Skip to main content
Install App
If you're using:

డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి? – మీ పిల్లల నిర్ధారణను అర్థం చేసుకోవడానికి గైడ్

Default Avatar

डॉ. अजय शर्मा

इस भाषा में उपलब्ध है हिंदी English
Like Icon 1पसंद किया गया

महत्वपूर्ण जानकारी

  1. డౌన్ సిండ్రోమ్ జన్యుపరమైన పరిస్థితి- సాధారణంగా, 21వ క్రోమోజోమ్ అదనపు ప్రతి (కాపీ) గా ఉండటం వల్ల ఇది ఏర్పడుతుంది. దీన్ని ట్రైసోమీ 21  అంటారు.
  2. సాధారణ సంకేతాలు: ముఖ ఆకృతిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు, పైవైపు వాలినట్లుగా కనిపించే కళ్లు, కండరాల బలం తక్కువగా ఉండటం, అభివృద్ధిలో ఆలస్యం వంటి సంకేతాలు కనిపించవచ్చు. పిల్లలు అందరు తమదైన ప్రత్యేకతలతో ఉంటారు. సంకేతాలు ఒక్కో పిల్లలో ఒక్కోలా ఉండవచ్చు.
  3. డౌన్ సిండ్రోమ్ రకాలు: ఇందులో మూడు రకాలు ఉన్నాయి: ట్రైసోమీ 21, ట్రాన్స్‌లోకేషన్ (స్థానాంతరం), మోసాయిక్ డౌన్ సిండ్రోమ్.
  4. ఎప్పుడు సహాయం తీసుకోవాలి? పిల్లల అభివృద్ధిలో ఆలస్యం లేదా ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కనిపిస్తే, పిడియాట్రిషియన్ లేదా అభివృద్ధికి సంబంధించిన నిపుణుడిని సంప్రదించండి.
  5. ప్రారంభ దశలోనే సహాయం అందించడం ముఖ్యం: ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటి థెరపీలు పిల్లల ఎదుగుదలకు, నేర్చుకునే నైపుణ్యాలకు, రోజువారీ పనులను చేసుకునే సామర్థ్యానికి ఎంతో తోడ్పడతాయి.
Loader Loading...
EAD Logo Taking too long?

Reload Reload document
| Open Open in new tab

Download [408.63 KB]

మీ పిల్లలకు డౌన్ సిండ్రోమ్ ఉన్నట్లు నిర్ధారణ అయిందా?

మీరు ఈ పదాన్ని మొదటిసారిగా వింటుండవచ్చు. లేదా దీని గురించి కొంతవరకు తెలిసి ఉండవచ్చు. ఇప్పుడు మీ పిల్లలకు, మీ కుటుంబానికి దీని అర్థం ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో ఉండవచ్చు.

ఈ విషయ వివరణ ద్వారా మీకు స్పష్టమైన, గౌరవప్రదమైన సమాచారాన్ని అందించి, మీకు అవసరమైన తోడ్పాటును అందించాలనుకుంటున్నాం.

డౌన్ సిండ్రోమ్ అంటే ఏమిటి?

డౌన్ సిండ్రోమ్ (DS) అనేది జన్యుపరమైన పరిస్థితి. సాధారణంగా ఉండే రెండు ప్రతులకు (కాపీలు) బదులుగా, 21వ క్రోమోజోమ్ అదనంగా ఒక కాపీని కలిగి ఉండటం వల్ల ఇది ఏర్పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా కనిపించే క్రోమోజోమ్ సంబంధిత భిన్నత్వాల్లో ఇది ఒకటి. 

డౌన్ సిండ్రోమ్‌లో అత్యంత సాధారణమైన రకం ట్రైసోమీ 21. ఈ రకంలో శరీరంలోని ప్రతి కణంలో సాధారణంగా ఉండే రెండింటికి బదులుగా 21వ క్రోమోజోమ్ మూడు కాపీలు ఉంటాయి.

ఈ జన్యుపరమైన భిన్నత్వం శరీరం, మెదడు అభివృద్ధి చెందే విధానంపై ప్రభావం చూపుతుంది. డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలు తమదైన వేగంతో నేర్చుకుంటూ, ఎదుగుతూ ఉంటారు. కొన్ని అభివృద్ధి దశలను చేరుకోవడానికి వారికి మరికొంత సమయం పట్టవచ్చు. సరైన సహాయం, తోడ్పాటు అందితే వారు తమ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకుంటూ చక్కగా ఎదగగలరు.

డౌన్ సిండ్రోమ్ సంకేతాలు ఏమిటి?

ప్రతి పిల్లవారి ఎదుగుదల, అభివృద్ధి ఒక్కోలా ఉంటాయి. డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలందరిలోనూ ఒకే రకమైన లక్షణాలు కనిపించవు. అయితే, సాధారణంగా కనిపించే కొన్ని సంకేతాలు ఇవి:

  • కండరాల బలం తక్కువగా ఉండటం (ముఖ్యంగా శిశువుల్లో)
  • ముఖం చదునుగా కనిపించడం
  • కళ్లు పైవైపుకు వాలినట్లుగా ఉండటం
  • అరచేతిపై ఒకే లోతైన మడత ఉండటం
  • అదే వయస్సు పిల్లలతో పోలిస్తే ఎత్తు లేదా చేతులు, కాళ్ల పొడవు తక్కువగా ఉండటం
  • మాటలు నేర్చుకోవడంలో, కదలికల అభివృద్ధిలో ఆలస్యం

ఈ శారీరక లక్షణాలే పిల్లల ప్రత్యేకతను లేదా వారి సామర్థ్యాలను నిర్ణయించవు. వారి ఎదుగుదలలో ప్రేమ, శ్రద్ధ, సరైన సహాయం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

పిల్లలు కూర్చోవడం, నడవడం లేదా మాట్లాడటం వంటి ప్రారంభ అభివృద్ధి దశలను చేరుకోవడంలో ఆలస్యం కనిపిస్తే, ఆ విషయాన్ని మీ వైద్యుడితో లేదా అభివృద్ధికి సంబంధించిన నిపుణుడితో ప్రశాంతంగా చర్చించండి. ముందుగానే గుర్తించడం వల్ల పిల్లలకు సరైన సమయంలో అవసరమైన సహాయం అందించవచ్చు.

డౌన్ సిండ్రోమ్ రకాలు

డౌన్ సిండ్రోమ్‌లో మూడు రకాలు ఉన్నాయి. ఈ మూడు రకాలలోనూ 21వ క్రోమోజోమ్‌కు సంబంధించిన అదనపు జన్యు పదార్థం ఉంటుంది. అయితే, ఈ మార్పు ఏర్పడే విధానం ఒక్కో రకంలో ఒక్కోలా ఉంటుంది.

  1. ట్రైసోమీ 21 (అత్యంత సాధారణమైన రకం. సుమారు 95% కేసులు) : శరీరంలోని ప్రతి కణంలో 21వ క్రోమోజోమ్ మూడు కాపీలు ఉంటాయి.
  2. ట్రాన్స్‌లోకేషన్ డౌన్ సిండ్రోమ్ (స్థానాంతరం) (సుమారు 3–4% కేసులు) : 21వ క్రోమోజోమ్‌లోని ఒక భాగం మరో క్రోమోజోమ్‌కు అంటుకుని ఉంటుంది. మొత్తం క్రోమోజోమ్‌ల సంఖ్య 46గానే ఉన్నప్పటికీ, 21వ క్రోమోజోమ్‌కు సంబంధించిన అదనపు జన్యు పదార్థం వల్ల డౌన్ సిండ్రోమ్‌కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి.
  3. మోసాయిక్ డౌన్ సిండ్రోమ్   (సుమారు 1–2% కేసులు) : కొన్ని కణాల్లో సాధారణంగా ఉండే 46 క్రోమోజోమ్‌లు ఉంటాయి. మరికొన్ని కణాల్లో అదనపు 21వ క్రోమోజోమ్‌తో కలిపి 47 క్రోమోజోమ్‌లు ఉంటాయి. దీనివల్ల అభివృద్ధిలో కనిపించే భిన్నత్వాలు కొంత తక్కువగా ఉండవచ్చు.

డౌన్ సిండ్రోమ్ రకాన్ని బట్టి పిల్లలకు ఎంత సహాయం లేదా థెరపీ అవసరమవుతుందో నిర్ణయించలేం. ప్రతి పిల్లలకి ప్రత్యేకమైన సామర్థ్యాలు, ఇబ్బందులు, అవసరాలు ఉంటాయని తెలుసుకోవడం ముఖ్యం.

ప్రారంభ దశలోనే సహాయం అందించడం ఎందుకు ముఖ్యం?

డౌన్ సిండ్రోమ్ ఉన్నట్లు నిర్ధారణ అయినప్పుడు తల్లిదండ్రులకు ఎన్నో భావాలు కలగవచ్చు. పిల్లల భవిష్యత్తు గురించి అనిశ్చితి, ఆందోళన, భయం కలగవచ్చు. పిల్లలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలనిపించవచ్చు. ఇలాంటి భావాలు కలగడం సహజమే.

ఈ ప్రారంభ దశలో మీ పిల్లలకు, అలాగే సంరక్షకులుగా మీకు కూడా సరైన సహాయం, తోడ్పాటు అందడం చాలా ముఖ్యం.

ప్రారంభ దశలో సహాయం అంటే పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ల వయస్సు వరకు అభివృద్ధిలో భిన్నత్వాలు ఉన్న పిల్లలకు అందించే వివిధ థెరపీలు, సహాయక సేవలు. పరిశోధనలు, అనుభవాలు డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు చిన్న వయస్సులోనే ఈ సహాయం ప్రారంభించడం ఎంతో ప్రయోజనకరమని తెలియజేస్తున్నాయి.

ప్రారంభ దశలో అందించే సహాయాలు

  • ఫిజియోథెరపీ: కండరాల బలాన్ని, శరీర భంగిమను మెరుగుపరచడంతో పాటు పాకడం, కూర్చోవడం, నడవడం వంటి కదలికల నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది.
  • స్పీచ్, లాంగ్వేజ్ థెరపీ: ఇతరులతో సంభాషించడం, ఆహారం తీసుకోవడం, భాషను అర్థం చేసుకోవడం వంటి నైపుణ్యాలను మెరుగుపరచడంలో తోడ్పడుతుంది.
  • ఆక్యుపేషనల్ థెరపీ: తినడం, దుస్తులు ధరించడం, ఆడుకోవడం వంటి రోజువారీ పనులను నేర్చుకోవడంలో సహాయపడుతుంది. అలాగే ఇంద్రియ నియంత్రణ, మోటార్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడంపై కూడా దృష్టి పెడుతుంది.
  • ప్రత్యేక విద్య లేదా ప్రారంభ అభ్యాస కార్యక్రమాలు: పిల్లల నేర్చుకునే విధానానికి అనుగుణంగా, పాఠశాలకు సిద్ధం కావడానికి తోడ్పడతాయి.

ఈ థెరపీల ద్వారా మీ పిల్లలను ఒక నిర్దిష్టమైన పద్ధతిలో మార్చాలని కాదు. వారి అవసరాలకు అనుగుణంగా ఎదగడానికి, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయం అందిస్తారు.

గుర్తుంచుకోండి: పిల్లలు ఆటపాటలు, ప్రేమ, ఆప్యాయతతో కూడిన అనుబంధం, సురక్షితమైన వాతావరణం ద్వారా బాగా నేర్చుకుంటారు. థెరపీలను సున్నితంగా, క్రమం తప్పకుండా అందిస్తూ, వాటిని పిల్లల రోజువారీ జీవితంలో భాగం చేసినప్పుడు మరింత ప్రయోజనం కలుగుతుంది.

కుటుంబాలకు ఏవి సహాయపడతాయి?

  • చిన్న చిన్న విషయాలతో ప్రారంభించండి: మొదటి రోజే అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కో విషయాన్ని నెమ్మదిగా తెలుసుకుంటూ ముందుకు సాగండి.
  • మీకు తోడుగా ఉండే సహాయక బృందాన్ని ఏర్పరచుకోండి: ఇందులో థెరపిస్టులు, పీడియాట్రిషియన్లు, సమాజంలోని సహాయక బృందాలు, ముఖ్యంగా మీలాంటి అనుభవాలను ఎదుర్కొంటున్న ఇతర తల్లిదండ్రులు ఉండవచ్చు.
  • రోజువారీ దినచర్యను అలవాటు చేయండి: డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలకు ముందుగా ఏమి జరగబోతోందో తెలిసేలా ఉండటం, ఒక క్రమాన్ని పాటించడం సాధారణంగా సహాయపడతాయి.
  • ప్రతి చిన్న విజయాన్నీ గుర్తించి ఆనందించండి: మీ పిల్లల అభివృద్ధి ఇతర పిల్లలతో పోలిస్తే భిన్నంగా ఉండవచ్చు. అయినప్పటికీ, వారు సాధించే ప్రతి చిన్న అడుగూ విలువైనదే.

డౌన్ సిండ్రోమ్ గురించి అపోహలు, పక్షపాత ధోరణులు

డౌన్ సిండ్రోమ్ గురించి ఇప్పటికీ కొన్ని పాతకాలపు అపోహలు ఉన్నాయి. డౌన్ సిండ్రోమ్ ఉన్నవారు నేర్చుకోలేరు, ఉద్యోగాలు చేయలేరు లేదా సంతృప్తికరమైన జీవితాన్ని గడపలేరు అని కొందరు భావిస్తారు. కానీ ఇవి నిజం కాదు.

డౌన్ సిండ్రోమ్ ఉన్నవారు పాఠశాలకు వెళ్తారు, స్నేహాలు చేసుకుంటారు, ఇతరులతో సంబంధాలను ఏర్పరచుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, సమాజంలోని కార్యకలాపాల్లో పాల్గొంటారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించే వాతావరణం, సరైన సహాయం అందితే వారు ఆత్మవిశ్వాసంతో, ఆనందంగా, స్వతంత్రంగా జీవించే పెద్దవారిగా ఎదగగలరు.

డౌన్ సిండ్రోమ్ గురించి ఉన్న అపోహలు, వాటిని అధిగమించిన వ్యక్తుల స్ఫూర్తిదాయక కథనాల గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ (ఇంగ్లిష్ లో) చదవండి, చూడండి.

సహాయం, తదుపరి చర్యలు

పైన ఇచ్చిన డౌన్ సిండ్రోమ్ ఫ్యాక్ట్‌షీట్‌ను చదివి, డౌన్ సిండ్రోమ్ సంకేతాలు, కారణాలు, థెరపీలు, మీ పిల్లల అవసరాలు, ఎదుగుదలకు అందుబాటులో ఉన్న సహాయం గురించి మరింత తెలుసుకోవడానికి దాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి.

డౌన్ సిండ్రోమ్ ఉన్న పిల్లలను పెంచడానికి ఒకే సరైన పద్ధతి అంటూ ఏమీ లేదు. మీపై మీకు నమ్మకం ఉంచండి. కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉండండి. అవసరమైనప్పుడు సహాయం కోరండి. మీరు మీ పిల్లల కోసం చేయగలిగినంత ఉత్తమంగా చేస్తున్నారు. 

ప్రేమ, ఓర్పు, సరైన సహకారం తోడైతే మీ పిల్లలు సంపూర్ణమైన, అర్థవంతమైన జీవితాన్ని గడపగలరు.

కృతజ్ఞతలు: ఈ సమాచారాన్ని రూపొందించడంలో నిపుణుల సలహా, మార్గదర్శకత్వం అందించిన కన్సల్టెంట్ న్యూరో డెవలప్‌మెంటల్ పిడియాట్రిషియన్‌కు డా. అజయ్ శర్మ,  మా ప్రత్యేక కృతజ్ఞతలు. 

ఈ సమాచారాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించడానికి తమ సమయాన్ని, శ్రమను కేటాయించిన మా వాలంటీర్లు శ్రీ సత్య వేమూరు, శ్రీమతి శైలజ తాడిమేటిలకు మా ధన్యవాదాలు.

ఆటిజం, డౌన్ సిండ్రోమ్, ADHD, లేదా పిల్లలలో అభివృద్ధి ఆలస్యం గురించి మీకు ఆందోళనలు ఉంటే, నయీ దిశా బృందం మీకు సహాయం చేయడానికి మీ వద్ద ఉంది. ఏవైనా ప్రశ్నలు లేదా సందేహాల కోసం, దయచేసి మా ఉచిత హెల్ప్‌లైన్ ను 844-844-8996 లో సంప్రదించండి. మీరు మాకు కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చు. మా కౌన్సిలర్లు ఇంగ్లీష్, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ, తెలుగు మరియు బెంగాలీ భాషలలో మాట్లాగలరు.

సూచన: ఈ విషయ వివరణ కేవలం సమాచారం కోసం మాత్రమే ఇవ్వబడినవి. దయచేసి సురక్షితంగా నిర్వహించుకోవడానికి అర్హత పొందిన ఆరోగ్య నిపుణుడిని సంప్రదించండి.

ब्लॉग लिखें

आपके जैसे अन्य माता पिता के साथ अपने अनुभव साझा करें

हिन्दी