివల్ల పిల్లలకు మూర్ఛ వచ్చినప్పుడు సంబంధిత సిబ్బంది సరైన విధంగా స్పందించగలరు.
ఇంట్లో
తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతలు, తోబుట్టువులు, ఇంట్లో పనిచేసేవారు, తరచుగా ఇంటికి వచ్చే సందర్శకులకు మూర్ఛ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన ప్రాథమిక జాగ్రత్తలను తెలియజేయండి. వారితో కొద్దిసేపు స్పష్టంగా మాట్లాడటం కూడా ఎంతో ఉపయోగపడుతుంది.
కమ్యూనిటీలో
మీ పిల్లలు స్పోర్ట్స్ టీం లో చేరినా, డ్యాన్స్ క్లాస్‌కు వెళ్లినా లేదా ట్యూషన్‌కు వెళ్లినా, అక్కడి కోచ్ లేదా ఉపాధ్యాయులకు మూర్ఛ గురించి తెలియజేయండి. అన్ని వివరాలూ చెప్పాల్సిన అవసరం లేదు. మూర్ఛ వచ్చినప్పుడు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తే సరిపోతుంది.
మూర్ఛ వ్యాధి, సమాజంలో వివక్ష – మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని ఎలా పెంపొందించాలి?
మూర్ఛ వ్యాధి ఉన్నవారు తరచుగా వివక్ష, చిన్నచూపు, సామాజిక, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా భారతదేశంలో, మూర్ఛ వ్యాధి గురించి సమాజంలో ఉన్న కొన్ని అపోహలు, నమ్మకాల వల్ల కుటుంబాలు ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడటానికి వెనుకాడవచ్చు.
కానీ ఒక విషయం గుర్తుంచుకోండి – ఈ విషయం గురించి మౌనంగా ఉండటం వల్ల సమస్య తగ్గదు. మరింత పెరుగుతుంది. మీ పిల్లలకు మూర్ఛ వ్యాధి గురించి, మూర్ఛ వచ్చినప్పుడు ఎలా స్పందించాలో చుట్టూ ఉన్నవారికి తెలియకపోతే, వారిలో భయం ఏర్పడుతుంది. ఆ భయం వల్ల పిల్లలను ఇతరులకు దూరంగా ఉంచడం, వారిని కొన్ని కార్యకలాపాల్లో పాల్గొననివ్వకపోవడం వంటి పరిస్థితులు ఎదురవుతాయి.
మీ పిల్లలకు మూర్ఛ వ్యాధి ఉందనే విషయాన్ని ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులతో ఎంత బహిరంగంగా పంచుకుంటే, మీ పిల్లలకు అంత ఎక్కువగా అండ, సహకారం లభిస్తాయి. అండగా ఉన్నారని భావించే పిల్లలు మరింత ఆత్మవిశ్వాసంతో పాఠశాలకు వెళ్తారు, వివిధ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు, ఆందోళన కూడా తక్కువగా ఉంటుంది.
ఇటీవలి సంవత్సరాల్లో పిల్లల్లో వచ్చే మూర్ఛ వ్యాధిపై మరింత దృష్టి పెరిగింది. ఎందుకంటే ఈ పరిస్థితి పిల్లల ఆరోగ్యం, అభివృద్ధి, జీవన నాణ్యతతో పాటు వారి కుటుంబాల జీవితాలపైనా గణనీయమైన ప్రభావం చూపుతుంది.
మీ పిల్లలకు మూర్ఛ వ్యాధి ఉండటం వారి వ్యక్తిత్వంలో ఒక భాగం మాత్రమే. అదే వారి పూర్తి గుర్తింపు కాదు.
తరచుగా అడిగే ప్రశ్నలు
ప్ర: పిల్లలకు మూర్ఛ వచ్చినప్పుడు ముఖ్యంగా ఏం చేయాలి?
ప్రశాంతంగా ఉండండి. పిల్లలకు గాయం కాకుండా చూసుకోండి. వారిని నెమ్మదిగా ఒక పక్కకు తిప్పి పడుకోబెట్టండి. మూర్ఛ ఎంతసేపు కొనసాగుతుందో గమనించండి. నోట్లో ఎలాంటి వస్తువులూ పెట్టకండి.
ప్ర: సాధారణంగా మూర్ఛ ఎంతసేపు ఉంటుంది?
చాలావరకు మూర్ఛలు కొన్ని నిమిషాల్లో తగ్గిపోతాయి. అయితే, 5 నిమిషాల కంటే ఎక్కువసేపు కొనసాగితే అది అత్యవసర వైద్య పరిస్థితిగా భావించి వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
ప్ర: పిల్లలకు ప్రతిసారీ మూర్ఛ వచ్చినప్పుడు అంబులెన్స్‌కు ఫోన్ చేయాలా?
సాధారణంగా, ప్రతి మూర్ఛకూ అంబులెన్స్ అవసరం ఉండకపోవచ్చు. అయితే, మూర్ఛ 5 నిమిషాల కంటే ఎక్కువసేపు కొనసాగినా, ఒకటి తగ్గకముందే మరొకటి వచ్చినా, పిల్లలకు గాయమైనా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగినా లేదా మొదటిసారిగా మూర్ఛ వచ్చినా వెంటనే అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి.
ప్ర: మూర్ఛ వచ్చినప్పుడు నాలుకను మింగేయడం సాధ్యమేనా?
కాదు. ఇది ఒక అపోహ మాత్రమే. మూర్ఛ వచ్చినప్పుడు నోట్లో ఎలాంటి వస్తువులూ పెట్టకండి. అలా చేయడం వల్ల ఊపిరి సరిగా అందక పోవచ్చు. ప్రమాదం లేదా గాయం కలగవచ్చు.
ప్ర: స్టేటస్ ఎపిలెప్టికస్ అంటే ఏమిటి?
మూర్ఛ 5 నిమిషాల కంటే ఎక్కువసేపు కొనసాగడం లేదా ఒక మూర్ఛ తగ్గి పూర్తిగా కోలుకోకముందే మరో మూర్ఛ రావడాన్ని స్టేటస్ ఎపిలెప్టికస్ అంటారు. ఇది అత్యవసర వైద్య పరిస్థితి. వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి.
ప్ర: పిల్లలకు వచ్చే మూర్ఛల వివరాలను ఎలా నమోదు చేయాలి?
మూర్ఛ డైరీలో తేదీ, సమయం, మూర్ఛ ఎంతసేపు కొనసాగింది, దానికి ముందు ఏం జరిగింది, పిల్లలు పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పట్టింది వంటి వివరాలను నమోదు చేయండి. నయీ దిశా వెబ్సైట్ నుంచి ఉచిత మూర్ఛ డైరీ నమూనాను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్ర: పిల్లలకు మూర్ఛ సమస్య ఉందని పాఠశాల వారికి ఏం చెప్పాలి?
పిల్లలకు ఎలాంటి మూర్ఛలు వస్తాయి, సాధారణంగా ఎంతసేపు కొనసాగుతాయి, మూర్ఛ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎప్పుడు అత్యవసర వైద్య సహాయం తీసుకోవాలి వంటి వివరాలను ఉపాధ్యాయులకు తెలియజేయండి. పాఠశాల నర్సుకు లేదా బాధ్యతగల సిబ్బందికి మూర్ఛ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన చర్యల ప్రణాళికను రాతపూర్వకంగా అందించండి.
ప్ర: మూర్ఛ సమస్య ఉన్న పిల్లలు ఇతర పిల్లల్లాగే సాధారణ జీవితం గడపగలరా?
అవును. సరైన చికిత్స, సహకారం అందితే మూర్ఛ సమస్య ఉన్న చాలా మంది పిల్లలు పాఠశాలకు వెళ్లగలరు, ఆటల్లో పాల్గొనగలరు, ఇతర పిల్లల్లాగే ఎదుగుతూ తమ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోగలరు.
మరింత సహాయం అవసరమా?
మూర్ఛ వ్యాధి, ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD లేదా ఇతర అభివృద్ధి సంబంధిత పరిస్థితుల గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే, నయీ దిశ బృందం మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది.
మా ఉచిత హెల్ప్‌లైన్‌కు కాల్ చేయండి లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి: 844-844-8996
మా కౌన్సెలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు, బెంగాలీ భాషల్లో మాట్లాడగలరు.
అంతేకాకుండా, మూర్ఛ వ్యాధి గురించి మరింత తెలుసుకోవడానికి, అవగాహన పెంచుకోవడానికి ఈ వీడియోలను (ఇంగ్లీషులో) కూడా చూడండి.
కృతజ్ఞతలు
ఈ సమాచారాన్ని తెలుగులోకి అనువదించిన మా వాలంటీర్లు శ్రీమతి శైలజ తాడిమేటి, శ్రీ కృష్ణాజీ దేవాల్కర్ గారికి, హిందీలోకి అనువదించిన శ్రీమతి ప్రేరణ చౌక్, శ్రీమతి హేమంత నిఝావన్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి సహకారం వల్ల భారతదేశంలోని మరిన్ని కుటుంబాలకు ఈ సమాచారం అందుబాటులోకి వస్తోంది.
గమనిక: ఈ విషయవివరణ అవగాహన మరియు సమాచారం కోసం మాత్రమే. మూర్ఛ వ్యాధి లేదా మూర్ఛలకు సంబంధించిన వ్యక్తిగత వైద్య సలహా, నిర్ధారణ, చికిత్స కోసం ఎల్లప్పుడూ అర్హత కలిగిన వైద్య నిపుణులను సంప్రదించండి.