Skip to main content
Install App
If you're using:

ADHD గురించి తెలుసుకుందాం – సంకేతాలను ఎలా గుర్తించాలి?

FaridaRaj_SEducator

फरीदा राज

इस भाषा में उपलब्ध है English
Like Icon 0पसंद किया गया

महत्वपूर्ण जानकारी

  1. ADHD అనేది నాడీ అభివృద్ధికి సంబంధించిన సాధారణ పరిస్థితి. ఇది ఏకాగ్రత, భావోద్వేగాలను నియంత్రించుకోవడం, నేర్చుకోవడం, ఇతరులతో కలిసిమెలిసి ఉండడం వంటి అంశాలపై ప్రభావం చూపుతుంది.
  2. ADHD ఉన్న పిల్లలకు ఏకాగ్రతతో ఉండటం, పనులు పూర్తి చేయడం, పాఠశాలలో మరియు తోటి పిల్లలతో సంబంధాలను కొనసాగించడం వంటి విషయాల్లో ఇబ్బందులు ఎదురుకావచ్చు.
  3. ADHD సంకేతాలను గుర్తించడం ద్వారా పిల్లలకు అవసరమైన సహాయం, తగిన వెసులుబాట్లు కల్పించవచ్చు.
  4. ప్రతి పిల్లలూ ప్రత్యేకమైనవారే. ADHD సంకేతాలు ఒక్కో పిల్లలో ఒక్కోలా కనిపిస్తాయి. కొన్ని సంకేతాల ఆధారంగా మాత్రమే ఈ పరిస్థితిని అంచనా వేయలేం.
  5. మీ పిల్లల్లో ఇక్కడ పేర్కొన్న పలు సంకేతాలు కనిపిస్తే, నిపుణులను సంప్రదించి అంచనా చేయించుకోవడం ద్వారా స్పష్టత, సరైన మార్గదర్శకత్వం పొందవచ్చు.
  6. ADHDలో మూడు రకాలు ఉన్నాయి: ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది పడే రకం, చాలా చురుకుగా ఉండటం, ఆలోచించకుండా వెంటనే స్పందించే రకం, పై రెండు విధాలుగా కనిపించే మిశ్రమ రకం  
  7. ADHD గురించి మరింతగా అర్థం చేసుకోవడానికి ఫ్యాక్ట్‌షీట్లు, నిపుణులు అందించే వీడియోలు ఉపయోగపడతాయి.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [534.58 KB]

పైన ఇచ్చిన సమాచారం ద్వారా ADHD గురించి, దాని లక్షణాలను ఎలా గుర్తించాలో తెలుసుకోవచ్చు.

ADHD అంటే ఏమిటి?

అటెన్షన్ డెఫిసిట్ హైపరాక్టివిటీ డిజార్డర్ (ADHD)  అనేది నాడీ అభివృద్ధికి సంబంధించిన పరిస్థితి. ఇది పిల్లల ఏకాగ్రత, భావోద్వేగాలను నియంత్రించుకోవడం, నేర్చుకోవడం, ఇతరులతో కలిసిమెలిసి ఉండడం వంటి అంశాలపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల పాఠశాలలో పిల్లల అనుభవాలు, తోటి పిల్లలతో సంబంధాలు ఒక్కోలా ఉండవచ్చు. ADHD ఉన్న పిల్లలు ఏకాగ్రత పెట్టడం, పనులను పూర్తి చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఇతర పిల్లల కంటే భిన్నమైన విధానాలను అనుసరించవచ్చు. చదువులోనూ వారి ప్రయాణం ఒక్కోలా ఉండవచ్చు. ADHD గురించి తెలుసుకుని, అర్థం చేసుకోవడం వల్ల పిల్లలకు తగిన సహాయం అందించవచ్చు.

ADHD రకాలు

ప్రధానంగా కనిపించే సంకేతాలను బట్టి ADHDని మూడు రకాలుగా విభజిస్తారు.

1. ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బందులు ఎక్కువగా కనిపించే రకం

  • ఒక పని నుంచి మరో పనికి మారుతూ, ఆలోచనలు వివిధ రకాలుగా మారిపోవచ్చు.

ఉదాహరణ: ఒక పిల్లవాడు రకరకాల ఆర్ట్ పనులు చేయడానికి ఆసక్తి చూపవచ్చు. కానీ ఒక పనిని పూర్తి చేయకముందే మరో పనిని మొదలుపెట్టవచ్చు.

  • సమాచారాన్ని ఇతరుల కంటే భిన్నమైన క్రమంలో అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల సమయాన్ని సరిగ్గా నిర్వహించడం, పనులను క్రమబద్ధంగా పూర్తి చేయడం కష్టమవచ్చు.

ఉదాహరణ:తరగతిలో పగటి కలల్లో మునిగిపోయి, సమయం గడిచిపోతున్న విషయాన్ని గమనించకపోవచ్చు.

2. అధిక చురుకుదనం, ఆలోచించకుండా వెంటనే స్పందించే సంకేతాలు ఎక్కువగా కనిపించే రకం

  • ఎక్కువ ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు. చుట్టూ జరుగుతున్న విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు.

ఉదాహరణ: తరగతి గదిలో తరచూ సీటులో నుంచి లేచి నిలబడటం లేదా తమ వంతు కోసం ఎదురుచూడకుండా ఉత్సాహంగా మాట్లాడటం.

  • వెంటనే స్పందించడం, ఉత్సాహంగా మాట్లాడటం, కదలికలతో కూడిన పనులను ఇష్టపడటం వంటివి కనిపించవచ్చు.

ఉదాహరణ: ఎప్పుడూ కదులుతూ ఆడే ఉత్సాహభరితమైన ఆటలను ఇష్టపడవచ్చు.

3. మిశ్రమ రకం

  • ఏకాగ్రతకు సంబంధించిన సంకేతాలతో పాటు, అధిక చురుకుదనం, ఆలోచించకుండా వెంటనే స్పందించే సంకేతాలు కూడా కనిపిస్తాయి.

ఉదాహరణ: ఒక పిల్లవాడు సృజనాత్మక పనుల మధ్య తరచూ మారుతూ, కదలికలతో కూడిన ఆటలను కూడా ఇష్టపడవచ్చు. అంటే, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో పాటు చాలా చురుకుగా ఉండవచ్చు.

  • ఈ రకంలో పై రెండు రకాల సంకేతాలు కలిపి కనిపించవచ్చు.

ఉదాహరణ: కొన్నిసార్లు ఎంతో ఉత్సాహంగా ఉంటూ, మరికొన్ని సందర్భాల్లో ఏకాగ్రత కోల్పోవచ్చు.

ADHD సంకేతాలను ఎలా గుర్తించాలి?

ADHD సంకేతాలు ప్రతి పిల్లలో వారి స్వభావం, ఎదుగుదల దశను బట్టి భిన్నంగా కనిపించవచ్చు. అయితే, సాధారణంగా కనిపించే కొన్ని సంకేతాలు ఇవి:

ఏకాగ్రతకు సంబంధించిన సంకేతాలు

  • ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది ముఖ్యంగా, ఎక్కువ సేపు  ఒక పనిపై దృష్టి పెట్టడం కష్టంగా ఉండటం.
  • వస్తువులను తరచుగా ఎక్కడ పెట్టారో మర్చిపోవడం లేదా రోజువారీ పనులను మర్చిపోవడం.
  • పరిచయమైన పరిస్థితుల్లో కూడా ఆసక్తి లేనట్లుగా లేదా దృష్టి మరలినట్లుగా కనిపించడం.

అధిక చురుకుదనానికి సంబంధించిన సంకేతాలు

  • చేతులు, కాళ్లు కదపడం, అటూ ఇటూ తిరగడం, టేబుల్‌పై చేతులతో తట్టడం వంటి కదలికలు తరచుగా చేస్తుండటం.
  • క్రమబద్ధమైన పరిస్థితుల్లో ఒకచోట కూర్చుని లేదా కదలకుండా ఉండడం కష్టంగా ఉండటం.
  • శారీరకంగా చురుకుగా పాల్గొనే ఆటలు, కార్యకలాపాలను ఇష్టపడటం.

ఆలోచించకుండా వెంటనే స్పందించడానికి సంబంధించిన సంకేతాలు

  • పరిణామాల గురించి ఆలోచించకుండా మాట్లాడటం లేదా ఏదైనా చేయడం, ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడటం.
  • తమ వంతు కోసం వేచి ఉండటం లేదా ముందుగా నిర్ణయించిన నియమాలను పాటించడం కష్టంగా ఉండటం.
  • భావోద్వేగాలకు వెంటనే స్పందించడం, కొన్నిసార్లు దాంతో చిరాకు లేదా కోపం బయటపడటం.

అదనంగా గమనించాల్సిన కొన్ని అంశాలు

  • భావోద్వేగాలను నియంత్రించుకోవడం: ADHD ఉన్న పిల్లలకు భావోద్వేగాలు తీవ్రంగా అనిపించవచ్చు. చిరాకు లేదా నిరాశను నియంత్రించుకోవడం కష్టంగా ఉండవచ్చు.
  • సమయాన్ని అంచనా వేయడం: ఒక పని పూర్తిచేయడానికి ఎంత సమయం పడుతుందో అంచనా వేయడం లేదా ఒక పని నుంచి మరో పనికి మారడం కష్టంగా ఉండవచ్చు.
  • పనులను పూర్తి చేయడంలో మార్పులు: పిల్లల ఆసక్తి, పరిసరాలు, శక్తిని బట్టి పనులను పూర్తి చేసే సామర్థ్యం మారుతూ ఉండవచ్చు.

సమగ్ర అంచనా ఎందుకు ముఖ్యం?

సమగ్రంగా, పిల్లల అవసరాలకు అనుగుణంగా చేసే అంచనా ద్వారా ADHDకు సంబంధించిన సంకేతాలతో పాటు, పిల్లల ప్రత్యేక సామర్థ్యాలు, వారికి అవసరమైన సహాయాన్ని కూడా గుర్తించవచ్చు. దీంతో పిల్లల చదువు, భావోద్వేగ శ్రేయస్సు, ఎదుగుదలకు అనుగుణంగా వ్యక్తిగత సహాయక పద్ధతులను రూపొందించవచ్చు. ADHDను ముందుగానే గుర్తించడం వల్ల కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు పిల్లల సామర్థ్యాలకు అనుగుణంగా అవసరమైన వెసులుబాట్లు, సహాయక వ్యవస్థలు, ఇతర సహాయ మార్గాలను అందించగలరు. ఇది పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించేందుకు తోడ్పడుతుంది.

ప్రారంభంలోనే ADHDను గుర్తించడం 

ADHDను ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల పిల్లలు తమ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకునేలా అనుకూలమైన, సహాయక వాతావరణాన్ని కల్పించవచ్చు. ADHDను ముందుగానే గుర్తించడం ద్వారా తల్లిదండ్రులు, సంరక్షకులు, ఉపాధ్యాయులు పిల్లలు ఎలా నేర్చుకుంటారు, వారికి ఎలాంటి ఇంద్రియ (సెన్సరీ) అనుభవాలు అనుకూలంగా ఉంటాయి, వారి భావోద్వేగ అవసరాలు ఏమిటి అనే విషయాలను బాగా అర్థం చేసుకోగలరు. ADHDను ముందుగానే గుర్తించినప్పుడు, పిల్లల్లో కనిపించే ఇబ్బందులను మాత్రమే నియంత్రించడంపై దృష్టి పెట్టకుండా, వారి భిన్నమైన ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుని, అంగీకరించి, వారికి తగిన సహాయం అందించడంపై దృష్టి పెట్టవచ్చు.

ప్రారంభంలోనే ADHDను గుర్తించడం వల్ల కలిగే ప్రయోజనాలు

  1. అనుకూల సహాయం: 

ADHDను ముందుగానే గుర్తించడం వల్ల పిల్లలు సహజంగా నేర్చుకునే విధానానికి అనుగుణంగా వ్యక్తిగత సహాయక పద్ధతులను రూపొందించవచ్చు. సెన్సరీ విరామాలు, క్రమబద్ధమైన రోజువారీ పనుల వంటి వెసులుబాట్లు కల్పించడం ద్వారా రోజువారీ పనులను సులభంగా చేసుకోవచ్చు.

  1. భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో సహాయం:

ADHDను ముందుగానే గుర్తించడం వల్ల, పిల్లలు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో కుటుంబ సభ్యులు తోడ్పడవచ్చు. క్రమబద్ధమైన, ముందుగా ఊహించగలిగే రోజువారీ పద్ధతులను పాటించడం వంటి మార్గాల ద్వారా పిల్లలు ప్రశాంతంగా ఉండేందుకు, క్రమంగా ఎదగడానికి సహాయం చేయవచ్చు.

  1. సామాజిక నైపుణ్యాల అభివృద్ధి:

ADHDను ముందుగానే అర్థం చేసుకోవడం వల్ల సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేసే పద్ధతులను పిల్లలకు నేర్పించవచ్చు. దీనివల్ల తోటి పిల్లలతో కలిసిమెలిసి ఉండే సమయంలో పిల్లలు మరింత ఆత్మవిశ్వాసంతో వ్యవహరించగలరు.

  1. అందరికీ అనుకూలమైన అభ్యాస వాతావరణం:

ADHDను ముందుగానే గుర్తించడం వల్ల పిల్లలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా నేర్చుకుంటారనే విషయాన్ని అర్థం చేసుకుని, అందరికీ అనుకూలమైన పద్ధతులను అనుసరించవచ్చు. దీంతో పిల్లలు ఎదగడానికి సహాయక వాతావరణం ఏర్పడుతుంది.

  1. తమ గురించి అవగాహన పెంపొందించుకోవడం:

చిన్న వయస్సు నుంచే తమ ప్రత్యేక సామర్థ్యాలు, ఇష్టాలు, అవసరాలను అర్థం చేసుకోవడం ద్వారా పిల్లల్లో తమపై సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది. అలాగే, తమకు అవసరమైన సహాయాన్ని ఇతరులకు చెప్పడం, తమ అవసరాల కోసం మాట్లాడటం కూడా నేర్చుకుంటారు.

ADHD గురించి, దాని సంకేతాలను ఎలా గుర్తించాలో మరింత తెలుసుకోవడానికి ఈ ప్రెజెంటేషన్ కూడా చూడవచ్చు. అలాగే, ADHD గురించి డా. హరిణి అత్తూరు గారు తెలుగులో అందించిన వీడియోలు కూడా చూడవచ్చు.

గమనిక: ADHD, ఇతర అభ్యాస వ్యత్యాసాలకు సంబంధించిన సంకేతాలు ఒక్కో పిల్లలో ఒక్కోలా కనిపించవచ్చు. పిల్లలు ప్రతి ఒక్కరు ప్రత్యేకమే. కొన్ని సంకేతాల ఆధారంగా మాత్రమే ADHDను నిర్ధారించలేం. అయితే, ఈ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్న పలు సంకేతాలు మీ పిల్లల ప్రవర్తనతో సరిపోలుతున్నట్లు అనిపిస్తే, నిపుణులను సంప్రదించి అంచనా వేయించుకోవడం ద్వారా స్పష్టతతో పాటు తగిన మార్గదర్శకత్వం పొందవచ్చు.

మీకు ఆటిజం, డౌన్ సిండ్రోమ్,ADHD. లేదా ఇతర మేధో వైకల్యాలు గురించి సందేహాలు ఉన్నా లేదా చిన్నారి అభివృద్ధిలో ఆలస్యం ఉందని అనుమానం ఉన్నా నయీ దిశా టీమ్ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీ ప్రశ్నలు లేదా సందేహాల కోసం దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ నంబర్‌ 844-844-8996 కు కాల్ చేయండి లేదా వాట్సాప్‌లో సంప్రదించండి.మా కౌన్సిలర్లు ఆంగ్లం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషల్లో మాట్లాడగలరు.

గమనిక: దయచేసి గమనించండి, ఈ విషయ వివరణ సమాచారం ఇవ్వడానికి మాత్రమే. సరైన మార్గదర్శకత కోసం అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

ब्लॉग लिखें

आपके जैसे अन्य माता पिता के साथ अपने अनुभव साझा करें

हिन्दी